రూ.8,000 కోట్లతో ‘ఉపాధి’

Rural Employment Guarantee Scheme in Andhra Pradesh - Sakshi

2021 - 22 లేబర్‌ బడ్జెట్‌ రూపకల్పన ఆరంభం

ఏడాది మొత్తంలో 30 కోట్ల పనిదినాల కల్పన లక్ష్యం

గ్రామాలవారీగా పనులతో ప్రణాళికలు తయారీ

వ్యవసాయ, అనుబంధ పనులకు ప్రాధాన్యం

సాక్షి, అమరావతి: ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే ఆర్థిక ఏడాదిలో నిరుపేద కూలీలకు రూ.8,000 కోట్ల మేర పనులు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలలో 2021-22 ఉపాధి హామీ లేబర్‌ బడ్జెట్‌ రూపకల్పనకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. కూలీలకు ఏడాది మొత్తంలో 30 కోట్ల పనిదినాలు కల్పించేలా గ్రామాలు, జిల్లాలవారీగా నెలవారీ ప్రణాళికలు రూపొందిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్‌ 2 నుంచి ప్రతి గ్రామంలో లేబర్‌ బడ్జెట్‌ రూపకల్పన ప్రక్రియ ఆరంభమైంది. నవంబరు 15వతేదీలోగా వీటిని సిద్ధం చేసి అదే నెల 30వతేదీ కల్లా గ్రామ పంచాయతీల అనుమతి తీసుకుంటారు. డిసెంబరు నెలాఖరు కల్లా గ్రామాల వారీగా ప్రణాళికలను కలెక్టర్లు ఆమోదిస్తారు. ఉపాధి హామీ లేబర్‌ బడ్జెట్‌ రూపకల్పనకు ప్రస్తుతం అధికారులకు శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వారం పది రోజుల్లో గ్రామ స్థాయి వరకు శిక్షణ పూర్తి కానుంది.

సచివాలయాల భాగస్వామ్యం..
‘గ్రామస్థాయి నుంచి దేశ స్థాయి’ ప్రణాళికలు అనే నినాదంతో ఉపాధి హామీ లేబర్‌ బడ్జెట్‌ రూపకల్పనలో గ్రామ సచివాలయాల వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వం భాగస్వామ్యలను చేసింది. వలంటీర్లతో పాటు గ్రామ సచివాలయంలో పనిచేసే వ్యవసాయ, ఉద్యానవన, పశుసంవర్థక, మత్స్య సహాయకుల సహాయంతో ఉపాధి హామీ ద్వారా చేపట్టే అవకాశం ఉన్న పనులను గుర్తిస్తారు. వ్యవసాయం, అనుబంధ కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇస్తూ చిన్న నదుల పునరుజ్జీవం, చెరువుల్లో పూడికతీత, హార్టికల్చర్, ప్లాంటేషన్, సేద్యపు నీటి కుంటలు, గిరిజన ప్రాంతాల్లో ఆర్‌వోఎఫ్‌ఆర్‌ భూముల సమగ్ర అభివృద్ధి తదితర పనులను వచ్చే ఆర్ధిక సంవత్సరంలో పెద్ద ఎత్తున చేపట్టాలని నిర్ణయించారు. (చదవండి: ఆపద‌ సమయంలో ప్రభుత్వాస్పత్రులే అండ..!)

ప్రజలకు ఉపకరించే స్థిరాస్తి కల్పన పనులు గుర్తించాలి
ఏడాది పొడవునా కూలీలకు నిరంతరాయంగా పనులు కల్పించేందుకు తగినన్ని పనులను లేబర్‌ బడ్జెట్‌ ప్లానింగ్‌ సమయంలో గుర్తించాలని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజా శంకర్‌ పేర్కొన్నారు. 2021-22 ఉపాధి హామీ లేబర్‌ బడ్జెట్‌ తయారీ రాష్ట్ర స్థాయి శిక్షణ కార్యక్రమాలను మంగళవారం ఆయన విజయవాడలో ప్రారంభించారు. రెండు రోజుల పాటు వీటిని నిర్వహించనున్నారు. ప్రాంతం, సీజన్‌ను బట్టి ఉపాధి హామీ పనులను ఎంపిక చేయాలని సూచించారు. ప్రజలకు ఉపకరించే స్థిరాస్తుల కల్పన పనులను చేపట్టాలన్నారు. వినూత్న పనులకు ప్రణాళికలో ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. 2021- 22లో పేదలకు 30 కోట్ల పనుల కల్పించాలంటే 45 కోట్ల పనిదినాలకు సరిపడా పనులను గుర్తించాలన్నారు. ప్రణాళిక సమయంలోనే జాబ్‌ కార్డులు లేని కూలీలను గుర్తించి జారీ చేసేలా  చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్‌ కమిషనర్లు శివప్రసాద్‌, కళ్యాణ్‌ చక్రవర్తి, జనార్దన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. (చదవండి: పోర్టబులిటీ.. ‘వలస’పాలిట పెన్నిధి)

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top