సింహ రాశి: ఓర్పు ఉంటే మార్పు.. అక్టోబర్‌ తర్వాత అనుకూల పరిస్థితులు | Simha Rashi Ugadi Rashi Phalalu 2026-27 In Telugu, Know Your Sri Parabhava Nama Samvatsara Simha Rashi Astrology Predictions | Sakshi
Sakshi News home page

Simha Rashi Predictions: ఓర్పు ఉంటే మార్పు.. అక్టోబర్‌ తర్వాత అనుకూల పరిస్థితులు

Mar 18 2026 6:25 AM | Updated on Mar 18 2026 11:26 AM

Simha Rashi-Sri Parabhava Nama Samvatsara Rashi Phalalu 2026-27

ఆదాయం–5, వ్యయం–5, రాజయోగం–7, అవమానం–3.
మఘ 1,2,3,4 పాదములు (ము, మే, మూ, మే)
పుబ్బ 1,2,3,4 పాదములు (మో, టా, టే, టూ)
ఉత్తర 1వ పాదము (టే)

Simha Rashi Ugadi Rashi Phalalu 2026-2027: దైనందిన కార్యక్రమాలలో పనులు సమయానికి పూర్తికావు. కుటుంబ విషయాలలో మీ ప్రవర్తన ఇతర కుటుంబ సభ్యులకు ఇబ్బందికరం కాకుండా జాగ్రత్తపడండి. శుభకార్యాలలో తరచుగా బంధుమిత్రులను కలుస్తుంటారు. రోజువారీ స్నాన భోజన నిద్రాసమయాలు భంగపడేలా అనవసర కాలక్షేపాలు పెరుగుతాయి. పిల్లల వలన ఖర్చు పెరుగుతుంది. విరోధాలు ఎక్కువ అవుతాయి. అనవసర భయం పెరుగుతుంది. ఒక అవసరం కోసం ఉంచుకొన్న డబ్బు మరొకదానికి ఖర్చవుతుంది. అనవసర హామీలు ఇవ్వకండి. అక్టోబర్‌ నుంచి క్రమంగా మంచి మార్పులు ఉంటాయి. ఫైనాన్స్‌ వ్యాపారులకు మొండి బాకీలు పెరుగుతాయి. ఋణ వ్యవహారాలలో సమస్యలు ఎదురవుతాయి. ఆరోగ్య జాగ్రత్తలు అవసరం. ఉద్యోగాలలో సమయపాలన పాటించలేరు. మార్కెటింగ్‌ ఉద్యోగులకు మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ ఉంటుంది. 

నూతన ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నవారికి అక్టోబర్‌ తర్వాత క్రమంగా అనుకూలం. వ్యాపారులకు ద్వితీయార్ధం బాధాకరంగా ఉంటుంది. భాగస్వాములతో విభేదాలు వ్యాపారాలలో ఇబ్బందులు పెంచుతాయి. నూతన వ్యాపార ప్రయత్నాలలో ఆటంకాలు అధికం. షేర్‌ వ్యాపారులు ఓర్పుగా వ్యవహరించాలి. తప్పుడు సలహాలకు ఆకర్షితులై సమస్యలు తెచ్చుకుంటారు. విద్యార్థులకు వృథా కాలక్షేపాలు ఎక్కువవుతాయి. విదేశీ నివాస ప్రయాణ ప్రయత్నాల్లో ఆలస్యంగా పనులు పూర్తవుతాయి. కోర్టు వ్యవహారాలలో అనుకూల ఫలితాలు అందవు. స్థిరాస్తి వ్యవహారాల్లో ఇబ్బందులు ఉంటాయి. ఈ రాశి స్త్రీలకు ఆర్థిక అనుకూలత ఉండదు. ఉద్యోగ వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. వస్తువులు పోగొట్టుకోవడం వంటివి జరుగుతాయి. గర్భిణులు పెద్దలు, వైద్యుల సలహాలు అనుసరించడం మంచిది.

