గ్రామాల్లో అక్రమ లేఅవుట్లపై కఠిన చర్యలు!

Strict measures against illegal layouts in villages - Sakshi

తక్షణమే నోటీసులు జారీ చేయాలని మంత్రులు పెద్దిరెడ్డి, బొత్స ఆదేశం 

పంచాయతీరాజ్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో సమీక్ష 

సాక్షి, అమరావతి: నిబంధనలకు విరుద్ధంగా గ్రామాల్లో అక్రమ లేఅవుట్లు వేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ అనధికార లేఅవుట్లలో ప్లాట్‌లు కొనుగోలు చేస్తున్న వారు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన ప్రభుత్వం వీటిపై దృష్టిపెట్టింది. నిబంధనల ప్రకారం ప్రభుత్వానికి ఫీజు చెల్లించకపోవడం, అసలు అనుమతులు తీసుకోకపోవడం వంటి అంశాలను గుర్తించింది. ఈ అంశాలపై చర్చించేందుకు సోమవారం పంచాయతీరాజ్, టౌన్‌ ప్లానింగ్‌ అధికారులతో పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ సమీక్ష నిర్వహించారు. గ్రామ పంచాయతీలు, అర్బన్‌ అథారిటీ పరిధిలో అనధికారికంగా ఉన్న లేఅవుట్లపై చర్యలు చేపట్టాలని సమావేశంలో నిర్ణయించారు. అన్ని జిల్లాల్లో అక్రమ లేఅవుట్లపై సర్వే చేసి, అనుమతి లేని వాటికి తక్షణమే నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు.  

► పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో ఉండే పంచాయతీల్లో లేఅవుట్లకు వసూలు చేసే ఫీజుల్లో కొంత వాటా సదరు పంచాయతీకి కూడా ఇవ్వాలన్న అంశంపైనా మంత్రుల సమావేశంలో చర్చకు వచ్చింది. ఫీజుల వాటాపై అధికారులు చర్చించి నిర్ణయం తీసుకోవాలని మంత్రులు సూచించారు.   
► పట్టణ ప్రాంతాల్లో మాదిరిగానే గ్రామ పంచాయతీల్లో కూడా అక్రమ లేఅవుట్ల రెగ్యులరైజేషన్‌ స్కీం తీసుకువచ్చే అంశంపైనా చర్చ జరిగింది. 
► గ్రామ పంచాయతీల పరిధిలో 2015లో లెక్కల ప్రకారం 6,049 అనుమతి లేని లేఅవుట్లు ఉన్నట్టు మంత్రుల దృష్టికి అధికారులు తీసుకొచ్చారు.  
► అందులో మూడు వందల వరకు అక్రమ లేఅవుట్లు విజయవాడ, విశాఖ, తిరుపతి, రాజమహేంద్రవరం, గుంటూరు వంటి పెద్ద నగరాలకు ఆనుకొని ఉన్న గ్రామ పంచాయతీల పరిధిలో ఉన్నాయని.. వాటి విలువ రూ. వేల కోట్లు  ఉంటుందని వివరించారు. 

చెరువు కట్టల బలోపేతానికి చర్యలు 
భారీవర్షాల నేపథ్యంలో రాష్ట్రంలో ఉన్న చెరువుల కట్టలను పరిశీలించాలని అధికారులను మంత్రి పెద్దిరెడ్డి ఆదేశించారు. బలహీనంగా ఉన్న చెరువు కట్టలను యుద్ధప్రాతిపదికన పటిష్టం చేయాలన్నారు. హైదరాబాద్‌లో చెరువుల కట్టలు తెగి అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందిని అంతా చూస్తున్నారని, రాష్ట్రంలో అటువంటి పరిస్థితి రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామాల్లో చెరువు కట్టల బలోపేతానికి ఉపాధి హామీ కింద పనులు వెంటనే చేపట్టాలని సూచించారు. పంచాయతీరాజ్‌ శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్, డైరెక్టర్‌ ఆఫ్‌ టౌన్‌ అండ్‌ కంట్రీ ప్లానింగ్‌ వి.రాముడు తదితరులు పాల్గొన్నారు.  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top