మదనపల్లె టౌన్ : టమాటా మండీలో పనిచేస్తున్న వలస కార్మికుడిపై తన ప్రత్యర్థి రాళ్లతో దాడి చేసిన సంఘటన ఆదివారం సాయంత్రం కురబల కోట మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. బీహార్‌కు చెందిన 100 మంది వలస కూలీలను మూడు నెలల క్రితం శ్యాంసుందర్ పనుల నిమిత్తం అన్నమయ్య జిల్లా, తంబళ్లపల్లె నియోజకవర్గం లోని కురబలకోట మండలం, అంగళ్లు టమాటా మండికి తీసుకు వచ్చాడు. శ్యాంసుందర్ చెప్పినట్లు వినడం లేదని, వారితో తగువు పడ్డా డు. దీంతో మాటమాట పెరిగి వలస కూలి అయిన జూనాముఖియా (29)పై శ్యాం సుందర్ రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితున్ని సహచర కూలీలు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలు కుంటూ ఉన్నాడు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
యువతి అదృశ్యంపై ఫిర్యాదు
మైదుకూరు : పట్టణంలోని కొత్తకొట్టాలుకు చెందిన బుచ్చిగారి నందిని అనే 18 ఏళ్ల యువతి కనిపించడం లేదని ఆదివారం అర్బన్ పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నందిని తల్లి కువైట్‌కు వెళ్లింది. తండ్రి పుల్లయ్య ఉన్నాడు. యువతి తన మేనత్త సుభాషిణి సంరక్షణలో కొత్తకొట్టాలు ప్రాంతంలో ఉంటోంది. ఇటీవల కడపలో ఇంటర్మీడియట్ పూర్తి చేసింది. శనివారం రాత్రి నుంచి తన మేనకోడలు కనిపించడం లేదని సుభాషిణి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని యువతి ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
బైక్‌ను ఢీ కొట్టిన కారు..
ఒకరికి తీవ్రగాయాలు
రాజంపేట : పట్టణంలోని జీకేఎస్సార్ కల్యాణమండపం(తిరుపతి బైపాస్‌రోడ్డు)లో ఆదివారం గుర్తుతెలియని కారు, బైక్‌ను ఢీ కొట్టింది. బైక్‌పై వెళుతున్న వ్యక్తి తీవ్రంగా గాయపడ్డారు. ఢీ కొట్టిన కారు వెళ్లిపోయింది. పోలీసులు సంఘటన స్ధలానికి వెళ్లి పరిశీలించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఎటువంటి ప్రాణపాయం లేదని పోలీసులు తెలిపారు.
టిడ్కో ఇళ్లలో
విద్యుత్ వైర్ల చోరీకి యత్నం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల మున్సిపాలిటీ పరిధిలో ఉన్న టిడ్కో ఇళ్లలో ఉన్న విద్యుత్ వైర్ల చోరీకి దొంగలు ప్రయత్నించారు. ఈ విషయాన్ని గమనించిన టిడ్కో నిర్వాహుకులు దొంగను పట్టుకుని దేహశుద్ది చేశారు. మున్సిపల్ కమిషనర్‌కు సమాచారం అందించారు. మున్సిపల్ కమిషనర్ శేషఫణి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అతన్ని పట్టుకున్నారు. బ్యాగ్ తనిఖీ చేశారు. బ్యాగ్‌లో ఉన్న విద్యుత్‌వైర్ల కట్టర్లను స్వాఽధీనం చేసుకున్నారు.


