కార్పొరేట్‌కు దీటుగా కస్తూర్బా

- - Sakshi

మదనపల్లె సిటీ: కార్పొరేట్‌కు దీటైన వసతులు.. అంతర్జాతీయ స్థాయి విద్యాప్రమాణాలు.. ఆంగ్ల మాధ్యమంలో బోధన .. పేదలు, అనాథలు, బడిబయట పిల్లలకు అడ్మిషన్లు...విద్యార్థులను ఉన్నతంగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలను ప్రారంభించారు. 6 నుంచి ఇంటర్మీడియట్‌ వరకు చదువుకు భరోసా ఇస్తున్నారు. బాలికలు సమాజంలో ఎలా మెల గాలో అవగాహన కల్పిస్తున్నారు. విలువలను పెంపొందించుకునేలా వ్యక్తిత్వ వికాస తరగతులు నిర్వహిస్తున్నారు. అభ్యసన నైపుణ్యాలను మెరుగుపరిచేందుకు కృషి చేస్తున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా 21 కేజీబీవీల్లో 2023–24 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లకు నోటిఫికేషన్‌ విడుదల చేశారు. ఈ మేరకు ఈనెల ఈనెల 27 నుంచి ఏప్రిల్‌ 20 లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం కల్పించింది. సీట్ల భర్తీలో నిబంధనల మేరకు ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ కేటగిరీ వారీగా ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం 6 వ తరగతి నుంచి ఇంటర్‌ వరకు మొత్తం సీట్లను భర్తీ చేస్తారు. 7, 8, 9 తరగతుల్లో మిగిలిన సీట్లకు అడ్మిషన్లు ఉంటాయి. దరఖాస్తును హెచ్‌టీటీపీఎస్‌://ఏపీకేజీబీవీ. ఏపీసీఎఫ్‌ఎస్‌ఎస్‌.ఐఎన్‌ సైట్‌ ద్వారా పొందవచ్చు. ఎంపికై న విద్యార్థులకు ఫోన్‌ మెసేజ్‌ ద్వారా సమాచారం అందుతుంది. ఇందు కోసం రాష్ట్ర విద్యా శాఖ ప్రత్యేక మార్గదర్శకాలను రూపొందించింది.

తరగతికి 40 మందే..

● కేజీబీవీలో 6 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో తరగతికి 40 సీట్ల చొప్పున కేటాయించారు.

● ఇంటర్మీడియట్‌కు సంబంధించి ఒక్కో కేజీబీవీలో ఒక్కో గ్రూపును ప్రవేశపెట్టారు. 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు ఉంటాయి.

● ఆటలు, కరాటేలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్‌ శిక్షణ ఇస్తారు.

● ఆరోగ్యం, నైతిక విలువలను పెంపొందించేలా వ్యక్తిత్వ వికాసం తరగతులను నిర్వహిస్తారు.

● ప్రతి కేజీబీవీలో విద్యార్థుల ఆరోగ్య పరిస్థితులను పరీక్షించడానికి ఒక ఏఎన్‌ఎం ఉంటారు.

● విద్యతో వెనుకబడిన వారిలో అభ్యసన నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి చేస్తారు.

● కంప్యూటర్‌, వ్యాయామం, ఆరోగ్యం, వృత్తి నైపుణ్య విద్యను అందించడం ద్వారా బాలికల సర్వతోముఖాభివృద్ధికి ఉపాధ్యాయులు కృషి చేస్తారు.

● పదో తరగతి పూర్తి చేసుకున్న వారు ఉన్నత చదువులకు వెళ్లేలా ప్రోత్సహిస్తారు. అందులో భాగంగా కేజీబీవీల్లో ఇంటర్మీడియట్‌ను ప్రవేశపెట్టారు.

కేజీబీవీ ప్రత్యేకతలు: బాలికల్లో ఆత్మస్థైర్యం పెంపొందించేందుకు వారంలో రెండు రోజుల పాటు స్వీయ రక్షణ లక్ష్యంగా కరాటే తరగతులు నిర్వహిస్తారు. కేజీబీవీల్లో పదో తరగతి పూర్తి చేసిన విద్యార్థులు ఏటా ప్రతిభా అవార్డులను గెలుచుకుంటున్నారు. బాలికలకు కాస్మోటిక్‌ కిట్స్‌, నాప్‌కిన్స్‌లతో పాటు రెండు జతల యూనిఫారం ప్రభుత్వం అందిస్తోంది. కేజీబీవీ పాఠశాలల్లో బాలికల భద్రత కోసం వాచ్‌మెన్‌ నుంచి ప్రత్యేకాధికారి వరకు అందరూ మహిళా ఉద్యోగులే ఉంటారు.

తంబళ్లపల్లెలోని కస్తూర్బాగాంధీ విద్యాలయం, గణతంత్ర దినోత్సవ సందర్భంగా జరిగిన సాంస్కృతిక పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకున్న కేజీబీవీ విద్యార్థులు (ఫైల్‌ఫొటో)

అవకాశం నద్వినియోగం చేసుకోవాలి

జిల్లాలో కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. విద్యార్థినులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఇచ్చారు. పేద, అనాథ, బడిబయట పిల్లలు, బడిమానేసిన బాలికలు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. –పురుషోత్తం, జిల్లా విద్యాశాఖాధికారి, అన్నమయ్య జిల్లా

అన్ని వసతులతో కూడిన ఉత్తమ విద్య

కేజీబీవీలో అన్ని వసతులతో కూడిన ఉత్తమ విద్యాబోధన జరుగుతోంది. ప్రైవేటు పాఠశాలల కంటే మెరుగైన విద్య కల్పిస్తున్నారు. నాణ్యమైన భోజనం, పిల్లల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తున్నారు. ఆహ్లాదకరమైన వాతావరణంలో మేము విద్యను అభ్యసిస్తున్నాం. –మౌనిక, 9వతరగతి విద్యార్థిని, కేజీబీవీ, పీటీఎం

కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన

కేజీబీవీ పాఠశాలల్లో కార్పొరేట్‌కు దీటుగా విద్యాబోధన సాగుతోంది. మంచి భవనాలు, మౌలిక సదుపాయాలు, విద్యార్థులకు స్మార్ట్‌ డిజిటల్‌ తరగతుల ద్వారా బోధన ఉంటుంది. బాలికలకు భరోసాగా నిరంతరం పర్యవేక్షణ చేస్తున్నాం. చదువుతో పాటు క్రీడలు, ఇతర నైపుణ్యాలకు మెరుగులు దిద్దుతాం. –శ్రీమతి, ప్రత్యేక అధికారిణి, కేజీబీవీ, తంబళ్లపల్లె

అత్యుత్తమ విద్యాబోధన

ఉచిత వసతి సదుపాయం

ఏప్రిల్‌ 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ

అడ్మిషన్లకు విపరీతమైన పోటీ

Read latest Annamayya News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top