కూటమి ఎమ్మెల్యేలను టార్గెట్ చేసిన విజయవాడ ఎంపీ
బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కాల్ లిస్టు సేకరణ
ఎంపీని నిలదీసిన ఎమ్మెల్యే అనుచరులు
చంద్రబాబుకు ఫిర్యాదు చేసిన బీజేపీ ఎమ్మెల్యే
పట్టించుకోకపోవడంతో ఆగ్రహం
ఎంపీ తీరుపై మిగిలిన ఎమ్మెల్యేలూ గుర్రు
సాక్షి, అమరావతి: టీడీపీలో ‘కాల్ లిస్టు’ రాజకీయం కలకలం రేపుతోంది. సొంత పార్టీ ఎమ్మెల్యేల కదలికలపై టీడీపీ విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని నిఘా పెట్టిన విషయం బహిర్గతం కావడం హాట్‌టాపిక్‌గా మారింది. ఈ వ్యవహారం విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీ, కూటమి ఎమ్మెల్యేల మధ్చ చిచ్చురేపింది. విజయవాడ నగరంలోని బీజేపీ ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడి కాల్ లిస్టును కొద్దిరోజుల క్రితం ఎంపీ సేకరించిన విషయం బయటపడింది. టీడీపీలో కీలక నేతగా ఉండి.. ఆ తర్వాత బీజేపీలోకి వెళ్లిన ఆ ఎమ్మెల్యే తరఫున నియోజకవర్గ వ్యవహారాలను ఆ ప్రధాన అనుచరుడే పర్యవేక్షిస్తున్నారు.
ఆ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అందుబాటులో ఉండేది తక్కువ కావడంతో ఆయన ప్రధాన అనుచరుడే నియోజకవర్గ వ్యవహారాలు చూస్తున్నాడు. ఆయన కీలకంగా మారడంతో ఆయన కాల్ లిస్టును చూసి ఎవరెవరితో టచ్‌లో ఉన్నారు, ఎప్పుడు మాట్లాడుతున్నారనే విషయాలను ఎంపీ కేశినేని చిన్ని తెలుసుకుంటున్న విషయం బయటపడింది. దీంతో బీజేపీ ఎమ్మెల్యే అనుచరుడు, ఆయన వర్గీయులు ఇప్పటికే ఎంపీని నిలదీసినట్టు సమాచారం. ఎంపీ కోసం ఈ లిస్టును సేకరించిన వ్యక్తులతోనూ గొడవకు దిగడంతో ఈ వ్యవహారం రచ్చకెక్కింది. ఇదే విషయంపై బీజేపీ ఎమ్మెల్యే సీఎం చంద్రబాబుకు ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. చంద్రబాబు ఈ విషయాన్ని పట్టించుకోకపోవడంతో ఆ బీజేపీ ఎమ్మెల్యే తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నారు.
తిరువూరు వివాదం నేపథ్యంలోనే..
తిరువూరు టీడీపీ ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాస్‌తో ఎంపీకి ఉన్న వివాదమే దీనికి కారణమనే ప్రచారం జరుగుతోంది. కొలికపూడికి విజయవాడ పార్లమెంటు నియోజకవర్గంలో కొందరు ఎమ్మెల్యేలు మద్దతు ఇస్తున్నట్టు ఎంపీ కేశినేని అనుమానిస్తున్నట్టు చెబుతున్నారు. అందులో టీడీపీతో కలిసి ఉండే బీజేపీ ఎమ్మెల్యే ప్రధానమనే అనుమానం ఉన్నట్టు సమాచారం. అందుకే ఆయన తరఫున నియోజకవర్గ వ్యవహారాలు నడిపే వ్యక్తి కాల్ లిస్టును సేకరించినట్టు తెలుస్తోంది. తిరువూరు ఎమ్మెల్యే కాల్ లిస్టును కూడా ఎంపీకి సంబంధించిన వ్యక్తులు సేకరించినట్టు తెలుస్తోంది. నందిగామ, విజయవాడలోని మరో ఎమ్మెల్యే కాల్ లిస్టులు కూడా సేకరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది.
లోకేశ్ చెబితేనే చేశామంటున్న ఎంపీ వర్గీయులు
ఇదిలావుండగా ఎంపీ వర్గీయులు మాత్రం లోకేశ్ చెప్పడం వల్లే తాము ఎమ్మెల్యేల కాల్ లిస్టులు సేకరించి వారు ఎవరితో టచ్‌లో ఉన్నారో తెలుసుకుంటున్నామని ప్రచారం చేస్తున్నారు. కానీ.. ఎమ్మెల్యేలు మాత్రం ఇంటెలిజెన్స్ సహా అన్ని వ్యవస్థలను వదిలేసి ఎంపీకి ఇలాంటి పనిని లోకేశ్ ఎందుకు అప్పగిస్తారని ప్రశి్నస్తున్నారు.
అంతా ఎంపీ పెత్తనమే.. రగులుతున్న ఎమ్మెల్యేలు
విజయవాడ పార్లమెంటు నియోజకవర్గాన్ని మంత్రి లోకేశ్ ఎంపీ కేశినేనికి అప్పగించి ఆయన ద్వారానే అన్ని వ్యవహారాలు చక్కబెడుతున్న విషయం బహిరంగ రహస్యమే. ఈ నేపథ్యంలోనే పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్ల వ్యవహారాల్లో ఎంపీ కేశినేని చిన్ని తలదూరుస్తున్నారు. ఆ నియోజకవర్గాల్లో అధికారుల బదిలీలు, కాంట్రాక్టులు, పదవులు సహా ఏ పనైనా తన కనుసన్నల్లోనే జరగాలని పట్టుబడుతున్నారు. తిరువూరులో అయితే ఎమ్మెల్యే అధికారాలను కత్తిరించేసి మొత్తం తానే ఎమ్మెల్యే అన్నట్టు వ్యవహరిస్తున్నారు.
నందిగామ నియోజకవర్గంలోనూ ఎంపీ జోక్యం ఎక్కువగా ఉంది. దీంతో ఆ ఎమ్మెల్యేలు తనకు వ్యతిరేకంగా ఉండటంతోపాటు తనకు అనుమానం ఉన్న మరికొందరి కదలికలు, ఎవరితో టచ్‌లో ఉన్నారో తెలుçÜుకునేందుకు వారి కాల్ లిస్టులు సేకరించినట్టు తెలుస్తోంది. ఈ విషయం బయటపడటంతో టీడీపీలో కలకలం రేగింది. ఇంత జరిగినా పార్టీ పెద్దలు ఎంపీకి వత్తాసు పలుకుతుండటాన్ని టీడీపీ ఎమ్మెల్యేలు జీర్ణించుకోలేకపోతున్నారు.


