
సెల్‌ఫోన్లు అందుకున్న వారితో ఎస్పీ వకుల్‌జిందాల్
బాపట్ల: సెల్‌ఫోన్ పోతే వెంటనే వాట్సాప్ నంబరు 8978777833కు ఫిర్యాదు చేయాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ చేసిన ప్రయోగం ఫలించింది. జిల్లాలో ఫోన్లు పోయిన బాధితుల వాట్సాప్ ఫిర్యాదులతో 645 మొబైల్‌ఫోన్లు గుర్తించి శుక్రవారం బాధితులకు అందించారు. ఈమేరకు శుక్రవారం స్థానిక ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఎస్పీ వకుల్ జిందాల్ మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో ప్రపంచం గురించి తెలుసుకోవడానికి, ప్రపంచానికి పరిచయం కావడానికి అరచేతిలో ఉండే స్మార్ట్ ఫోన్ దోహదపడుతుందని తెలిపారు. స్మార్ట్‌ఫోన్‌ల ఆవశ్యకత ప్రస్తుత సమాజంలో పెరిగిపాయిందని, ప్రతి ఒక్కరి జీవితంలో మొబైల్ అతి ముఖ్యమైన వస్తువుగా మారిందన్నారు. స్మార్ట్‌ఫోన్‌న్‌లలో ముఖ్యమైన సమాచారాన్ని, వ్యక్తిగత సమాచారాన్ని పొందుపరుస్తూ కోవటంతో ఫోను పొరపాటుగా పోగొట్టుకుంటే చాలా ఇబ్బందులుపడుతారని చెప్పారు. ఒకప్పుడు మొబైల్ ఫోన్‌లు పోగొట్టుకుంటే పోలీస్ స్టేషన్ లలో పిర్యాదు చేయడానికి సరైన పద్ధతి ఉండేదికాదని, ఇప్పుడు ప్రత్యేకంగా వాట్సాప్ ఫిర్యాదును పొందుపరిచామని తెలిపారు. మొబైల్ మిస్సింగ్ ఫిర్యాదులు స్వీకరించడం కోసం ఐటీ కోర్ సిబ్బందితో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేసి, ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్ పోగోట్టుకున్న బాధితుల కోసం ప్రత్యేక సర్వీస్ పిటిషన్లు అందుబాటులో ఉంచటం జరిగిందన్నారు. ఈ మేరకు జనవరి నుంచి వచ్చిన ఫిర్యా దులు మేరకు ఫోన్లు ట్రేసింగ్ చేయటం జరిగిందని తెలిపారు. సమావేశంలో అడిషనల్ ఎస్పీ మహేష్, సీఐ పి.కృష్ణయ్య ఉన్నారు.
ఎస్పీ వకుల్ జిందాల్ 645 మంది బాధితులకు సెల్‌ఫోన్లు అందజేత