Vijayawada: బేరానికి బెజవాడ రైల్వేస్టేషన్‌!

Vijayawada Railway Station Privatisation: Opposed Employees Organisations - Sakshi

99 ఏళ్ల లీజుకు ఇచ్చేందుకు రైల్వే శాఖ ప్రయత్నాలు

రీ డెవలప్‌మెంట్‌ పేరిట ప్రైవేటు పరం చేసేందుకు కసరత్తు

ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్టు కింద టెండర్లు పిలిచే అవకాశం

ఆగ్రహం వ్యక్తం చేస్తున్న కార్మిక సంఘాలు

సాక్షి, విజయవాడ: విజయవాడ రైల్వేస్టేషన్‌ను ప్రైవేటీకరించేందుకు రైల్వే బోర్డు రంగం సిద్ధం చేస్తోంది. రీ డెవలప్‌మెంట్‌ పేరిట 99 ఏళ్లు పాటు ప్రైవేటుకు ఇచ్చేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తోంది. అయితే దక్షిణ మధ్య రైల్వేలో ప్రాధాన్యం కల్గిన ఈ స్టేషన్‌ను లీజుకు ఇవ్వనుండటంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

గతంలోనే నిర్ణయం.. 
విజయవాడ రైల్వే స్టేషన్‌ను కమర్షియల్‌గా హంగులతో ఆధునికీకరించేందుకు ప్రైవేటు బిడ్డర్లను పిలవాలని గతంలోనే రైల్వే బోర్డు నిర్ణయించింది. బిడ్డర్ల నుంచి ఆసక్తి వ్యక్తీకరణను కూడా కోరింది. అప్పట్లో బిడ్డర్లు ముందుకు వచ్చినా రైల్వే నిబంధనల కారణంగా వెనకడుగు వేశారు. అప్పట్లో 30 ఏళ్లు లీజు కాలంగా ప్రతిపాదించడంతో ఉపయోగం ఉండదని బిడ్డర్లు భావించారు. ప్రస్తుతం కార్పొరేట్‌ కంపెనీలకు గుత్తగా రైల్వేస్టేషన్‌ను దీర్ఘకాలం అప్పగిస్తే మంచిదని బోర్డు నిర్ణయించిన నేపథ్యంలో కొన్ని ఏ1 రైల్వే స్టేషన్లను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు ఎంపిక చేశారు. అందులో విజయవాడ రైల్వేస్టేషన్‌ను కూడా చేర్చారు. దీనిపై రైల్వే కార్మిక సంఘాల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. 

ప్రాధాన్యం ఉన్న స్టేషన్‌..
విజయవాడ రైల్వేస్టేషన్‌ 1888లో ప్రారంభమైంది. మొత్తం 30 ఎకరాల్లో విస్తరించి ఉంది. ప్రస్తుతం 10 ప్లాట్‌ ఫారాలు ఉన్నాయి. ఈ స్టేషన్‌ గుండా కరోనాకు ముందు ప్రతి రోజు 250, ప్రస్తుతం 150 రైళ్లు నడుస్తున్నాయి. ప్రయాణికుల రద్దీ గతంలో రోజుకు రెండు లక్షలు కాగా ప్రస్తుతం లక్ష వరకు ఉంటోంది. 

అన్ని సదుపాయాలూ ఉన్నా..
ఇక ఈ స్టేషన్‌లో అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి. పది ప్లాట్‌ ఫారాలు అనుసంధానం చేస్తూ మూడు ఫుట్‌ ఓవర్‌బ్రిడ్జిలు ఉన్నాయి. వీటిలో ఒకటి పెద్ద ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి ఆరు మీటర్లు వెడల్పు 185 మీటర్లు పొడవుతో ఉంటుంది. రైల్వేస్టేషన్‌లో రిటైరింగ్‌ రూమ్‌లు, లిఫ్టులు, ఎస్కలేటర్ల సదుపాయాలూ ఉన్నాయి. జనరల్, నాన్‌ ఏసీ, ఏసీ రెస్ట్‌ రూమ్‌లు ఉన్నాయి. పే అండ్‌ యూజ్‌ టాయిలెట్స్‌తో పాటు ప్రయాణికులకు డిస్‌ప్లే సిస్టమ్, ఆధునికీకరించిన ప్లాట్‌ఫారాలు, స్టాండర్స్‌ ఎక్విప్‌మెంట్ల వినియోగం, క్లీన్‌ అండ్‌ గ్రీన్‌ వంటి సదుపాయాలతో నేషనల్‌ గ్రీన్‌బిల్డింగ్‌ కౌన్సిల్‌ గోల్డెన్‌ అవార్డును సాధించింది. ఐఎస్‌ఓ హోదాను కల్గి ఉంది.

