గంజాయి రవాణా ముఠా అరెస్ట్‌

విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌   - Sakshi

● రూ.8 లక్షల విలువైన 180 కిలోల గంజాయి స్వాధీనం ● ఇద్దరు నిందితుల అరెస్ట్‌, మరొకరి కోసం గాలింపు ● వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ వకుల్‌ జిందాల్‌

బాపట్లటౌన్‌: జిప్సం లోడు ముసుగులో గంజాయిని రాష్ట్రాలు దాటిస్తున్న ఘరానా గంజాయి రవాణా ముఠాను మార్టూరు పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్‌ చేశారు. వారి వద్ద నుంచి రూ.8 లక్షల విలువ చేసే రూ.180 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం ఎస్పీ వకుల్‌జిందాల్‌ కేసు వివరాలను వెల్లడించారు. తూర్పుగోదావరి జిల్లా రౌతపూడి మండలం పరిపాక గ్రామానికి చెందిన కాకాటి లోపరాజు రెండు నెలల నుంచి తూర్పుగోదావరి జిల్లా చాగల్లు మండలానికి చెందిన సయ్యద్‌ రజాక్‌ వద్ద లారీ డ్రైవర్‌గా, విశాఖపట్నం జిల్లా గంట్యాడ మండలం పితావానిపాలెం గ్రామానికి చెందిన పితాని నాగఅప్పారావు క్లినర్‌గా పనిచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 20న వైజాగ్‌లోని కోరమండల్‌ ఇండస్ట్రీయల్‌ లిమిటెడ్‌లో జిప్సం లోడు వేసుకొని, కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గాలోని అల్ట్రాటెక్‌ లిమిటెడ్‌ కంపెనీకి తీసుకెళ్లాలని లారీ ఓనర్‌ డ్రైవర్‌కు సూచించారు. మార్గంలో అనకాపల్లిలోని భారత్‌ పెట్రోల్‌ బంకు దగ్గరకు వచ్చిన తరువాత తనకు ఫోన్‌ చేస్తే వచ్చి కలుస్తానని చెప్పారు. ఓనర్‌ ఆదేశాల మేరకు ఈ నెల 21న లారీని పెట్రోల్‌ బంక్‌ వద్ద నిలుపుదల చేశారు.

లారీ డ్రైవర్‌ ఇంటికి వెళ్లి స్నానం చేసివచ్చేసరికి లారీ ఓనర్‌ సయ్యద్‌ రజాక్‌ లారీని తీసుకెళ్లి జిప్సం మధ్యలో ఆరు బస్తాల గంజాయిని లోడ్‌ చేయించి జగ్గంపేట పరిధిలోని ఎర్రవరం టోల్‌గేట్‌ సమీపంలో డ్రైవర్‌కు అప్పగించాడు. ఈ నెల 24న మార్టూరు సర్కిల్‌ పరిధిలోని బొల్లాపల్లి టోల్‌ప్లాజా సమీపంలో మార్టూరు సీఐ వాహనాలు తనిఖీ చేస్తుండగా లారీలో జిప్సం మధ్యలో గంజాయి బస్తాలు ఉన్నట్లు గుర్తించారు. లారీతో పాటు డ్రైవర్‌, క్లీనర్‌ను అదుపులోకి తీసుకొని మార్టూరు ఇన్‌చార్జి తహసీల్దార్‌ బి.వెంకటరెడ్డి సమక్షంలో విచారించారు. జరిగిన వాస్తవాన్ని లారీ డ్రైవర్‌, క్లీనర్‌ పోలీసులకు తెలిపారు. దీంతో గంజాయి రవాణాకు పూనుకున్న లారీ డ్రైవర్‌ కాకాటి లోపరాజు, క్లీనర్‌ పితాని నాగఅప్పారావును అరెస్ట్‌ చేసి, గంజాయిని లారీలో లోడ్‌ చేయించిన లారీ ఓనర్‌ సయ్యద్‌ రజాక్‌ కోసం గాలిస్తున్నారు. అనంతరం కేసును చాకచక్యంగా ఛేదించిన బాపట్ల డీఎస్పీ ఎ. శ్రీనివాసరావు, మార్టూరు సీఐ షేక్‌ టి.ఫిరోజ్‌, మార్టూరు ఎస్‌ఐ కె.కమలాకర్‌, ఏఎస్‌ఐ షేక్‌ మహబూబ్‌బాషా, హెడ్‌ కానిస్టేబుళ్లు పీవీ సుబ్బారావు, ఇ.కోటేశ్వరరావు, జి.ప్రసాద్‌, కానిస్టేబుల్‌ డి.రాజేష్‌, ఏఆర్‌పీసీ జేపీ గురవయ్యకు ఎస్పీ వకుల్‌ జిందాల్‌ ప్రశంసా పత్రాలు అందజేసి అభినందించారు.

మద్యం సేవించి వాహనాలు నడిపితే

కఠిన చర్యలు

బాపట్లటౌన్‌: మద్యం సేవించి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ వకుల్‌జిందాల్‌ హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా శనివారం నో యాక్సిడెంట్‌ డేను నిర్వహించారు. ఎస్పీ వకుల్‌జిందాల్‌ మాట్లాడుతూ ప్రతి వాహనదారుడు రోడ్డు భద్రత, ట్రాఫిక్‌ నియమాలు తప్పక పాటించాలన్నారు. ద్విచక్ర వాహనంపై ప్రయాణించే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా హెల్మెట్‌ ధరించాలని చెప్పారు.

Read latest Bapatla News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top