చేసిన అభివృద్ధిని చూపడానికి దమ్ము ఎందుకు ?
● ఎక్కడ సమావేశం పెట్టినా చర్చకు సిద్ధం
● ఉద్వేగాలు సృష్టించే విధంగా
ప్రవర్తించడం సరికాదు
● మంత్రి రాంప్రసాద్ రెడ్డి విమర్శలకు గడికోట శ్రీకాంత్ రెడ్డి కౌంటర్
రాయచోటి అర్బన్ : వైఎస్ జగన్ హయాంలో రాయచోటి ప్రాంతంలో జరిగిన అభివృద్ధి అందరికీ తెలిసిందే. చారిత్రాత్మకంగా అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని ఏర్పాటు చేసుకోగలిగాం. కొంత వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా రెచ్చ గొట్టే విధానాలు అవలంభిస్తూ, ఉద్వేగాలు సృష్టించే విధంగా మాట్లాడటం సరికాదని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన రాయచోటిలో విలేకర్లతో మాట్లాడుతూ రెండు రోజుల క్రితం రాయచోటి అభివృద్ధిపై, వైఎస్సార్‌సీపీ నాయకులపై మంత్రి రాంప్రసాద్ రెడ్డి చేసిన విమర్శలకు ఆయన స్పందించారు. వైఎస్ జగన్ హయాంలో రాయచోటి నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూపించుకోవడానికి దమ్ము, ధైర్యం అవసరం లేదన్నారు. అధికారంలో ఉన్న మీరు, అన్ని శాఖల అధికారులను కూడా పిలిపించుకుని సమావేశం ఏర్పాటు చేస్తే, జరిగిన అభివృద్ధిని నోటి మాటలతో చెప్పేందుకు నేను ఒక్కడినే చర్చకు వచ్చేందుకు సిద్ధం అని శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అభివృద్ధిని చెప్పేందుకు, చూపించేందుకు నేను తాను సిద్ధమని పేర్కొన్నారు. దేవుడి దయతో పెద్ద పదవిని అలంకరించారని, ఇటువంటి సమయంలో ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయాలేకానీ, ఉద్వేగాలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడటం సరికాదని మంత్రి రాంప్రసాద్ రెడ్డిని ఉద్దేశించి అన్నారు. ఈ ప్రాంతం గురించి చులకనగా మాట్లాడిన ఆదోని ఎమ్మెల్యేను అసెంబ్లీలో మీరు ఎందుకు నిలదీయలేదని ప్రశ్నించారు. దీంతో పాటు ఇంట్లో పడుకున్నా జరిగే పనులు జరుగుతాయనడం ఎంత వరకు సమంజసమో వారికే తెలియాలన్నారు.
జిల్లా విభజన ఆపేందుకు
కృషి చేయాలని హితవు
కనిపిస్తున్న అభివృద్ధిపై విమర్శలు కాకుండా ప్రస్తుతం అన్నమయ్య జిల్లా విభజన జరుగుతుందని వస్తున్న వార్తల గురించి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ ఈ ప్రాంత వాసిగా రాయచోటిని జిల్లా కేంద్రం చేయడానికి తాను ఎంతో కృషి చేశానన్నారు. ఇప్పుడు జిల్లాను విభజించేందుకు కూటమి ప్రభుత్వం పూనుకుంటోందని, ఈ ప్రాంతం నుంచి పదవిలో వారు జిల్లా విభజన జరగకుండా , జిల్లా కేంద్రం రాయచోటి నుంచి తరలించకుండా క్యాబినెట్‌లో చర్చించాలని మంత్రికి హితవు పలికారు. అన్నమయ్య జిల్లా నుంచి మదనపల్లెను వేరు చేస్తే జిల్లాకు భవిష్యత్ ఉండదనే అభిప్రాయం వ్యక్తం చేశారు. సమావేశంలో మున్సిపల్ ఛైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రెహ్మాన్, వైఎస్సార్‌సీపీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిమి హారున్ బాషా, జిల్లా మైనార్టీ అధ్యక్షులు బేపారి మహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.


