Seed Balls: విత్తన బంతి.. హరిత కాంతి

Seed Balls Making: Two Lakh Seed Balls For Jagananna Pacha Thoranam - Sakshi

2 లక్షల సీడ్‌బాల్స్‌ తయారుచేస్తున్న సామాజిక అటవీ శాఖ అధికారులు

గుట్టలు, కొండలకు ‘జగనన్న పచ్చ తోరణం’

సీఎం సూచనల మేరకు విస్తృతంగా అవగాహన

సెప్టెంబర్‌లో సీడ్‌బాల్స్‌ విసిరేందుకు సిద్ధం 

సాక్షి, విశాఖపట్నం: పర్యావరణ పరిరక్షణలో కీలకమైన పచ్చని చెట్లను పెంచడానికి వీలైన అన్ని వనరులను అధికార యంత్రాంగం సమీకరిస్తోంది. రెండేళ్లుగా చేపడుతున్న ‘జగనన్న పచ్చతోరణం’ సత్ఫలితాలనిస్తుండడంతో.. పచ్చదనం పెంపునకు ఈ ఏడాది అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. విశాఖ జిల్లాలోని కొండలు, గుట్టలు, ఖాళీ స్థలాల్లో విసిరేందుకు సామాజిక అటవీ శాఖ 2 లక్షల విత్తన బంతులను తయారుచేయిస్తోంది.  


అడవులు సహజ సిద్ధంగా తయారు కావాలి. గుంతలు తవ్వి, మొక్కలు నాటి.. అడవులు సృష్టించాలంటే సాధ్యం కాని పని. ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన అడవి జీవ వైవిధ్యానికి అద్దం పడుతుంది. ఎలాంటి సంరక్షణ చర్యలు తీసుకోకపోయినా.. అడవుల్లో చెట్లు సహజ సిద్ధంగానే పెరుగుతాయి. ఇలాంటి అడవులను సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా శ్రమిస్తోంది. ఇందుకోసం విలక్షణమైన విత్తన బంతుల కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. హరిత హారం అడవిలో అంతంత మాత్రంగా కనిపించడం, గుట్టలు, కొండల్లో పచ్చదనం కనుమరుగవుతున్న విషయాలను గుర్తించిన ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ‘జగనన్న పచ్చతోరణం’పేరుతో విత్తన బంతుల కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. 


ఏమిటీ విత్తన బంతులు? 

ప్రత్యేకంగా సంరక్షణ అవసరం లేకుండా.. ప్రకృతి సిద్ధంగా త్వరగా పెరిగే చెట్ల రకాలకు అధికారులు విత్తన బంతుల పద్ధతి అమలు చేస్తున్నారు. ముందుగా మన వాతావరణానికి అనుకూలమైన చింత, వేప, కానుగ, రెల్ల, కుంకుడు, ఏగిస మొదలైన చెట్ల నుంచి విత్తనాలు సేకరిస్తారు. జల్లెడ పట్టిన ఎర్రమట్టిని సిద్ధం చేస్తారు. 75 శాతం ఎర్రమట్టిలో 25 శాతం ఆవుపేడ, కొంత కోకాపిట్‌ను కలిపి ఎరువు మిశ్రమంగా తయారు చేస్తారు. ఈ మిశ్రమాన్ని కలిపి వారం రోజులు మురుగబెడతారు. అనంతరం జీవామృతం(ఆవుపేడ, బెల్లం, శనగపిండి)తో మిశ్రమాన్ని ముద్దలుగా తయారు చేస్తారు. ఇవి వీడిపోకుండా గట్టిగా ఉండేందుకు స్టార్చ్‌ లిక్విడ్, బబుల్‌ గ్లూ ద్రావణాలు మట్టి ముద్దలో కలుపుతారు. ఈ మట్టి ముద్దల్లో విత్తనాలను పెట్టి ఎండబెట్టారు. తొలకరి వర్షాలు పడిన తర్వాత కందకాలు, గుట్టలు, కొండలు, సాగుకు పనికిరాని భూముల్లో విసురుతారు. అటవీ జాతి మొక్కలే కావడంతో సీడ్‌ బాల్స్‌ నుంచి విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి. 


గతేడాది మంచి ఫలితాలు 

గతేడాది కూడా అటవీ శాఖ విత్తన బంతులను చల్లింది. మొత్తం 2 లక్షల విత్తన బంతులు తయారు చేయగా.. జీవీఎంసీకి 50 వేల బంతులు అందించారు. నౌకాదళంతో కలిసి నగరంలోని కొండలపై జీవీఎంసీ అధికారులు విత్తన బంతులు చల్లారు. మిగిలిన 1.50 లక్షల బంతులను జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో అటవీ శాఖ అధికారులు విసిరారు. వాటి నుంచి ప్రస్తుతం మొక్కలు ఆరోగ్యంగా ఎదుగుతున్నాయి. ఈ ఏడాది కూడా 2 లక్షల సీడ్‌ బాల్స్‌ తయారు చేసే ప్రక్రియను ఇప్పటికే ప్రారంభించారు.  
  
ముఖ్యమంత్రి సూచనలతో..  
ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సూచనల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా విత్తన బంతులు తయారు చేస్తున్నాం. నేడు మనం జాగ్రత్త చేసిన విత్తనమే.. రేపు భారీ వృక్షంగా మారుతుంది. జగనన్న పచ్చతోరణంలో భాగంగా విత్తన బంతుల కార్యక్రమం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాం. తక్కువ ఖర్చుతో సేంద్రీయ పద్ధతిలో తయారు చేసి.. పెద్ద సంఖ్యలో వృక్ష సంపద పెరిగేలా చర్యలు చేపడుతున్నాం. అవసరమైతే నౌకాదళ సహకారం కూడా తీసుకుంటాం.  
– ఎన్‌ ప్రతీప్‌కుమార్, రాష్ట్ర అటవీ శాఖ ప్రధాన ముఖ్య సంరక్షణ అధికారి 

సీడ్‌ బాల్స్‌తో అనేక లాభాలున్నాయి.. 
కొండప్రాంతాల్లో గోతులు తవ్వి మొక్కలు నాటడం చాలా కష్టతరం. విత్తన బంతుల తయారీ తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. పోషకాలు అధికంగా ఉండే మట్టిలో విత్తనాలను పెట్టడం వల్ల మొక్కలు బతికే అవకాశాలు 100 శాతం ఉన్నాయి. గతేడాది చేపట్టిన సీడ్‌బాల్స్‌ ప్రక్రియ సత్ఫలితాలిచ్చింది. ఈ పద్ధతిలో జిల్లాలోని అటవీ ప్రాంతం, రెవెన్యూ హిల్స్‌లో.. అన్ని రకాల ప్రదేశాల్లోనూ మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేశాం. సెప్టెంబర్‌లో విత్తన బంతులు విసిరే ప్రక్రియ ప్రారంభిస్తాం. 
– గంపా లక్ష్మణ్, డీఎఫ్‌వో, సామాజిక అటవీ శాఖ

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top