
18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్న వన్‌టౌన్ పోలీసులు
చీరాల: మోటారుసైకిళ్ల దొంగను చీరాల వన్‌టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. పట్టణంలో కొంతకాలంగా మోటారు సైకిళ్లు చోరీకి గురవుతున్నాయి. వీటిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందడంతో వన్‌టౌన్ సీఐ మల్లికార్జునరావు ఆధ్వర్యంలో ఎస్‌ఐ అహ్మద్ జానీ ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిఘా పెట్టారు. పాత నేరస్తుడిని అదుపులోకి తీసుకుని విచారించగా మోటారు సైకిళ్ల దొంగతనం వెలుగులోకి వచ్చింది. అతని వద్ద నుంచి 18 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. శనివారం వన్‌టౌన్ సీఐ వివరాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా ఉంగుటూరుకు చెందిన షేక్ వెంకన్న సాహెబ్ అలియాస్ కన్నా అనే పాత నేరస్తుడు విజయవాడ, గుంటూరు, చీరాల ప్రాంతాల్లో సంచరిస్తున్నాడు. తెల్లవారుజామున ప్రధాన కూడళ్లు, ఇళ్ల వద్ద పార్కింగ్ చేసిన మోటారుసైకిళ్లను మారు తాళాలతో దొంగిలించి విక్రయిస్తున్నాడు. గతంలో గుంటూరు ప్రాంతంలో ద్విచక్ర వాహనాలతో పాటు స్పేర్ పార్టులు కూడా అమ్మి సొమ్ము చేసుకున్నాడు. ఈ నేరస్తుడిపై పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. కాగా చీరాల, విజయవాడ, గుంటూరు, ఒంగోలు ప్రాంతాల్లో దొంగిలించినట్లుగా నిందితుడు అంగీకరించాడు. కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
ఎన్‌ఎంఎంఎస్‌లో రాష్ట్ర స్థాయి రెండో ర్యాంకు
బల్లికురవ: నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్‌షిప్ పరీక్ష (ఎన్‌ఎంఎంఎస్)లో రాష్ట్ర స్థాయిలో రెండో ర్యాంకు, బాపట్ల జిల్లా స్థాయిలో మొదటి ర్యాంకును మాదాల హేమ స్రవంతి సాధించినట్లు కొప్పరపాడు ఉన్నత పాఠశాల హెచ్‌ఎం పి.శ్రీనివాసరావు తెలిపారు. ఈ పరీక్షలో ఆరుగురు విద్యార్థులు ప్రతిభ చూపడంతో శనివారం అభినందన సభ నిర్వహించారు. 8 వతరగతి చదువుతున్న మాదాల హేమస్రవంతి తల్లిదండ్రులు దానయ్య, నాగలక్ష్మిని సత్కరించారు. ఇదే పాఠశాల నుంచి వి.జాయిప్రిన్స్, ఎం.అక్షయబాయి, ఎం.రూపాబాయి, కె.అంజని జాహ్నవి, కె.వెంకట వైష్టవి స్కాలర్‌షిప్‌కు ఎంపికై నట్లు హెచ్‌ఎం తెలిపారు. విద్యార్థులను ప్రోత్సహించిన ఉపాధ్యాయులు జి.నాగేశ్వరరావు, పి.విజయరోజ్, హెచ్‌ఎంతో పాటు పీడీ యంజ విష్ణుప్రసాద్‌ని పీజేసీ చైర్మన్ దమ్ము అంజయ్య, సర్పంచ్ బండారు వెంకాయమ్మ, గురవయ్య గ్రామ పెద్దలు అభినందించారు.