నారా వారి హెరిటేజ్‌కు బాబోరి భారీ నజరానా
35 ఉద్యోగాల కల్పనకు ఖజానా నుంచి రూ.59.69 కోట్ల రాయితీ
టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌కు రూ.34.93 కోట్లు సబ్సిడీ.. ఐదేళ్లపాటు
నూరు శాతం ఎస్‌జీఎస్‌టీ రూ.17.80 కోట్లు తిరిగి చెల్లింపు
ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్‌కు రూపాయి చొప్పున రూ.0.98 కోట్ల చెల్లింపు.. ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదేళ్ల మినహాయింపు రూ.0.98 కోట్లు
వడ్డీ రాయితీ కింద రూ.5 కోట్లు తిరిగి చెల్లింపు
విస్తరణతో హెరిటేజ్‌కే అధిక లాభాలు... ఖజానాకు మాత్రం గండి
సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఎస్‌ఐపీబీ, కేబినెట్ నిర్ణయం
ఉత్తర్వులు జారీ చేసిన పరిశ్రమల శాఖ
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ప్రభుత్వ ఖజానా నుంచి భారీ నజరానా మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కేవలం 35 మందికి ఉద్యోగాలు కల్పించనున్న హెరిటేజ్ సంస్థకు ఖజానా నుంచి ఏకంగా రూ.59.69 కోట్ల రాయితీలను ఇచ్చేశారు. తన కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ఈ రాయితీలు ఇచ్చేందుకు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ), కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. దీంతో పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
ఉద్యోగాల కల్పన పేరుతో తన కుటుంబ సంస్థ హెరిటేజ్ విస్తరణ ద్వారా వ్యాపారాన్ని పెంచుకునేందుకు రాష్ట్ర ఖజానా నుంచి భారీ రాయితీలను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆమోదించడం గమనార్హం. కొత్తగా హెరిటేజ్ సంస్థను ఏర్పాటు చేయడం లేదు. ఇప్పటికే తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం కాశీపెంట్లలో ఉన్న హెరిటేజ్ ఫుడ్స్ యూనిట్‌ను అప్‌గ్రేడేషన్ పేరుతో విస్తరించనున్నారు. ఈ విస్తరణకు రూ.209.68 కోట్లు వ్యయం చేస్తారట. తద్వారా ఉద్యోగాలిచ్చేది మాత్రం 35 మందికే.
ఖజానాకు గండి కొట్టి హెరిటేజ్ విస్తరణకు రాయితీలు
ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీ 4.0 కింద మెగా ప్రాజెక్టు హోదా పొందిన ఈ హెరిటేజ్ డెయిరీ విస్తరణ వల్ల ఉత్పత్తుల తయారీ బాగా పెంచుకోనుంది. ఫ్లేవర్డ్ పాలు 131 శాతం, పనీర్ 400 శాతం, నెయ్యి ఉత్పత్తి ఏకంగా 566 శాతం పెరిగి చంద్రబాబు కుటుంబం భారీ లాభాలను పొందనుంది. మరోవైపు ఈ సంస్థకిచ్చే రాయితీలతో ప్రభుత్వ ఖజానాకు భారీగా గండి పడనుంది. తన సొంత కుటుంబ సంస్థ లాభాల కోసం ఖజానా నుంచి ఏకంగా రూ.59.69 కోట్ల రాయతీలను ఇవ్వడం పట్ల అధికార వర్గాలు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి.
ఈ మొత్తాన్ని ఐదేళ్లపాటు ఖజానా నుంచి హెరిటేజ్‌కు రాయితీల రూపంలో చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. టెక్నాలజీ అప్‌గ్రేడేషన్‌కు రూ.34.93 కోట్లు సబ్సిడీ చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే నూరు శాతం ఐదేళ్లపాటు ఎస్‌జీఎస్‌టీ రూ.17.80 కోట్లు తిరిగి హెరిటేజ్‌కు చెల్లించనున్నారు. ఐదేళ్లపాటు యూనిట్ విద్యుత్‌కు రూపాయి చొప్పున రూ.0.98 కోట్లు, ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఐదేళ్ల మినహాయింపు రూ.0.98 కోట్లు రాయితీ కల్పించనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వడ్డీ రాయితీ కింద రూ.5 కోట్లు తిరిగి చెల్లించనున్నట్లు ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు.
