ఊరూరా సందడి.. ప్రతి ఇంటా వైఎస్‌ జగన్‌ మాట

The trust in YS Jagans government is registered through public support survey - Sakshi

పండుగ వాతావరణంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ 

ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, కన్వీనర్లు, గృహ సారథులు, వలంటీర్లకు ఘన స్వాగతం  

చిరునవ్వుతో స్వాగతిస్తున్న అక్కచెల్లెమ్మలు, అన్నదమ్ములు 

నాలుగేళ్లలో ఎంతో లబ్ధి చేకూరిందని ప్రజల హర్షం  

తప్పకుండా మళ్లీ జగనే సీఎం కావాలని ఆకాంక్ష 

సీఎం పాలనకు మద్దతుగా 63 లక్షల మిస్డ్‌ కాల్స్‌ 

ఈ నెల 29 వరకు  కార్యక్రమం పొడిగింపు

సాక్షి, అమరావతి: రాష్ట్ర వ్యాప్తంగా ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగుతోంది. ప్రతి ఊళ్లోనూ సందడి నెలకొంది. సీఎం జగన్‌ ప్రతినిధులుగా వచ్చిన ఎమ్మెల్యేలు, ఇన్‌చార్జ్‌లు, సమన్వయకర్తలు, కన్వినర్లు, గృహ సారథులు, వలంటీర్లకు ప్రజలు చిరునవ్వుతో స్వాగతం పలుకుతున్నారు. పలు చోట్ల ఎదురువెళ్లి బ్రహ్మరథం పడుతున్నారు. ప్రజల వద్దకే ఎమ్మెల్యే రావడం అంటే అది కేవలం ఒక్క సీఎం జగనన్న వల్లే సాధ్యమైందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తు­న్నారు.

నాలుగేళ్లలో ఏ మేరకు లబ్ధి కలిగిందో ప్రజలే ఆనందంగా నేతలకు వివరిస్తుండటం ప్రత్యక్షంగా కనిపిస్తోంది. అందరి బాగు కోరుకుంటున్న జగనన్ననే మళ్లీ సీఎంగా గెలిపించుకుంటామని అన్న­దమ్ములు, అక్కాచెల్లెళ్లు, అవ్వాతాతలు చెబుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏప్రిల్‌ 7వ తేదీన ’జగనన్నే మా భవిష్యత్తు’ పేరుతో మెగా పీపుల్స్‌ సర్వే ప్రారంభమైన విషయం తెలిసిందే.

ఈ కార్యక్రమం ద్వారా రాష్ట్ర ప్రజలు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వంపై ఉన్న నమ్మకాన్ని ప్రజా మద్దతు సర్వే ద్వారా నమోదు చేస్తున్నారు. ఏప్రిల్‌ 18 నాటికి ఏకంగా 63 లక్షల మంది 82960 82960 నంబర్‌కు మిస్డ్‌ కాల్‌ ఇచ్చి మద్దతు తెలిపారని ఎమ్మెల్సీ చంద్రగిరి ఏసురత్నం, వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పానుగంటి చైతన్యలు తెలిపారు. బుధవారం వారు తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. సీఎం జగన్‌ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలులో కులం, మతం, ప్రాంతం, వర్గం, రాజకీయ పార్టీలను చూడకుండా అర్హులందరికీ లబ్ధి కలిగిస్తోందన్నారు.

మలి దశ కార్యక్రమంలో ప్రతిపక్ష పార్టీలకు మద్దతుగా ఉన్న ప్రాంతాల్లోని ప్రజలకు కూడా అందించిన సంక్షేమ పథకాలను వారి ఇళ్ల వద్దకే వెళ్లి వివరిస్తామని చెప్పారు. అపూర్వ ప్రజా స్పందన చూసి ప్రతిపక్షాలు తట్టుకోలేపోతున్నాయన్నారు. సోషల్‌ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తు­న్నాయని చెప్పారు. గత ప్రభుత్వంలో చంద్రబాబు ఒక్క హామీ కూడా నెరవేర్చకుండా మోసం చేస్తే.. సీఎం జగన్‌ సులభతర పరిపాలన, సచివాలయం ద్వారా నేరుగా ఇంటింటికి సంక్షేమ పథకాలు అందిస్తున్నారని చెప్పారు.  

ఈ నెల 29 వరకు ప్రచార కార్యక్రమం
రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందన, సీఎం వైఎస్‌ జగన్‌ పాలన పట్ల విశేష సానుకూలత నేపథ్యంలో ‘జగనన్నే మా భవిష్యత్తు’ కార్యక్రమాన్ని ఈ నెల (ఏప్రిల్‌) 29వ తేదీ వరకు పొడిగించారు. ఈ మేరకు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. మెగా సర్వే ఫలితాలను కూడా అదే రోజున ప్రకటించనున్నారు.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top