రూ.30 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ
కొరిటెపాడు(గుంటూరు): కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలేజ్డ్ ఆధ్వర్యంలో తులసి సీడ్స్ సహకారంతో 570 మంది పేద విద్యార్థులకు ఆదివారం రూ.30 లక్షల ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. స్థానికంగా ఉన్న ఓ కల్యాణ మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు మాట్లాడుతూ తాను పదో తరగతిలో ఉండగా కేవలం రూ.16 ఫీజు కట్టలేని గడ్డు పరిస్థితి ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. బీటెక్ ఇంటర్ చదివే రోజుల్లో ప్రభుత్వ ఉపకార వేతనం రూ.450 అందేదని చెప్పారు. జీవితంలో స్థిపడ్డాక 1995–96లో ఇద్దరు విద్యార్థులకు ఉపకార వేతనం ఇవ్వడం మొదలు పెట్టానని, ఇప్పుడు 36వేల మందికి రూ.22 కోట్లు ఉపకారవేతనంగా అందిస్తున్నానని వివరించారు. కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ అండ్ అండర్ ప్రివిలెజ్డ్ ట్రస్టు ద్వారా వీటిని పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. ఈ వితరణలో సింహభాగం తులసి సీడ్స్ సమకూరుస్తుందని వివరించారు.
తులసి ప్రభు అభినందనీయులు
కేంద్ర గ్రామీణాభివృద్ధి, కమ్యూనికేషన్‌ల శాఖ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ ఉపకారవ వేతనాలు అందించడం అభినందనీయమని తులసి రామచంద్ర ప్రభును ప్రశంసించారు. గుంటూరు సర్వజనాస్పత్రికి, మెడికల్ కళాశాలకు బస్సుల కోసం రూ.10 కోట్లు విరాళంగా ఇవ్వడం చాల గొప్ప విషయమని ప్రభుని అభినందించారు. అనంతరం 570 మంది విద్యార్థులకు రూ.30 లక్షల మేర ఉపకారవేతనాలను చెక్కుల రూపంలో అందించారు. కార్యక్రమంలో కృష్ణదేవరాయ ఎయిడ్ ఫర్ పూర్ – అండర్ ప్రివిలేజ్డ్ ట్రస్ట్ ట్రస్టీలు తులసి యోగిష్ చంద్ర, తులసి కృష్ణ చైతన్య, నారదాసు శ్రీహరిరావు, మలిశెట్టి సుబ్బారావు, ఉగ్గిరాల సీతారామయ్య, తోట శంకరరావు, తిమ్మిశెట్టి నారాయణరావు , చందనం శ్రీనివాస్ , పసుపులేటి రమణయ్య, అంకిరెడ్డి సాంబశివరావు , నారదాసు కోటేశ్వరరావు , జంగాల సాంబశివరావు , మేకల రవీంద్ర, పుచ్చకాయలు ఆనంద్, కె.నరేంద్రనాధ్ , దళవాయి సుబ్రహ్మణ్యం , మిరియాల శ్రీనివాస్ , పంతంగి జనార్దనరావు , తులసి ఆదిత్యచంద్ర తదితరులు పాల్గొన్నారు.