అసెంబ్లీ సాక్షిగా నీతులు చెబుతూ...
‘‘హెరిటేజ్ మా కుటుంబ సంస్థ. మా కుటుంబ సభ్యులు దాన్ని నిర్వహిస్తున్నారు. ఆ సంస్థకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి ఎటువంటి లబ్ధీ చేకూరలేదు. ప్రభుత్వ సహాయాన్ని కూడా కోరుకోలేదు. ఈ సంస్థ పెట్టినప్పుడే మేము ఒక నిర్ణయానికి వచ్చాం. ప్రభుత్వం నుంచి ఏదీ ఆశించకూడదన్నదే మా విధానం. దానికి కట్టుబడే ఇప్పటి వరకు నడుచుకున్నాం’’ ఇదీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మొన్నటి బడ్జెట్ సమావేశాల్లో వల్లెవేసిన నీతి వ్యాఖ్యలు.
సీన్ కట్‌చేస్తే.. ముఖ్యమంత్రిగా చంద్రబాబు, మంత్రి లోకేశ్ స్వయంగా పాల్గొన్న మంత్రివర్గ సమావేశంలో తమ కుటుంబ సంస్థ హెరిటేజ్‌కు ఆయాచిత లబ్ధి చేకూర్చే విధంగా భారీ ప్రయోజనాలను కట్టబెడుతూ నిర్ణయం తీసుకున్నారు.
తొలి నుంచీ హెరిటేజ్‌పై అమిత ప్రేమ
2014–19 సమయంలో కూడా పశువుల దాణా తయారీ కేంద్రం పేరుతో రాజధానికి సమీపంలో కృష్ణా జిల్లాలో 10 ఎకరాలు భూమి, నెల్లూరు జిల్లాలో హెరిటేజ్ ఫుడ్స్ పేరిట 10 ఎకరాలు, అనంతపురంలో 6.46 ఎకరాలు కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా ప్రభుత్వం నుంచి అయాచిత ప్రయోజనాలు పొందుతూ అసెంబ్లీలో మాత్రం ప్రభుత్వం నుంచి హెరిటేజ్ ఎటువంటి ప్రయోజనాలనూ పొందడం లేదంటూ చెప్పడం ఒక్క చంద్రబాబుకే చెల్లుతుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
అలా ప్రతిపాదనలు రాగానే... ఇలా ప్రోత్సాహకాలు
» తిరుపతి జిల్లా, చంద్రగిరి మండలం, కాశీపెంట్ల గ్రామంలో ఉన్న తమ పాల శుద్ధి యూనిట్ సాంకేతిక ఉన్నతీకరణ (విస్తరణ) కోసం రూ.209.68 కోట్ల పెట్టుబడితో 35 మందికి ప్రత్యక్ష ఉపాధి కల్పన సామర్థ్యంతో, ప్రత్యేకంగా రూపొందించిన ప్రోత్సాహకాల మంజూరు కోసం హెరిటేజ్ సంస్ధ ప్రతిపాదనలను సమర్పించింది.
» హెరిటేజ్ సంస్థ ప్రతిపాదనలపై గత నెల 12న సీఎస్ అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో చేసిన సిఫార్సులను గతనెల18న సీఎం అధ్యక్షతన జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక బోర్డు (ఎస్‌ఐపీబీ) సమావేశంలో ఉంచారు.
» కంపెనీ అభ్యర్థించిన మేరకు రూ.59.69 కోట్ల వరకు ప్రత్యేక ప్రోత్సాహకాలను మంజూరు చేయాలని ఎస్‌ఐపీబీ సిఫార్సు చేసింది.


