
ప్రసన్నకుమార్ (ఫైల్)
● చెరువులో ఈతకు దిగిన ఇద్దరు స్నేహితులు దుర్మరణం ● గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బంది సాయంతో మృతదేహాల వెలికితీత ● ప్రత్తిపాడులో విషాదం
ప్రత్తిపాడు: సరదాగా చెరువు గట్టున సేదతీరుతూ కాలక్షేపం చేద్దామనుకున్న ఆ ఇద్దరు స్నేహితులను మృత్యువు వెంటాడింది. ఈత కొట్టేందుకు చెరువులోకి దిగిన ఇద్దరు మిత్రులను మృత్యవు కబళించిన విషాద ఘటన ప్రత్తిపాడులో చోటుచేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ప్రత్తిపాడుకు చెందిన చీలి ప్రసన్నకుమార్ (25), షేక్ నాగుల్ మీరా (22) స్నేహితులు. ఇద్దరూ శుక్రవారం ఉదయం స్థానిక రక్షిత మంచినీటి చెరువులో ఈతకు దిగారు. కొద్ది క్షణాలకే చెరువులో కూరుకుపోయి మునిగిపోయారు. అదే సమయంలో అటువైపుగా పొలానికి వెళుతున్న ఎం.పూర్ణచంద్రరావు వారిని గమనించి విషయాన్ని ప్రసన్నకుమార్ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. సమాచారం అందుకున్న ప్రత్తిపాడు ఎస్‌ఐ డి.రవీంద్రకుమార్ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. స్థానిక ఈతగాళ్లను చెరువులోకి దింపి గాలించారు. ఫలితం లేకపోవడంతో ఫైర్, ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలకు సమాచారమిచ్చారు. సుమారు మూడు గంటల పాటు శ్రమించి గజ ఈతగాళ్ల సాయంతో ఫైర్ సిబ్బంది, పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ఈ మేరకు మృతుల కుటుంబీకులు షేక్ మున్ని, సీహెచ్ శివకుమారి ఇచ్చిన ఫిర్యాదుల మేరకు ఎస్‌ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
గర్భిణికి పుట్టెడు శోకం..
భర్త దుర్మరణం భార్యకు పుట్టెడు శోకాన్ని మిగిల్చింది. మృతుడు ప్రసన్నకుమార్ కారు డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అతనికి కొన్నేళ్ల కిందట వివాహం అయ్యింది. కుమారుడు ఉన్నాడు. ప్రస్తుతం భార్య మూడవ నెల గర్భవతి. గురువారం ఉదయం డ్యూటీకి వెళ్లి వస్తానని ప్రసన్నకుమార్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం ప్రసన్నకుమార్ ఇంటికి వస్తాడని ఎదురుచూస్తుండగా, అతని మరణ వార్త రావడంతో భార్య గుండెలవిసేలా రోదిస్తోంది.
అమ్మను ఒంటిరిని చేసి..
షేక్ అబ్దుల్ గఫార్, మున్నికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు. నాగుల్‌మీరా ఒక్కడే కుమారుడు. తండ్రి అబ్దుల్ గఫార్ పదిహేడేళ్ల కిందట మరణించడంతో తల్లీ కొడుకులిద్దరే ఉంటున్నారు. నాగుల్‌మీరా బేల్దారు పనులు చేసుకుంటూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. చేతికొచ్చిన కొడుకు అర్ధంతరంగా మరణించడంతో ఆ తల్లి ఒంటిరి అయ్యింది. ఆమెకు అంతేలేని ఆవేదనను మిగిల్చింది. బిడ్డా నన్ను వదిలి వెళ్లావా.. అంటూ ఆ తల్లి రోదనలు చూపరులకు కంటతడిపెట్టించాయి.

షేక్ నాగుల్‌మీరా మృతదేహం

చీలి ప్రసన్నకుమార్ మృతదేహం

నాగుల్‌మీరా (ఫైల్)