రెడ్డెమ్మ ఆలయంలో భక్తుల రద్దీ | - | Sakshi
Sakshi News home page

రెడ్డెమ్మ ఆలయంలో భక్తుల రద్దీ

May 4 2026 7:43 AM | Updated on May 4 2026 7:43 AM

గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీంలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించడం గమనార్హం.

పాముకాటుతో

కౌలు రైతు మృతి

వాల్మీకిపురం : పాముకాటుతో కౌలు రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని అయ్యవారిపల్లిలో ఆదివారం చోటు చేసుకుంది. వివరాలు.. అయ్యవారిపల్లికి చెందిన నాగమల్లు (65) వ్యవసాయ కూలీగా పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గత కొంత కాలంగా గ్రామంలో రెండు ఎకరాల పొలం కౌలుకు తీసుకొని రూ.2 లక్షలు అప్పు చేసి భూమి సాగు చేస్తున్నాడు. ఎకరం వరి, ఎకరం పశుగ్రాసం వేసుకొని పాడి ఆవులతో జీవనం సాగిస్తున్నాడు. గత మూడు రోజుల కిందట పశుగ్రాసం తీసుకొచ్చేందుకు నాగమల్లు పొలం వద్దకు వెళ్లాడు. అక్కడ పాము కాటు వేసింది. అపస్మారక స్థితిలో ఉన్న నాగమల్లును స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లెకు రెఫర్‌ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆదివారం అంత్యక్రియలు నిర్వహించారు.

యువతి ఆత్మహత్య

ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని సంజీవనగర్‌లో లావణ్య (22) అనే యువతి శనివారం రాత్రి ఆత్మహత్య చేసుకుంది. టూటౌన్‌ పోలీసులు తెలిపిన సమాచారం మేరకు.. సంజీవనగర్‌లో నివాసం ఉంటున్న మాధవ్‌ కుమార్తె లావణ్య డిగ్రీ వరకు చదువుకుంది. ఈమె పట్టణంలోని ఒక ఈఎన్‌టీ ఆస్పత్రిలో రిసెప్షనిస్ట్‌గా పనిచేస్తోంది. ఈమెకు ఇటీవల ఇంట్లో పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. ఐతే పెళ్లి చేసుకోవడానికి యువతి నిరాకరించడంతో తల్లిదండ్రులు దండించారు. దీంతో యువతి రాత్రి ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆదివారం ఉదయం 5 గంటలు దాటినా లావణ్య నిద్ర లేవకపోవడంతో కుటుంబ సభ్యులు తలుపు కొడుతూ ఎంత పిలిచినా ఆమె పలకలేదు. దీంతో తలుపులు పగలగొట్టి చూడగా అప్పటికే ఉరి వేసుకుంది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్‌ నిర్ధారించారు. తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement