మనవైపు శ్రీశైలం ప్లాంట్లు సురక్షితం 

Srisailam plants on our side are safe - Sakshi

ప్రమాదానికి ఆస్కారమే లేదు 

అనవసర భయాలు అక్కర్లేదు: జెన్‌కో ఎండీ శ్రీధర్‌ 

సాక్షి, అమరావతి: శ్రీశైలం ఎడమ గట్టు జల విద్యుత్‌ కేంద్రంలో ప్రమాదం చోటు చేసుకున్న నేపథ్యంలో కుడిగట్టు జల విద్యుత్‌ కేంద్రాల్లో భద్రతను ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పాదక సంస్థ (ఏపీజెన్‌కో) క్షుణ్నంగా పరిశీలించింది. ఏపీ జల విద్యుత్‌ కేంద్రాలు నూటికి నూరుపాళ్లు సురక్షితమని నివేదిక రూపొందించింది. ఏపీ జెన్‌కో ఎండీ శ్రీధర్‌ ఈ వివరాలను సోమవారం మీడియాకు వెల్లడించారు.  
శ్రీశైలం కుడిగట్టు విద్యుత్‌ కేంద్రంలోని జనరేటర్లు 

పోలికే లేదు... 
► ఏపీ జెన్‌కో పరిధిలో ఉన్న జల విద్యుత్‌ కేంద్రాలు 1960లో ఏర్పాటు చేశారు. తెలంగాణ పరిధిలో ఉన్నవి 1990లో డిజైన్‌ చేశారు. సాంకేతిక పరిజ్ఞానంలో వీటికి పోలిక లేదు. 
► తెలంగాణ జల విద్యుత్‌ కేంద్రాలు పూర్తిగా భూగర్భంలో (భూ ఉపరితలం నుంచి కిలో మీటరున్నర) ఉన్నాయి. ఏపీ జల విద్యుత్‌ కేంద్రం భూ ఉపరితలంపైనే ఉన్నందున విపత్కర సమయంలో పొగ, విషవాయువులు తేలికగా బయటకు వెళ్లిపోతాయి.  
► తెలంగాణ విద్యుత్తు కేంద్రం జనరేషన్, నీళ్ల పంపింగ్‌ టెక్నాలజీతో పనిచేస్తుంది. అందుకు తగ్గట్టుగానే భూగర్భంలో నిర్మాణం చేశారు. ఏపీ వైపు ఉన్న ప్లాంట్లు కేవలం జనరేషన్‌ మాత్రమే చేస్తాయి. నీటిని రివర్స్‌ పంప్‌ చేసే టెక్నాలజీ లేదు కాబట్టి ప్రమాదానికి అంతగా ఆస్కారం లేదు. 
► కుడివైపు జల విద్యుత్‌ కేంద్రాలు ఒక్కొక్కటి 110 మెగావాట్ల (మొత్తం 7) సామర్థ్యంతో కూడుకున్నవి. నీటి నిల్వ ఎక్కువగా ఉన్నప్పుడే విద్యుత్‌ ఉత్పత్తి చేస్తాయి. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను బయటకు పంపి ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థకు లింక్‌ చేశారు. తెలంగాణలో భూగర్భంలోనే (ఇండోర్‌) ట్రాన్స్‌మిషన్‌ వ్యవస్థ ఉంది. ఇండోర్‌ ట్రాన్స్‌మిషన్‌ వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు కాపర్‌ వైర్‌ అతి వేడిని పుట్టించే వీలుంది.

దురదృష్టవశాత్తూ ప్రమాదం.. 
‘అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన తెలంగాణ విద్యుత్‌ కేంద్రంలో దురదృష్టవశాత్తూ ప్రమాదం జరిగింది. అక్కడి టెక్నాలజీ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడుకున్నది. భూగర్భ బొగ్గు గని తరహాలో తెలంగాణ ప్లాంట్లు ఉంటే ఏపీ వైపు ఉన్నవి ఓపెన్‌కాస్ట్‌ మాదిరిగా ఉంటాయి. ఏపీ జల విద్యుత్‌ ప్లాంట్లు పూర్తిగా సురక్షితం’ – శ్రీధర్, జెన్‌కో ఎండీ  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top