ఏపీలో దిక్కుమాలిన మంత్రులు, ఎమ్మెల్యేలు | Senior TDP Leader NB Sudhakar Reddy fires on TDP Party | Sakshi
Sakshi News home page

ఏపీలో దిక్కుమాలిన మంత్రులు, ఎమ్మెల్యేలు

May 9 2026 6:00 AM | Updated on May 9 2026 6:03 AM

Senior TDP Leader NB Sudhakar Reddy fires on TDP Party

సొంత పార్టీపై టీడీపీ సీనియర్‌ నేత ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి ఆగ్రహం  

ప్రజాప్రతినిధులే అవినీతిపరులైతే మేమేం కావాలి   

ఎమ్మెల్యేలు దేన్ని అమ్ముకుందామా అని చూస్తున్నారు 

మంత్రులు సరదాగా తిరుగుతున్నారు

సాక్షి, అమరావతి: టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలపై ఆ పార్టీకి చెందిన సీనియర్‌ నేత ఎన్‌బీ సుధాకర్‌రెడ్డి విరుచుకుపడ్డారు. దిక్కుమాలిన కొందరు మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతిపరులైతే తాము ఏం చేయాలని అధిష్టానాన్ని ప్రశ్నించారు. ఎల్లో మీడియాకు చెందిన ఒక టీవీ చానల్‌ చర్చలోనే ఆయన సొంత పార్టీ తీరుపై తీవ్ర ఆరోపణలు చేశారు. కొందరు ఎమ్మెల్యేల అవినీతి పెరిగిపోయిందని చెప్పారు. కొందరు ఎమ్మెల్యేలు ఇసుక అమ్ముదామా? ఎర్రమట్టి అమ్ముదామా? గ్రానైట్‌ అమ్ముదామా? అని ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఎర్రచందనం అమ్మడం కుదరక ఊరుకున్నారని ఎద్దేవా చేశారు. ఇలాంటి ఎమ్మెల్యేలు, మంత్రుల్ని తయారు చేశారని మండిపడ్డారు.

కొంతమంది మంత్రులు సరదాగా తిరుగుతున్నారని, కొందరు మంత్రులు వారికి సంబంధించిన అంశాలనూ పరిష్కరించలేకపోతున్నారని వ్యాఖ్యానించారు. దున్నపోతు మీద వానపడినట్టు ఉంటున్నా రని విమర్శించారు. ఎన్నికల్లో కోట్ల రూపాయిలు ఖర్చు పెట్టామని, మళ్లీ అదే పని చేసి గెలుస్తామని చెబుతున్నారని ధ్వజమెత్తారు. కానీ వాళ్లు తమిళనాడు ఎన్నికల్లో ఏం జరిగిందో చూడాలని సూచించారు. టీవీకే జీరో బడ్జెట్‌ పాలిటిక్స్‌తో గెలిచిందన్నారు. అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఎమ్మెల్యేలు, మంత్రులు ఓడిపోవడం ఒక్కటే కాదని, పార్టీ కూడా పోతుందని చెప్పారు. అవినీతి, అక్రమాలకు పాల్పడే వారిని అధిష్టానం కట్టడి చేయాలన్నారు. కొందరు ఎమ్మెల్యేలపై అవినీతి ఆరోపణలు, అమ్మాయిలతో సంబంధాలు బయటకు వచ్చాయని విమర్శించారు.   

చంద్రబాబుకు ముందే చెప్పా 
ఎన్నికల్లో మళ్లీ గెలవాలంటే ఒళ్లు దగ్గర పెట్టుకుని పని చేయాలని చంద్రబాబుకు ప్రమాణ స్వీకారం చేసిన రోజే చెప్పానని సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఇటీవల ఐదు రాష్ట్రాలకు జరిగిన ఎన్నికల్లో మూడు రాష్ట్రాల్లో అధికార పార్టీలు ఓడిపోయాయని, చంద్రబాబూ గతంలో మూడుసార్లు ఓడిపోయిన సందర్భాలు ఉన్నాయన్నారు. ప్రజల అంచనాలు ఎక్కువగా ఉంటాయని, సంక్షేమ పథకాలు ఎన్ని అమలు చేసినా అవినీతి ఎమ్మెల్యేల ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పారు. జిల్లాల్లో ఇంకా ఎక్కువ నష్టం జరుగుతుందని, తమ కడుపు చించుకుంటే కాళ్లపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.  

గతంలోనూ సుధాకర్‌రెడ్డి ఫైర్‌ 
రెవెన్యూశాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ తిరుపతికి వచ్చి విలాసాలు, జల్సాలు చేస్తున్నారని సుధాకర్‌రెడ్డి గతంలోనే బాంబు పేల్చారు. ఆ మంత్రి వ్యవహారాలు బయటపెట్టడంతో అప్పట్లో టీడీపీ అధిష్టానం ఆయనపై కన్నెర్ర చేసింది. పార్టీ క్రమశిక్షణ సంఘం నోటీసులు ఇచ్చి వివరణ కోరగా ఆయన సమాధానం ఇచ్చారు. తాజాగా మళ్లీ ఎమ్మెల్యేలు, మంత్రుల అవినీతిపై అధికార పార్టీ అనుకూల మీడియా చానల్‌లో జరిగిన చర్చలోనే సుధాకర్‌రెడ్డి మండిపడడం గమనార్హం.  

Advertisement
 
Advertisement
Advertisement