– సీసీ కెమెరాల్లో బయటపడ్డ వైనం
మదనపల్లె : కంచె చేను మేసిందన్న చందాన.. పని వారే దుకాణంలో దొంగతనానికి పాల్పడ్డారు. టూటౌన్ సీఐ ఎస్.మురళీకృష్ణ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె రాధాకృష్ణ సిల్క్స్ వస్త్ర దుకాణంలో కొంత కాలంగా స్టాక్‌లో తేడాలు వస్తుండటంతో.. అనుమానించిన యజమాని ఉప్పురామచంద్ర సీసీ కెమెరాలను పరిశీలించారు. దుకాణంలో కొంత కాలంగా పని చేస్తున్న సమీరాభాను, గాయత్రి, లక్ష్మీపవిత్ర రూ.1 లక్ష 60 వేల పట్టుచీరలను పట్టుకెళ్లినట్లు తేలింది. దీంతో యజమాని టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఫిర్యాదు చేశారు. ముగ్గురిపై వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
బైక్‌ను ఢీకొన్న లారీ
– తండ్రి, తనయుడికి తీవ్ర గాయాలు
రామాపురం : బైక్‌ను లారీ ఢీకొనడంతో తండ్రి, తనయుడికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన మండల పరిధి చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిలోని బీసీ కాలనీ సమీపంలో మంగళవారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి వైపు నుంచి కడప వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో సూరి(28), ఆయన తనయుడు భరత్(4)కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితులను 108లో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కొండారెడ్డి తెలిపారు.
అనుమానాస్పద మృతి కేసు నమోదు
ఓబులవారిపల్లె : గోవిందంపల్లె పంచాయతీ పోలివండ్లపల్లె దళితవాడ గ్రామానికి చెందిన వెంకటేశ్వర్లు(48) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు పోలీసులు కేసు నమోదు చేశారు. ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటేశ్వర్లు పోలివండ్లపల్లె గ్రామ పరిసరాల్లో కూలి పనులు చేసుకొని జీవనం సాగించే వాడు. ఆయనకు శివప్రసాద్ అనే కుమారుడు ఉన్నాడు. ఈ నెల 24న బయటకు వెళ్లి వస్తానని ఇంటి నుంచి వెళ్లి మళ్లీ తిరిగి రాలేదు. ఆయన కోసం బంధువులతో కలిసి శివప్రసాద్ చుట్టుపక్కల గాలించగా.. యాల్లాయపల్లె గట్టుపై శవమై కనిపించాడు. అదే రోజు అంత్యక్రియలు నిర్వహించారు. అయితే తన అన్నను కుమారుడు శివప్రసాద్ హత్య చేశాడని అనుమానం ఉందని మృతుడి తమ్ముడు నరసింహులు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మంగళవారం మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం చేయించారు. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఇన్‌చార్జి ఎస్‌ఐ వెంకటేశ్వర్లు తెలిపారు.