ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలి
● మత్తు పదార్థాల విక్రయాలు,
తరలింపుపై కఠిన చర్యలు
● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి
రాయచోటి : పోలీసు అంటే నమ్మకం కలిగేలా సిబ్బంది పనిచేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీసు అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయచోటిలోని పోలీసు ప్రధాన కార్యాలయం సమావేశ మందిరంలో నిర్వహించిన నెలవారి నేర సమీక్షా సమావేశంలో ఆయన అధికారులకు దిశా నిర్దేశం చేశారు. విధుల నిర్వహణలో ప్రజలతో బాధ్యతతో మర్యాదగా వ్యవహరించాలని సూచించారు. పెండింగ్‌లో ఉన్న కేసులపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పోలీసుశాఖ పట్ల ప్రజలలో విశ్వసనీయత పెంచేలా ప్రతి అధికారి పనిచేయాలన్నారు. నేర నియంత్రణలో కఠినత్వం చూపాలన్నారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. నిషేధిత మత్తు పదార్థాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలను చైతన్యవంతం చేయాలని ఆదేశించారు. క్రికెట్ బెట్టింగ్‌లు, కోడి పందేలు, జూదం ఇతర చట్టవ్యతిరేక కార్యక్రమాలు జిల్లాలో ఎక్కడా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని తెలిపారు. నేర పరిశోధనలో ఆధునిక టెక్నాలజీని, శాసీ్త్రయ పద్ధతులను ఉపయోగిస్తే కేసుల పరిష్కారం సులభతరం అవుతుందన్నారు. వాట్సప్, ఫేస్‌బుక్ వంటి సామాజిక మాధ్యమాలపై నిరంతరం నిఘా ఉంచాలన్నారు. సమావేశంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, మదనపల్లి డీఎస్పీ ఎస్ మహేంద్ర, రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, జిల్లాలోని సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు.
ప్రజలకు నమ్మకం కలిగేలా విధులు నిర్వర్తించాలి