ఆదాయం ఫుల్‌ అయినా..
విజయవాడ డివిజన్‌ నుంచి రైల్వేస్‌కు గణనీయమైన ఆదాయం వస్తోంది. నంబర్‌వన్‌ స్థానానికి పోటీ పడుతోంది. ఇటువంటప్పుడు ఈ రైల్వే స్టేషన్‌ను ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేకంటే బ్యాంకుల నుంచి రుణం తీసుకునైనా రైల్వేనే సొంతంగా రీ డెవలప్‌మెంట్‌ వంటి వాటితో పాటు కమర్షియల్‌గా అభివృద్ధి చేయవచ్చు. అలా కాకుండా ప్రైవేటు పరం చేసి 99 ఏళ్ల పాటు లీజుకు ఇస్తే ఆదాయం ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్తుంది. ప్రయాణికులపైనా యూజర్‌చార్జీల భారం పడే అవకాశం ఉందని కార్మికులతో పాటు ప్రయాణికులు అభిప్రాయపడుతున్నారు.

స్టేషన్‌ రీ డెవలప్‌మెంట్‌ కోసమే..
స్టేషన్‌ను రీడెవలప్‌మెంట్‌ చేయడానికి రైల్వేశాఖ ప్రయత్నిస్తోంది. ఎక్స్‌ప్రెషన్‌ ఆఫ్‌ ఇంట్రస్టు కింద తీసుకుని డెవలప్‌మెంట్‌ చేసేవారికి అప్పగిస్తారు. ఇప్పటికే గుజరాత్‌లోనూ, భోపాల్‌ వద్ద స్టేషన్లను ఈ విధంగా అభివృద్ధి చేశారు. డెవలప్‌మెంట్‌ చేసిన వాళ్లు యూజర్‌ చార్జీలు వసూలు చేసుకుంటారు. 
– పి.శ్రీనివాస్, డివిజనల్‌ రైల్వే మేనేజర్‌

ప్రైవేటీకరణ తగదు
రైల్వే స్టేషన్‌ ప్రైవేటీకరించాలనే ఆలోచన తగదు. ప్రైవేటు సంస్థలు ప్రయాణికులపై ఆర్థిక భారంమోపుతాయి. ముఖ్యంగా యూజర్‌ చార్జీల పేరుతో ఎక్కువ సొమ్ము వసూలు చేస్తాయి. ప్రస్తుతం స్టేషన్‌లో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. ఇంకా అవసరమైతే మెరుగైన సౌకర్యాలు రైల్వేశాఖే కల్పించాలి.    
– వడ్లమూడి రవి, ప్రయాణికుడు 

లీజుకు ఇవ్వడం సరికాదు..
దక్షిణ మధ్య రైల్వేలోనే మన స్టేషన్‌కు మంచి ఆదాయం వస్తుంది. అటువంటి స్టేషన్‌ను 99 ఏళ్లకు లీజుకు ఇవ్వాలనుకోవడం సరియైన నిర్ణయం కాదు. అవకాశం ఉన్నంత వరకూ రైల్వే శాఖే స్టేషన్‌ల అభివృద్ధిని చేపట్టాలి. తద్వారా ప్రజలకు, ఉద్యోగులకు, కార్మికులకు మేలు జరుగుతుంది.
– శ్రీనివాస్, రైల్వే మజ్దూర్‌ యూనియన్‌ నాయకుడు 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top