
సాక్షి, అమరావతి: జయహో జగనన్న నినాదంతో ఈనెల 26 నుంచి 29 వరకు జరగనున్న వైఎస్సార్‌సీపీ బస్సుయాత్ర ‘సామాజిక న్యాయభేరి’ని విజయవంతం చేయాలని వైఎస్సార్‌సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయిరెడ్డి నేతల్ని కోరారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు చెందిన 17 మంది మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తమ వర్గాలకు జరిగిన మేలు గురించి స్వయంగా ప్రజలకు వివరించడమే ముఖ్య ఉద్దేశంగా చేపట్టిన బస్సుయాత్రను విజయవంతం చేయాలని పిలుపు నిచ్చారు.
పార్టీ ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులు, నామినేటెడ్ పదవులు పొందిన నేతలు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. విజయనగరం, రాజమహేంద్రవరం, నరసరావుపేట, అనంతపురాల్లో బహిరంగసభలు నిర్వహిస్తామన్నారు.