ఆలపాటి గిరిధర్, గంధం సునీత , పురుషోత్తం కుమార్
సాక్షి, అమరావతి, సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తులుగా మరో ముగ్గురు పేర్లను సుప్రీం కోర్టు కొలీజియం తాజాగా సిఫారసు చేసింది. న్యాయాధికారుల కోటా నుంచి హైకోర్టు న్యాయమూర్తులుగా గంధం సునీత, ఆలపాటి గిరిధర్, చింతలపూడి పురుషోత్తం కుమార్ రానున్నారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో సోమవారం సమావేశమైన కొలీజియం ఈమేరకు తీర్మానం చేసింది. ఈ ముగ్గురి పేర్లను హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని కొలీజియం గతేడాది అక్టోబర్‌లో సుప్రీంకోర్టుకు సిఫారసు చేసింది.
తాజాగా సుప్రీంకోర్టు కొలీజియం సమావేశమై వీరిని హైకోర్టు న్యాయమూర్తులుగా నియమించేందుకు సిఫారసు చేసింది. గంధం సునీత ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు. ఆలపాటి గిరిధర్ విశాఖపట్నం సేల్స్ ట్యాక్స్ అప్పిలేట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా కొనసాగుతున్నారు. పురుషోత్తంకుమార్ ఏపీ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా ఉన్నారు. సుప్రీంకోర్టు సిఫారసులకు కేంద్రం ఆమోదం తెలిపిన తరువాత సంబంధిత ఫైలు ప్రధాని కార్యాలయం ద్వారా రాష్ట్రపతికి చేరుతుంది. రాష్ట్రపతి ఆమోద ముద్ర అనంతరం వారి నియామకాన్ని నోటిఫై చేస్తూ కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేస్తుంది.
గంధం సునీత...
గంధం సునీత 1977 జూలై 14న కృష్ణా జిల్లా పెదకళ్లేపల్లిలో గంధం వీరయ్య, శివనాగేంద్రమ్మ దంపతులకు వ్యవసాయ కుటుంబంలో జన్మించారు. స్థానిక ఎస్‌డీఎన్‌ఎస్‌డీఎస్ పాఠశాలలో 10వ తరగతి, మచిలీపట్నం లేడీయాంప్తిల్ కాలేజీలో ఇంటర్, విజయవాడ గాంధీ మహిళా కళాశాలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. మాంటిస్సోరి కాలేజీలో ఎల్‌ఎల్‌బీ చేసి టాపర్‌గా బంగారు పతకం సాధించారు. 1999 జూలై 1న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. విజయవాడలో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 2008 నుంచి 2010 వరకు గుడివాడలో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్‌గా పని చేశారు. 2010లో సివిల్ జడ్జిగా, 2012లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అనంతరం జిల్లా జడ్జిగా పలు చోట్ల పని చేశారు. 2019–23 వరకు హైకోర్టు రిజిస్ట్రార్‌గా వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. 2023 నుంచి తూర్పు గోదావరి జిల్లా ప్రధాన జిల్లా జడ్జిగా ఉన్నారు.
ఆలపాటి గిరిధర్...
ప్రకాశం జిల్లా కొండేపి మండలం గోగినేనివారిపాలెంలో జన్మించారు. తండ్రి బాపయ్య చౌదరి స్వాతంత్ర సమరయోధుడు, విశాంత్ర ప్రధానోపాధ్యాయుడు. ఒంగోలు ఇందిరా ప్రియదర్శిని న్యాయ కళాశాలలో లా డిగ్రీ పొందారు. 1998 ఆగస్టు 27న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. గిరిధర్ ఒంగోలు జిల్లా కోర్టుతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో న్యాయవాదిగా ప్రాక్టీస్ చేశారు. తరువాత న్యాయాధికారిగా ఎంపికయ్యారు. వివిధ హోదాల్లో న్యాయాధికారిగా పనిచేశారు. విజయవాడ ఏసీబీ కోర్టు ప్రత్యేక జడ్జిగా వ్యవహరించారు. కర్నూలు, విజయనగరం, విశాఖపట్నంలో ప్రధాన జిల్లా జడ్జిగా పని చేశారు. హైకోర్టులో రిజిస్ట్రార్‌గా వ్యవహరించారు. ప్రస్తుతం విశాఖపట్నం ఏపీ వ్యాట్ అప్పిలెట్ ట్రిబ్యునల్ చైర్మన్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.
చింతలపూడి పురుషోత్తం కుమార్
విశాఖపట్నంలో చింతలపూడి రాంబాబు, రామరత్నం దంపతులకు జన్మించారు. రాంబాబు విశ్రాంత జిల్లా జడ్జి కాగా ఆ కుటుంబంలో మూడు తరాలుగా న్యాయవాదులుగా, న్యాయమూర్తులుగా సేవలు అందిస్తున్నారు. పురుషోత్తం కుమార్ ఆంధ్ర వర్సిటీలో మెరైన్ బయాలజీలో ఎమ్మెస్సీ పూర్తి చేశారు. ఉస్మానియా నుంచి లా డిగ్రీ పొందారు. 2002 నవంబర్ 22న న్యాయవాదిగా ఎన్‌రోల్ అయ్యారు. ప్రముఖ సీనియర్ న్యాయవాది ఎస్.రవి వద్ద వృత్తి మెళకువలు నేర్చుకున్నారు. హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు, రంగారెడ్డి జిల్లా కోర్టు, అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రాక్టీస్ చేశారు. 2010లో జిల్లా జడ్జిగా ఎంపికయ్యారు. అటు తరువాత వివిధ హోదాల్లో పలు జిల్లాల్లో పనిచేశారు. హైకోర్టులో వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించారు. రిజిస్ట్రార్‌గా అదనపు బాధ్యతలు నిర్వర్తించారు. 2025 జనవరి నుంచి ఏపీ జుడీషియల్ అకాడమీ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.


