
ఉపాధ్యాయుల ఇళ్లే టార్గెట్!
రాజంపేట టౌన్ : రాజంపేట పట్టణంలో ప్రభుత్వ ఉపాధ్యాయుల ఇళ్లే లక్ష్యంగా దొంగలు చోరీలకు పాల్పడుతున్నారు. ఈనెల 1వ తేదీ నుంచి 11వ తేదీ వరకు నలుగురు ఉపాధ్యాయుల ఇళ్లల్లో చోరీలు జరిగాయి. ఇసుకపల్లె ప్రాథమిక పాఠశాలలో హెడ్ టీచర్‌గా పనిచేసే సాయిప్రసాద్ పట్టణంలోని విద్యానగర్‌లో నివాసం ఉంటున్నారు. ఈనెల 1వ తేదీ సాయిప్రసాద్ కుటుంబంతో సహా టూర్‌కు వెళ్లగా అదే రోజు రాత్రి దొంగలు ఆయన ఇంటిలో చోరీకి పాల్పడ్డారు. ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారం దాదాపు ఆరు లక్షల విలువచేసే బంగారు వస్తువులను దొంగలు దొంగిలించుకుపోయినట్లు సాయిప్రసాద్ తెలిపారు. అలాగే పట్టణంలోని మన్నూరులో నివాసం ఉంటున్న రిటైర్డ్ ఉపాధ్యాయిని సుజాత కుటుంబ సభ్యులు వ్యక్తిగత పనిపై ఈనెల 8తేదీ ఉదయం కడపకు వెళ్లి అదే రోజు సాయంత్రం ఇంటికి వచ్చేలోపు దొంగలు చోరీకి పాల్పడ్డారు. పట్టపగలే దొంగలు ఇంటి తలుపు తాళాలు పగులగొట్టి దొంగతనం చేయడం గమనార్హం. దాదాపు 20 తులాల బంగారు, నాలుగు లక్షల నగదు, మూడు వందల గ్రాముల వెండి చోరీకి గురైనట్లు సుజాత తెలిపారు. మండలంలోని కొండ్లోపల్లె ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న సోమశేఖర్ మన్నూరులో నివాసం ఉంటుంన్నారు. ఆయన కుటుంబ సభ్యులతో హైదరాబాద్‌లో ఉంటున్న తన కుమార్తె ఇంటికి వెళ్లగా ఈనెల 8వ తేదీ రాత్రి సోమశేఖర్ ఇంటిలో దొంగలు పడి చోరీకి పాల్పడ్డారు. దాదాపు రెండు లక్షల రూపాయల విలువ చేసే వెండినగలను దోచుకెళ్లినట్లు ఆయన తెలిపారు. మండలంలోని జి.ఒడ్డిపల్లె ప్రాథమిక పాఠశాలలో హెచ్‌ఎంగా పనిచేస్తున్న మురళీ మనోహర్ కుటుంబ సభ్యులతో బెంగళూరులో ఉంటున్న తన కుమారుడి వద్దకు వెళ్ళగా ఆదివారం రాత్రి దొంగలు పడ్డారు. అరవై గ్రాముల బంగారును దొంగలు ఎత్తుకెళ్లినట్లు మురళీ మనోహర్ తెలిపారు.
బలమైన తలుపు తాళాలను సైతం
బద్ధలు చేస్తున్న దొంగలు..
దొంగలు బలమైన తాళాలను సైతం బద్ధలు చేస్తున్నారు. ఇంటికి ఉన్న సేఫ్టీ గ్రిల్‌కు వేసిన తాళాన్ని పగులగొట్టి ఆ తరువాత బలంగా ఉండే ప్రధాన ద్వారం తాళాన్ని తొలగిస్తున్నారు. ప్రధాన ద్వారం తాళాలను తొలగించిన విధానాన్ని పరిశీలిస్తే ఒకే ముఠా ఈ చోరీలకు పాల్పడినట్లు అర్థమవుతోంది. దొంగలు తాళాలను తొలగించేందుకు స్క్రూ డ్రైవర్, కటింగ్‌ప్లేయర్, సుత్తివంటి వాటిని ఉపయోగించి సులువుగా తాళాలను తొలగించేస్తున్నట్లు తెలుస్తోంది.
రాజంపేటలో వరుస చోరీలు

ఉపాధ్యాయుల ఇళ్లే టార్గెట్!