
గుంటూరు లాడ్జి సెంటర్‌లో అంబేడ్కర్ విగ్రహం ఎదుట నిరసన తెలియజేస్తున్న టీజేఆర్ సుధాకరబాబు, అప్పిరెడ్డి తదితరులు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటుకిస్తే బడుగులకు దిక్కేది?
నిలదీసిన వైఎస్సార్‌సీపీ... ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో ఆందోళనలు
రాష్ట్రవ్యాప్తంగా భారీగా నిరసనలు.. పెద్దఎత్తున పాల్గొన్న ప్రజలు
రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు
కూటమి ప్రభుత్వం బుద్ధిని మార్చాలంటూ వేడుకోలు
సాక్షి నెట్‌వర్క్: ‘‘ప్రభుత్వ వైద్య కళాశాలల్లో చదివేవారిలో అధికులు ఆర్థిక స్థోమత లేని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలే. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లేది కూడా వీరే. అలాంటి వైద్య విద్య, వైద్యాన్ని వారికి దూరం చేసి, ప్రయివేటుకు కట్టబెట్టేందుకు కూటమి ప్రభుత్వం ప్రయత్నించడం దారుణం’’ అని వైఎస్సార్‌సీపీ మండిపడింది. వైద్య కళాశాలల ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు మంగళవారం వైఎస్సార్‌సీపీ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ‘సమర భేరి’ పేరిట నిరసనలు నిర్వహించారు. శ్రీకాకుళం నుంచి చిత్తూరు జిల్లా వరకు ప్రధాన కూడళ్లలో నల్లబ్యాడ్జీలు ధరించి బైఠాయించారు.
చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకాన్ని ఎండగడుతూ... ఇదేం పాలన.. ఇదేం పాలన.. సర్కార్ డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. పార్టీ కార్యాలయాల నుంచి నాయకులు, కార్యకర్తలు ర్యాలీగా వెళ్లి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతిపత్రాలు సమరి్పంచారు. సీఎం చంద్రబాబు, కూటమి ప్రభుత్వ బుద్ధి మారేలా చూడాలని కోరారు. ఈ కార్యక్రమాల్లో వైఎస్సార్‌సీపీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా నాయకులు, ఎస్సీ సెల్ నాయకులు పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ చంద్రబాబూ... కార్పొరేట్లపై ప్రేమ.. పేదలపై కక్షనా? బడుగు బలహీన వర్గాల పిల్లలకు వైద్య విద్యను అభ్యసించే అర్హత లేదా? అని ప్రశి్నంచారు.
వైద్య కళాశాలలను ప్రైవేటీకరిస్తే పేదలకు సరైన వైద్యం అందక ప్రాణాలు కోల్పోయే పరిస్థితి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘పేదలకు విద్య, వైద్యం అందించడం ప్రభుత్వ బాధ్యత. పేదల సంక్షేమమే లక్ష్యంగా, జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలని, సామాన్యులకూ వైద్య విద్య అందుబాటులోకి రావాలన్న గత ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రానికి 17 వైద్య కళాశాలలను తీసుకొచ్చి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించేలా చూశారు. కూటమి సర్కారు మాత్రం ప్రయివేటుకు కట్టబెట్టి పేదలకు వైద్య విద్యతో పాటు వైద్యాన్ని దూరం చేస్తోంది’’ అని మండిపడ్డారు. మెడికల్ కాలేజీలను ప్రభుత్వం ఆ«దీనంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ‘‘చంద్రబాబూ 15 ఏళ్లు సీఎంగా చేశావ్.. ఒక్క ప్రభుత్వ వైద్య కాలేజీ తేలేకపోయావ్..? అలాంటిది ఐదేళ్లలోనే జగన్ 17 మెడికల్ కాలేజీలను తెచ్చారు. వాటిని నువ్వొచ్చి ప్రయివేటుపరం చేస్తావా?’’ అని నిప్పులు చెరిగారు.
ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రం
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను పీపీపీ విధానంలో కావాల్సిన వారికి కట్టబెట్టాలనేదే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేశ్ ఆలోచన అని వైఎస్సార్‌సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.