పెద్దవాగులో పెను విషాదం

Vasanthavada Incident: AP Govt Announced Rs 3 Lakh Ex Gratia - Sakshi

సరదాగా వాగులోకి దిగిన ఆరుగురు బాలురు మృత్యువాత

మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల వంతున సాయం ప్రకటించిన సీఎం వైఎస్‌ జగన్‌

సాక్షి ప్రతినిధి, ఏలూరు/వేలేరుపాడు: పశ్చిమ గోదావరి జిల్లా వేలేరుపాడు మండలంలో బుధవారం విషాదం జరిగింది. వనభోజనోత్సవానికి వెళ్లిన ఆరుగురు స్నేహితులను పెద్దవాగు మింగేసింది. ఒకరినొకరు చేతులుపట్టుకుని సరదాగా వాగులోకి దిగిన ఐదుగురు మునిగిపోయారు. వారిని రక్షించేందుకు ప్రయత్నించిన మరో స్నేహితుడు కూడా వారితోపాటే నీటమునిగాడు. అప్పటివరకు సరదాగా గడిపిన వారు క్షణాల్లో జలసమాధి అయ్యారు. భూదేవిపేట గ్రామానికి చెందిన వీరు వసంతవాడ ప్రాంతంలో పెద్దవాగులో ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలకు మూడులక్షల రూపాయల వంతున ఆర్థికసాయం అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు.

ఆనవాయితీగా..
ఏటా దసరా పండుగ పూర్తయ్యాక భూదేవిపేట గ్రామస్తులు వసంతవాడ వాగు ప్రాంతంలో వనమహోత్సవం జరుపుకొంటారు. ఈ ఏడాది కూడా గ్రామస్తులు ఉత్సాహంగా వనభోజనానికి వెళ్లారు. స్నేహితులైన కెల్లా భువనసాయి (18), గంగాధరపు వెంకట్రావు (16), గొట్టిపర్తి మనోజ్‌ (16), కర్నాటి రంజిత్‌ (15), కూరవరపు రాధాకృష్ణ (15) పెద్దవాగులో ఆడుకునేందుకు వెళ్లారు. వీరెవరికీ ఈత రాకపోవడంతో ఒకరినొకరు చేయిచేయి పట్టుకుని వాగులోకి దిగి సరదాగా కొంతసేపు ఆడుకున్నారు. వాగులోతు తెలియని వీరు ముందుకెళ్లి మునిగిపోయారు. ప్రాణాలు కాపాడుకునేందుకు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. వీరిని రక్షించేందుకు వాగులోకి దిగిన శ్రీరాముల శివాజీ (17) కూడా మునిగిపోయాడు. వీరు నీళ్లల్లో మునిగిపోవడాన్ని గమనించిన కుటుంబసభ్యులు వెంటనే స్థానికులకు సమాచారం అందించి వారిని కాపాడేందుకు వాగులోకి దిగారు. సమాచారం అందుకున్న డీఎస్పీ ఎం.వెంకటేశ్వర్లు, కుక్కునూరు సీఐ బాలసురేశ్, ఎస్‌ఐ సుధీర్‌ వెంటనే అక్కడికి చేరుకున్నారు. స్థానికులు, పోలీసులు గాలించి నీళ్లల్లోనుంచి మృతదేహాలను వెలికితీశారు.

భూదేవిపేట కన్నీరుమున్నీరైంది. మృతుల్లో శ్రీరాములు కార్పెంటర్‌గా పనిచేస్తున్నాడు. అతడే కుటుంబానికి జీవనాధారం. మనోజ్, రంజిత్‌ పదోతరగతి, రాధాకృష్ణ, వెంకట్రావు ఇంటర్మీడియెట్, భువనసాయి ఏజీబీఎస్సీ చదువుతున్నారు. మృతదేహాలకు వాగువద్దే పోస్ట్‌మార్టం నిర్వహించారు. సమాచారం తెలిసిన వెంటనే అధికారులను అప్రమత్తం చేసిన పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బాధిత కుటుంబాలను పరామర్శించి, అంత్యక్రియల నిమిత్తం కుటుంబానికి రూ.5 వేల వంతున ఆర్థికసాయం అందించారు. ఎస్పీ నారాయణనాయక్‌ కూడా ఘటనాస్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.

తక్షణం స్పందించిన సీఎం
వసంతవాడ వాగు ప్రమాదంపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ.3 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి, వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని ప్రకటించారు. వాగులో మునిగి ఆరుగురు మృతిచెందిన విషయం తెలిసిన వెంటనే పోలవరం ఎమ్మెల్యే బాలరాజుతో మాట్లాడిన ఆళ్ల నాని ఆ కుటుంబాల పరిస్థితిని సీఎం దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో ఆరు కుటుంబాలకు మూడు లక్షల రూపాయల చొప్పున ఎక్స్‌గ్రేషియా అందించాలని సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశించారు. బాధితులకు గురువారం మూడులక్షల రూపాయల చెక్కులను ఇస్తామని, ఆ కుటుంబాలకు అండగా ఉంటామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని చెప్పారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top