కర్కాటక రాశి: శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ – ఈ రాశి వారికి కష్టకాలం

మఘ: తెలివి బాగా పని చేస్తుంది. అక్టోబర్‌ నుంచి తెలివికి ధైర్యం తోడవుతుంది. ఆదాయ వ్యయ ఋణాలను సమతూకంగా నడపలేక శ్రమకు లోనవుతారు. కుటుంబ సభ్యులతో మోసపూరిత వాతావరణం ఉంటుంది.

పుబ్బ: మానసికంగా చికాకులకు లోనవుతారు. ప్రయాణాలలో వస్తువులు మరచిపోవడం వంటివి ఎక్కువగా జరుగుతుంటాయి. స్నేహితులతో కలిసి చేసే పనులలో సమస్యలు ఎదురవుతాయి. కుటుంబంలోని పెద్దల ఆరోగ్య విషయంలో ఖర్చులు అధికం అవుతాయి.

ఉత్తర 1: ఇతరుల వ్యవహారాలలో కలుగ చేసుకోకండి. పనుల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి. నమ్మినవారు సరిగా సహకరించరు. పనివారు తరచుగా ఇబ్బందులు సృష్టిస్తారు. వ్యాపారులు ఒత్తిడికి లోనవుతారు. లాభాలు లేని వ్యాపారం చేయవలసి ఉంటుంది.
శాంతి మార్గం: శని రాహు కేతు గురువులకు శాంతి చేయించండి. రోజూ గోపూజ, నవగ్రహ పూజ చేయడం శ్రేయస్కరం. నిత్యం రావిచెట్టు కింద ఆంజనేయస్వామి ఉన్న దేవాలయంలో ‘శ్రీరామ శ్శరణం మమ’ అని చెబుతూ 11 ప్రదక్షిణలు చేయడం, చతుర్ముఖ రుద్రాక్షధారణ శుభప్రదం.

ఏప్రిల్‌: పుణ్యకార్యాలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి విషయాలలో దృష్టి ఉంచలేరు. మాటతీరు నియంత్రించుకోవాలి. ప్రయాణ అసౌకర్యాలు తరచుగా ఉంటాయి. బంధుమిత్రుల కలయికలు ఉంటాయి. షేర్‌ వ్యాపారులు, మార్కెటింగ్‌ ఉద్యోగులు సత్ఫలితాలను సాధిస్తారు. 

మే: ఆగ్రహావేశాలను అదుపు చేసుకోవాలి. వృత్తి ఉద్యోగాలలో గొప్పగా వ్యవహరిస్తారు. అయితే ఫలితాలు గొప్పగా ఉండవు. రోజువారీ కార్యక్రమాలు సరిగా సాగవు. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.  కుటుంబంలోని పెద్దల ఆరోగ్యం పట్ల ముందు జాగ్రత్తలు తీసుకుంటారు. 

జూన్‌: ఇబ్బందులు రాకుండా జాగ్రత్త పడతారు. పని ఒత్తిడి పెరుగుతుంది. 20వ తేదీ తర్వాత ఆరోగ్య ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగ వ్యాపారాలలో సరిగా దృష్టి ఉంచలేని స్థితి. శ్రమతో పనులు పూర్తవుతాయి. విద్యార్థులకు ఒత్తిడి. షేర్‌ వ్యాపారులు, మార్కెటింగ్‌ ఉద్యోగులు సక్సెస్‌ అవుతారు. 

జులై: ఉద్యోగరీత్యా తిరుగుడు పెరుగుతుంది. వృత్తి ఉద్యోగాలలో మంచి మార్పులు గమనిస్తారు. జీర్ణ సమస్యలు ఇబ్బంది పెడతాయి. శుభ, పుణ్యకార్య ప్రయత్నాలలో విశేష లాభాలు అందుకుంటారు. సమయపాలన పాటించక ఇబ్బందులు కొని తెచ్చుకుంటారు.

ఆగస్ట్‌: వ్యర్థ ప్రయాణాలు, వ్యర్థ కాలక్షేపాలు విరమించుకోవడం మంచిది. వాహనాలు యంత్ర పరికరాలు ఇబ్బంది పెడతాయి. వృథా ఖర్చులు పెరుగుతాయి. కుటుంబంలో చికాకులు తలెత్తుతాయి. విద్యా వ్యాసంగం బాగుంటుంది. స్థిరాస్తులు, వాహనాల అమ్మకాలలో జాగ్రత్తలు పాటించాలి. 

