సాక్షి, అనకాపల్లి: చలో దుప్పుతూరు కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్‌సీపీ నేతలు గ్రామంలో పర్యటించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్, బొడ్డేడ ప్రసాద్, ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎంపీ సత్యవతి, కంబాల జోగులు.. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతూ.. పరిశ్రమలు రావాలనేది వైఎస్ జగన్ విధానమని.. ప్రజలను ఇబ్బంది పెడితే వైఎస్ జగన్ ఉపేక్షించరన్నారు. 750 కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. గ్రామాన్ని తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది’’ అని అమర్‌నాథ్ పేర్కొన్నారు.
ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలి. మహిళలు మీద లాఠీఛార్జ్ చేశారు. గతంలో ఎన్నడు ఈ ప్రాంతంలో మహిళలు మీద లాఠీఛార్జ్ జరగలేదు.. ప్రజల డిమాండ్స్ న్యాయ పరమైనవి. పరిహారం ఇచ్చిన తర్వాత గోడ నిర్మాణం చేపట్టాలి. ప్రజలకు న్యాయం జరిగే వరకు తట్ట మట్టి ఎత్తడానికి వీల్లేదు. మీ మీద పెట్టిన తప్పుడు కేసులను వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేస్తారు. మీకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రజలకు న్యాయం కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని గుడివాడ అమర్‌నాథ్ స్పష్టం చేశారు.
అనకాపల్లి జిల్లా వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు దుప్పుతూరు గ్రామంలో పర్యటించాము. మంచి ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న గ్రామం కంటే మంచి గ్రామాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 22 ఏళ్లు గడుస్తున్న సమస్య పరిష్కారం కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు గోడ నిర్మాణం చేపట్టవద్దని చెప్పారు. వారి సమస్య పరిష్కారం అయిన తర్వాత గోడ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు దాడి చేశారు. అనేక పోలీసులు స్టేషన్లు తిప్పారు’’ అని ఆయన మండిపడ్డారు.
ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మహిళలను కూడా అరెస్ట్ చేశారు. ఈడ్చుకుంటూ మహిళలను వ్యాన్లు ఎక్కించారు. ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారు?. మహిళలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు మనకు అవసరమా’’ అంటూ ఆమె నిలదీశారు.
కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. పరిహారం చెల్లించే వరకు గోడ నిర్మాణాన్ని ఆపాలి. ప్రజలకు ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. న్యాయం కోసం పోరాటం చేసే ప్రజలపై తప్పుడు కేసులు పెట్టారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఎందుకు గోడ కట్టలేక పోయారు?. దొర స్వామి దగ్గర కూటమి నాయకులు డబ్బులు తీసుకుని దగ్గరుండి గోడ కట్టిస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు.


