
నాణ్యత నీళ్లకే ఎరుక
కాలువ పక్కన పడిన గండి
మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు పుంగనూరు ఉపకాలువ (పీబీసీ)కు కాంక్రీట్ లైనింగ్ పిడకలా ఊడిపోవడం పనుల నాణ్యతను ప్రశ్నించేలా చేస్తోంది. బి.కొత్తకోటలో గురువారం రాత్రి భారీ వర్షం కురిసింది. వర్షం నీళ్లు వాగులు, వంకలు, చెరువుల్లోకి ప్రవహించాయి. ఇదే విధంగా బి.కొత్తకోట–బడికాయలపల్లె మార్గం సమీపంలోని పీబీసీ కాలువ 102 కిలోమీటర్ వద్ద కాలువకు వేసిన కాంక్రీట్ లైనింగ్ కూలిపోయింది. లైనింగ్ ఒకరకమైన ఆకారంలో కూలగా అంచున చీలింది. దానివద్ద నీళ్లు కాలువ నుంచి గండిపడి బయటకు వెళ్లాయి. ఇలా ఎందుకు జరిగింది అనేదానిపై పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. లైనింగ్ పనుల్లో నాణ్యత లోపించిందా లేక మరేదైనా జరిగిందా అనే ప్రశ్నలు ఉత్పన్నం అవుతున్నాయి. పలుచోట్ల కాలువలో నీటి ప్రవాహం వెళ్తున్న ఎత్తులో కాంక్రీట్ పనులు దెబ్బతిన్నట్టు కనిపిస్తున్నాయి. అయితే నీటి ప్రవాహం తగ్గాక కాని కాంక్రీట్ లైనింగ్ పనులపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. కానీ 102 కిలోమీటర్ వద్ద ఊడిన కాంక్రీటు లైనింగ్ వ్యవహరంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. నాణ్యతలేక ఊడిందా లేకపోతే నీటి మళ్లింపు కోసం ఎవరైనా తెగ్గొట్టారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయమై ప్రాజెక్టు ఎస్‌ఈ విఠల్ ప్రసాద్ మాట్లాడుతూ కాంక్రీట్ దెబ్బతిన్న ప్రాంతానికి చెందిన రైతులు లైనింగ్‌ను తెగ్గొట్టడం వల్లే ఊడిపోయిందని,నాణ్యతా లోపం కాదని చెప్పారు. దీనిపై చర్యలు తీసుకోవాలని ఈఈ, డీఈలకు ఆదేశించగా పరిశీలించినట్లు చెప్పారు.