పరిహారం..పరిహాసం..!
కడప సిటీ/కొండాపురం : గండికోట ప్రాజెక్టు నిర్మాణానికి త్యాగం చేసిన నిర్వాసితులకు పెండింగ్‌లో ఉన్న పరిహారం అందక తీవ్ర ఆవేదన చెందుతున్నారు. మొదటి విడతలో అప్పటి టీడీపీ ప్రభుత్వం 7917 మందికి రూ. 332 కోట్లు పరిహారం అందజేసింది. పునరావాసం కావాల్సిన వారికి రూ. 3.25 లక్షలు, పునరావాసం వద్దని చెప్పిన వారికి రూ. 6.75 లక్షలు పరిహారం అందజేశారు. అయితే 9096 మంది నిర్వాసితులు ఉండగా, అర్హులు కాదని తగ్గించి రూ. 427 కోట్లలో రూ. 52 కోట్లు వివిధ అవసరాలకు ఉపయోగించారు. ఈ క్రమంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అఽధికారం చేపట్టాక ఈ మొత్తాన్ని రూ. 10 లక్షలకు పెంచారు. మొత్తం 22 ముంపు గ్రామాలు ఉండగా, మొదటి విడతలో 15 గ్రామాలు, రెండవ విడతలో 7 గ్రామాలు ఉన్నాయి. రెండవ విడతకు సంబంధించి ఒక పెంజి అనంతపురం తప్ప మిగతా గ్రామాలకు రూ. 10 లక్షలు చొప్పున వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో అందజేశారు. మొదటి విడత గ్రామాలకు కూడా అందజేయాలన్న క్రమంలో ఎన్నికలు రాగా, ఆ తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఎన్నికల ప్రచారంలో ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి రూ. 10 లక్షలకు అదనంగా మరో రూ. 2 లక్షలు పెంచి పరిహారం అందిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు కార్యరూపం దాల్చలేదు.
పెండింగ్‌లో ఉన్న పరిహారం
ప్రస్తుతం గండికోట ప్రాజెక్టుకు సంబంధించిన ముంపు గ్రామాలకు ఇంకా పూర్తి స్థాయిలో పరిహారం అందలేదు. మొదటి విడత 14 గ్రామాలకు అదనంగా ఒక్కొక్క నిర్వాసితునికి రూ. 3.25 లక్షలు ఇవ్వాల్సి ఉంది. అలాగే రెండవ విడత గ్రామాల్లో పెంజి అనంతపురంలో 677 మందికి రూ. 67.07 కోట్లు పరిహారం ఇవ్వాల్సి ఉంది. రెండవ విడత గ్రామాలకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో పరిహారం ఇవ్వడంతో పూర్తి స్థాయిలో ప్రాజెక్టులో నీటిని నింపేందుకు అవకాశం ఏర్పడింది. పరిహారం విషయంపై ఇంతవరకు సమావేశాలు నిర్వహించడమే కానీ, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ఇప్పించిన దాఖలాలు లేవని నిర్వాసితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
హామీ నెరవేర్చని ‘ఆది’
ఎన్నికల సమయంలో ఇప్పుడు ప్రకటించిన పరిహారం కంటే నిర్వాసితులందరికీ మరో రూ. 2 లక్షలు అదనంగా పరిహారం అందజేస్తామని ప్రస్తుత బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నిర్వాసితులకు హామీ ఇచ్చారు. కానీ ఇంతవరకు సమావేశాలకే పరిమితమయ్యారు. కలెక్టర్‌తో మాట్లాడామని, ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లామని ఆదినారాయణరెడ్డి చెప్పుకొస్తున్నారు. కానీ ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదికి పైగా అయినప్పటికీ హామీ నెరవేర్చకపోవడం నిర్వాసితులను నిరాశ పరుస్తోంది. దీంతో తీవ్ర ఆవేదన చెందుతున్నారు. చెప్పిన మాట నిలబెట్టుకోవాలని నిర్వాసితులు నిలదీస్తున్నారు.
పునరావాస కేంద్రాల్లో అరకొర వసతులు..
ముంపు గ్రామాలకు సంబంధించిన పునరావాస కేంద్రాల్లో కొన్నింటిలో మౌలిక వసతుల కొరత వెంటాడుతోంది. సాధారణంగా బడి, గుడి, ఈద్గాతోపాటు సిమెంటు రోడ్లు, డ్రైనేజీ, తాగునీరు అందించాల్సి ఉంటుంది. బొమ్మేపల్లె, దొరువుపల్లి, బుక్కపట్నం కాలనీల్లో ప్రభుత్వ పాఠశాలలకు శాశ్వత భవనాలు లేవు. తాత్కాలిక భవనాల్లో అరకొరగా వసతులు ఏర్పాటు చేశారు. సిమెంటు రోడ్లు లేక వర్షం వచ్చినప్పుడు బురదమయంగా మారుతుండడంతో అక్కడి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొండాపురంలో హైస్కూలు తరగతులను తాత్కాలికంగా వేరే భవనంలో నిర్వహిస్తున్నారు.
గండికోట ప్రాజెక్టు నిర్వాసితులకు
రూ. 521.07 కోట్లు పెండింగ్‌లో ఉన్న పరిహారం
దీనికి అదనంగా మరో రూ. 2 లక్షలు పెంచి పరిహారం ఇస్తామని ‘ఆది’ హామీ
కొన్ని పునరావాస కేంద్రాల్లో
మౌలిక వసతులు అంతంత మాత్రమే
వైఎస్ జగన్ హయాంలో పరిహారం రూ. 10 లక్షలకు పెంపు
పెంజి అనంతపురానికి
పైసా కూడా అందని వైనం
ఆవేదనలో నిర్వాసితులు
పరిహారం..పరిహాసం..!


