యూట్యూబ్‌ చానల్‌ ప్రతినిధుల నిర్వాకం 

Vijayawada: One Tv Reporters Blackmail In The Name Of Media - Sakshi

మీడియా పేరుతో బ్లాక్‌మెయిల్‌

యాడ్స్‌ ఇవ్వకుంటే మెడికల్‌ ఆఫీసర్లతో..

రైడింగ్‌ చేయిస్తామని బెదిరింపులు 

సాక్షి, భవానీపురం(విజయవాడ): ఇబ్బడిముబ్బడిగా పుట్టుకు వస్తున్న యూట్యూబ్‌ చానల్స్‌లో పనిచేస్తున్న కొందరు వ్యవహరిస్తున్న తీరు జర్నలిజానికి మాయని మచ్చగా మిగిలిపోతుంది. ఇది జర్నలిజం పట్ల నిబద్ధత కలిగి నిజాలను వెలికి తీస్తూ నిజాయతీగా వ్యవహరించే పాత్రికేయులకు తలవంపులుగా మారింది. సేకరించిన వివరాల ప్రకారం.. దీపావళి పండుగరోజు శనివారం భవానీపురం బ్యాంక్‌ సెంటర్‌లోని సుధాకర్‌ మెడికల్‌ షాపు వద్దకు ఇద్దరు వ్యక్తులు కారులో వచ్చి తాము వన్‌ టీవీ న్యూస్‌ ప్రతినిధులమని, యాడ్‌ ఇవ్వాలని అడిగారు. తమది చిన్న మెడికల్‌ షాపని, యాడ్‌ ఇచ్చే పరిస్థితిలో లేమని, షాప్‌వారు తెలపడంతో తమకు టార్గెట్‌లు ఉంటాయని, కనీసం రూ.5వేల యాడ్‌ ఇవ్వాలని వారు అడిగారు. ఇవ్వలేమని, తమకు ఆ అవసరంకూడా లేదని నిర్వాహకులు తేల్చి చెబుతూ ఐడీ కార్డు చూపమని అడిగారు. ఇద్దరిలో ఒక వ్యక్తి మాత్రమే తన ఐడీ కార్డ్‌ బయటపెట్టారు. దానిపై మట్టా రవికుమార్, కంట్రిబ్యూటర్, మైలవరం అని ఉంది. రెండవ వ్యక్తి తన ఐడీకార్డు ఆఫీస్‌లో ఉందని చెప్పారు.

తమకు జిల్లాలోని మెడికల్‌ ఆఫీసర్లు తెలుసునని, వారితో చెప్పి మీపై ఏదో ఒక కేసు బనాయిస్తామని బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. దీనిపై ఇరు వర్గాల మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒక వ్యక్తి మొబైల్‌తో వీడియో తీస్తుండగా మరో వ్యక్తి సంస్థకు చెందిన లోగో బయటకు తీసి హడావుడి చేశారు. దీంతో స్థానికులు పెద్దఎత్తున అక్కడికి చేరి మెడికల్‌ షాపు నిర్వాహకులకు మద్దతుగా నిలబడటంతో వారు నెమ్మదిగా జారుకున్నారు. దీనిపై భవానీపురం ఇన్‌చార్జి సీఐ వెంకటేశ్వరరావును వివరణ కోరగా ఈ ఘటనపై తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. 


వన్‌ టీవీ ప్రతినిధి ఐడీ కార్డు, కారు

∙ఇదే యూట్యూబ్‌ చానల్‌కు చెందిన పి.సురేష్‌ అనే వ్యక్తి ఇద్దరు వ్యక్తులను వెంటేసుకుని గత ఏడాది సెప్టెంబర్‌ 13న విజయవాడ ఊర్మిళానగర్‌లో బడ్డీ కొట్టు నడుపుకుంటున్న ఒక దివ్యాంగురాలిని బ్లాక్‌ మెయిల్‌ చేసి రూ.1000 వసూలు చేశారు. దీనిపై ఆమె భవానీపురం పీఎస్‌లో ఫిర్యాదు చేయటంతో పోలీసులు వారిని అరెస్ట్‌ చేశారు. సైబరాబాద్‌ సిటీ ఎస్‌ఐ పేరుతో నకిలీ ఐడీ కార్డు సృష్టించిన గుత్తుల ప్రశాంత్‌ అనే వ్యక్తి కారులో వస్తుండగా ఈ ఏడాది జూన్‌ 25న భవానీపురం పోలీసులు గొల్లపూడిలో పట్టుకున్నారు. పోలీసుల విచారణలో తాను వీ వన్‌ చానల్‌ రిపోర్టర్‌నని ఐడీ కార్డ్‌ చూపించాడు. కారు నంబర్‌ ప్లేట్లుకూడా మార్చిన అతన్ని విడిపించేందుకు అప్పట్లో కొందరు పెద్దఎత్తున లాబీయింగ్‌ చేశారని వినికిడి. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top