గుంటూరు మెడికల్: గుంటూరు గవర్నమెంట్ జనరల్ హాస్పటల్(జీజీహెచ్) కార్యాలయ ఉద్యోగుల తీరుపై రోజురోజుకు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆర్డీ కార్యాలయంలో ఫార్మాసిస్టుల ప్రమోషన్‌లకు జీజీహెచ్ నుంచి జాబితాను పంపించే విషయంలో తప్పిదాలు చేసి మెమోలు పొందిన చరిత్ర ఇక్కడి కార్యాలయ ఉద్యోగులది. విషయమేమిటంటే.. 19 పారా మెడికల్ పోస్టులకు గుంటూరు వైద్య కళాశాలలో రిక్రూట్‌మెంట్ నిర్వహించి శుక్రవారం అపాయిమెంట్ ఆర్డర్స్ ఇచ్చారు. శనివారం విధుల్లో చేరేందుకు నియామక ఉత్తర్వులు తీసుకుని ఆసుపత్రికి వెళ్లిన ఉద్యోగులకు ఆ ఉత్తర్వుల్లోని తప్పిదాలతో గుండె ఆగినంత పనైంది. కాంట్రాక్టు ఉద్యోగానికి నియామక ఉత్తర్వులు ఇవ్వాల్సిన చోట అవుట్‌సోర్సింగ్ పేరుతో అపాయింట్‌మెంట్‌లో తప్పిదాలు టైపింగ్ చేశారు. దీంతో ఆందోళన చెందిన ఉద్యోగులు తమ అపాయింట్‌మెంట్ తప్పిదాలను సరిదిద్దాలని కోరినా అదేమీ కాదులే టేకిటీజీగా తీసుకోండంటూ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం ఉద్యోగులు సిల్లీగా సమాధానం చెప్పడం అభ్యర్థులకు విస్మయం కలిగించింది. గట్టిగా అడిగిన కొంతమందికి పెన్నుతో సరిదిద్ది మరికొంత మందిని సోమవారం రావాలని ఆదేశించారు. కార్యాలయ ఉద్యోగులు చేసిన తప్పిదాలకు తాము ఇబ్బందులు పడాల్సి వస్తుందని అభ్యర్థులు వాపోతున్నారు. ఇప్పటికై నా జీజీహెచ్ అధికారులు ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగంపై దృష్టి సారించి ఆసుపత్రి పరువు బజారున పడకుండా కాపాడాలని పలువురు కోరుతున్నారు.
కాంట్రాక్టు ఉద్యోగానికి బదులుగా
అవుట్‌సోర్సింగ్ అని టైపింగ్
జీజీహెచ్ ఎస్టాబ్లిష్‌మెంట్
సిబ్బంది తీరుపై ఆందోళన