సెప్టెంబర్‌: ఆరోగ్యం విషయంలో 18వ తేదీ తరువాత  జాగ్రత్త వహించాలి. ఋణ ఇబ్బందులు రాకుండా జాగ్రత్తపడాలి. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు 18వ తేదీ వరకు సానుకూలం షేర్‌ వ్యాపారులు దూకుడు తగ్గించాల్సిన కాలం. విద్యార్థులకు రైతులకు ప్రత్యేక జాగ్రత్తలు అవసరము. 

అక్టోబర్‌: అధికారుల ఆగ్రహావేశాలు ఎక్కువ అవుతాయి. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. బుద్ధి స్థిమితం కోల్పోవుతారు. బంధువులతో కలసి చేసే పనులలో జాగ్రత్తలు పాటించాలి. వ్యాపారులకు ఇబ్బందికర ఘటనలు ఎక్కువ అవుతాయి. కుటుంబ సభ్యులతో సఖ్యత ఉండదు. 

నవంబర్‌: బుద్ధి స్థిరత్వం తరచుగా తగ్గుతుంది. ఇతరుల వ్యవహారాలలో కలుగచేసుకోవద్దు.  కుటుంబ విషయాలు అస్తవ్యస్తంగా నడుస్తాయి. కొత్త ప్రయత్నాలు చేయకండి. ఆర్థిక విషయాల్లో ఎవరికీ హామీలు ఇవ్వవద్దు. నూతన ఉద్యోగ, వ్యాపారాలలో ప్రయత్నాలు సఫలం అవుతాయి. 

డిసెంబర్‌: ప్రతి పనిలోనూ అవరోధాలు ఎదురైనా, వాటిని అధిగమిస్తారు. ఓర్పుగా సమస్యలు దాటగలరు. కొత్త ప్రయత్నాలు చేయవద్దు. మితభాషణ  అవసరం. ఇతరులను నమ్మి ఆర్థిక లావాదేవీలు చేయవద్దు. పాత ఆరోగ్య, ఆర్థిక సమస్యలు తిరగ బెట్టకుండా జాగ్రత్తలు పాటించండి. 

జనవరి: ప్రతి విషయంలో ఒత్తిడి పెరుగుతుంది. ఉద్యోగ వ్యాపారాలు అనుకూలం కాదు. ఆర్థిక లావాదేవీలు సానుకూలంగా సాగవు. నూతన ఉద్యోగ వ్యాపార ప్రయత్నాలు కూడా సానుకూలం కాదు. ఖర్చులు, అనారోగ్యం ఇబ్బంది పెడతాయి. కుటుంబ సభ్యులకు వచ్చే సమస్యలు మీ పనులను పాడు చేస్తాయి. వాహన సౌకర్యం కూడా సరిగా ఉండదు అనే చెప్పాలి. 

ఫిబ్రవరి: పాత కుటుంబ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఋణ సమస్యలు తిరగబెట్టకుండా జాగ్రత్తపడండి. ఆదాయ వ్యయాలు సమన్వయంతో ఉండవు. అధికారుల అనాదరణ, తోటివారితో సహాయ నిరాకరణ వలన పని ఒత్తిడి పెరుగుతుంది. ఇతరుల మీద ఏమాత్రం ఆధారపడినా ఇబ్బందులు తప్పవు. ప్రయాణాలు తగ్గించడం శ్రేయస్కరం. 

మార్చి: తొందరపాటుగా ప్రవర్తించడం మంచిదికాదు. భోజన సౌఖ్యం కొరవడుతుంది. వాహన చికాకులు ఉంటాయి. ఇతరుల నుంచి ఆశించిన రీతిగా సహకారం అందదు. ప్రతి పనిలోనూ శ్రమాధిక్యం. ఉద్యోగంలో పని బాధ్యత పెరుగుతుంది. వ్యాపారులకు శ్రమ ఎక్కువ, లాభం తక్కువగా ఉంటుంది. ఆర్థిక వెసులుబాటు తక్కువగా ఉంటుంది. ఋణాలు చేయకపోవడం మంచిది.

Advertisement
 
Advertisement
Advertisement