ఫారెస్ట్ శాఖ ఆధీనంలో ఉన్న ఏనుగుతో జలాభిషేకానికి ఏర్పాట్లు
అద్దంకి: శ్రీ శింగరకొండ ప్రసన్నాంజనేయస్వామి దేవస్థానంలో ఈ నెల 15 నుంచి నిర్వహించనున్న మహా కుంభాభిషేకానికి మేనక అనే పేరు గల ఏనుగుతో జలాభిషేకం చేయించడానికి ఫారెస్ట్, దేవస్థాన అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఫారెస్టు శాఖ ఆధీనంలో ఉండే ఏనుగును శింగరకొండ రప్పించనున్నారు. ఇక్కడ ఏనుగుకు అవసరమైన వసతులు సక్రమంగా ఉన్నాయో లేదో తెలుసుకోవడానికి అధికారులు దేవస్థాన పరిసర ప్రాంతాలను ఆదివారం తనిఖీ చేశారు. ఫారెస్ట్ బీట్ అధికారి రమేశ్ మాట్లాడుతూ కుంభాభిషేకంలో గల యాత్రలో భాగంగా ఏనుగుతో జలాభిషేకం చేయాల్సి ఉన్నందున ఈ తనిఖీలు చేశామని తెలిపారు. ఆయన వెంట ఫారెస్ట్ రేంజ్ అధికారి ఈ.రమణారావు, సెక్షన్ అధికారి యం.వెంకటేశ్వర్లు, ఫారెస్ట్ బీట్ అధికారి కె.రమేశ్, దేవస్థాన ఈఓ తిమ్మనాయుడు ఉన్నారు.
పవర్ లిఫ్టింగ్‌లో షబీనాకు 4 స్వర్ణాలు
మంగళగిరి: ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌లో జరుగుతున్న ఏషియన్ జూనియర్ ఎక్యూప్డ్ ఉమెన్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్ షిప్‌లో దేశం తరఫున పాల్గొన్న షేక్ షబీనా 84 కేజీల విభాగంలో 4 బంగారు పతకాలు సాధించారు. ఈ మేరకు ఆదివారం గుంటూరు జిల్లా పవర్ లిఫ్టింగ్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్ సంధానిలు తెలిపారు. ఈ నెల 10వ తేదీన జరిగిన స్క్వాట్ 190 కేజీలు, బెంచ్ ప్రెస్ 85 కేజీలు, డెడ్ లిఫ్ట్ 180 కేజీలు, ఓవరాల్ 455 కేజీల విభాగాలలో పతకాలు కై వసం చేసుకున్నట్లు వెల్లడించారు. తెనాలికి చెందిన షబీనా మంగళగిరిలోని పవర్ లిఫ్టింగ్ కోచ్ షేక్ సంధాని వద్ద శిక్షణ పొందుతున్నారు. పతకాలు సాధించిన షబీనాను రాష్ట్ర, జిల్లా అసోషియేషన్ ప్రతినిధులు అభినందించారు.
వైభవంగా బ్రహ్మోత్సవాలు
పొన్నూరు: పట్టణంలోని శ్రీ సుందరవల్లీ సమేత సాక్షి భావన్నారాయణస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. కార్యక్రమాల్లో భాగంగా ఆదివారం ఉదయం పంచామృత స్నపన, తిరుమంజనోత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. భావనారాయణ స్వామి అలంకరణలో స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. అనంతరం శ్రీనివాస కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. గజ వాహనంపై స్వామి వారి గ్రామోత్సవం జరిగింది. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొని స్వామిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం సాయంత్రం 3 గంటలకు స్వామివారి రథోత్సవం వైభవంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.
ఘనంగా నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవం
తాడేపల్లి రూరల్: ఎంటీఎంసీ పరిధిలోని సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై ఆదివారం శ్రీ లక్ష్మీ నారసింహస్వామి తిరునక్షత్ర మహోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ నిర్వాహకులు పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ పరమహంస పరివ్రాజకులు త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్‌స్వామి మంగళాశాసనంలో ఉదయం 9 గంటలకు సర్వగ్రహ దోష నివారణ, దృష్టి దోష నివారణ కోసం లక్ష్మీ నారసింహస్వామి హోమం అంగరంగ వైభవంగా నిర్వహించామని, సాయంత్రం 6 గంటలకు పంచామృత అభిషేకం, స్వామి వారి కల్యాణం, మల్లె పుష్పార్చన ఉత్సవాలు నిర్వహించామని అనంతరం తీర్ధ ప్రసాద గోష్టి కార్యక్రమం నిర్వహించామని తెలిపారు.

కుంభాభిషేకానికి రానున్న ‘మేనక’