పడిపోతే.. ఫట్‌ | Risk due to osteoporosis: Andhra pradesh | Sakshi
Sakshi News home page

పడిపోతే.. ఫట్‌

Published Mon, Mar 24 2025 6:13 AM | Last Updated on Mon, Mar 24 2025 4:38 PM

Risk due to osteoporosis: Andhra pradesh

కాకినాడ ప్రభుత్వాస్పత్రి ఆర్థోపెడిక్‌ వార్డులో రోగులు

గుల్లబారుతున్న ఎముకలు

వృద్ధులే కాదు.. యువతలోనూ సమస్య

ఆస్టియోపొరోసిస్‌తో ప్రమాద ఘంటికలు

ప్రతి ఐదుగురు మహిళల్లో ఇద్దరికి ముప్పు

పోషకాహార లోపం, మారుతున్న జీవనశైలి కారణం  

మారుతున్న జీవన శైలి, ఆహారపు అలవాట్లు ప్రజల ఆరోగ్యాన్ని తీవ్రంగా దెబ్బ తీస్తున్నాయి. ముఖ్యంగా శరీర నిర్మాణానికి ఆధారంగా నిలిచే ఎముకలు చాలా త్వరగా పటుత్వాన్ని కోల్పోతున్నాయి. చిన్నగా కాలు తడబడి కింద పడితే చాలు.. ఫట్‌మంటూ విరిగిపోతున్నాయి. ఇక ద్విచక్ర వాహనాల పైనుంచి పడితే మల్టిపుల్‌ ఫ్రాక్చర్లు అవడం అనేది సర్వసాధారంగా మారిపోతోంది. చిన్నారుల నుంచి మూడు పదుల వయస్సు కూడా నిండని యువతలో సైతం ఎముకలు పటుత్వం తగ్గుతోంది.

ఎముకలు గుల్లబారడం, బలహీనపడటం, తేలికగా విరిగిపోయే స్థితిని వైద్య పరిభాషలో (ఆస్టియోపొరోసిస్‌) అంటారు. పౌష్టికాహార లోపం, వయోభారం, కాల్షియం, డి–విటమిన్‌ లోపం దీనికి ప్రధాన కారణాలని ఆర్థోపెడిక్‌ సర్జన్లు (ఎముకల శస్త్రచికిత్స నిపుణులు) చెబుతున్నారు. వీటికి తోడు హార్మోన్ల అసమతుల్యత, వారసత్వ (జెనిటిక్‌) ప్రభావం, మద్యపానం, ధూమపానం, శారీరక వ్యాయామం లేకపోవడం కూడా ఎముకల ఆరోగ్యంపై ప్రమాద ఘంటికలు మోగిస్తున్నాయి. – సాక్షి ప్రతినిధి, కాకినాడ

యువతలో సైతం.. 
ఒకప్పుడు ఆరు పదుల వయస్సు మీద పడినా చాలా మందిలో ఎముకలు బలహీన పడటమనే సమస్య ఉండేది కాదు. మారిన జీవన విధానంతో ఇప్పుడా పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ముఖ్యంగా ఆహార విధానంలో వస్తున్న మార్పులు ఎముకల పటుత్వాన్ని దెబ్బ తీస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అందువల్లనే ఈ సమస్య ఇప్పుడు అన్ని వయస్సుల వారిలోనూ కనిపిస్తోందని అంటున్నారు. యువతలో ఈ సమస్య ఉంటే జువైనల్‌ ఆస్టియోపొరోసిస్‌ అని వైద్య పరిభాషలో పిలుస్తారు.

ఆహారంలో పోషకాల లోపం ఉండటం, రోడ్డు పక్కన ఆహారం, జంక్‌ ఫుడ్‌ ఎక్కువగా తీసుకోవడం, హార్మోన్లు అవసరమైన స్థాయిలో ఉత్పత్తి కాకపోవడం, స్టెరాయిడ్ల వంటి మందులు అధికంగా వినియోగించడం, రుమటాయిడ్‌ ఆర్ర్థరైటిస్, లూపస్‌ వంటి వ్యాధుల బారిన పడిన యువతీయువకులు ఎముకల పటుత్వం కోల్పోతున్నారని వైద్యులు నిర్ధారించారు. కాల్షియం లోపంతో పుట్టడం వలన కూడా ఎముకలు గుల్లబారుతుండటం ఇటీవల ఎక్కువైందని ఇటీవల కాకినాడ జీజీహెచ్‌ ఆర్థోపెడిక్‌ విభాగ వైద్యుల పరిశీలనలో తేలింది. 

మహిళల్లో సైతం.. 
యువత తరువాత ఈ సమస్య మహిళల్లో తీవ్రంగా కనిపిస్తోందని వైద్యులు నిర్ధారించారు. ప్రతి ఐదుగురు మహిళల్లో కనీసం ఇద్దరు ఆస్టియోపొరోసిస్‌తో బాధ పడుతున్నారని చెబుతున్నారు. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన మహిళల్లో రుతుచక్రం ఆగిపోయే (మెనోపాజ్‌) దశలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌ ఉత్పత్తి తగ్గిపోతూంటుంది. దీనివలన ఎముకల సాంద్రత తగ్గిపోతుంది. అదే పురుషుల్లో అయితే 60 సంవత్సరాలు దాటిన వారిలో ఈ పరిస్థితి కనిపిస్తోంది. మహిళల్లోనే ఎక్కువగా ఎముకలు గుల్లబారడానికి హార్మోన్ల లోపం, శారీరక నిర్మాణం, జీవనశైలి ప్రధాన కారణాలని వైద్యులు చెబుతున్నారు.

పురుషులతో పోలిస్తే మహిళల్లో ఎముకలు సన్నగా, సున్నితంగా ఉండటం కూడా మరో కారణమని అంటున్నారు. గర్భిణుల్లో ఉండే కొద్దిపాటి కాల్షియాన్ని గర్భంలో ఉండే బిడ్డకు కూడా అందుతుంటుంది. దీనివల్ల కూడా వారిలో ఎముకల పటుత్వం తగ్గుతుంది. అలాగే, పిల్లలకు పాలిచ్చే సమయంలో పోషకాహారం లేకపోవడంతో శరీరంలో కాల్షియం నిల్వలు తగ్గిపోయి, ఎముకలు గుల్లబారుతుంటాయి. పాలిసిస్టిక్‌ ఓవరీ డిజార్డర్‌ (పీసీఓడీ), థైరాయిడ్, గర్భాశయ తొలగింపు (హిస్టరెక్టమీ) వంటి వాటి వలన హార్మోన్లలో విపరీతమైన అసమతుల్యత ఏర్పడి, మహిళల్లో ఎముకలు గుల్లబారుతున్నాయని వైద్యులు చెబుతున్నారు.

అప్రమత్తతే ఆయుధం
చిన్నచిన్న గాయాలైనప్పుడు తక్కువ ఒత్తిడితో కూడా ఎముకలు విరిగిపోతుంటాయి. నడుము, వెన్నెముక, కాళ్లలో దీర్ఘకాలిక నొప్పులు, వెన్నెముక దెబ్బతినడం, ఎముకలు కుచించికుపోయి ఎత్తు, పొడవు తగ్గడం, నడుము, మోకాళ్లు, భుజాల జాయింట్లలో నొప్పి, నిస్సత్తువ వంటి లక్షణాలున్న వారు వైద్యుల సూచనల మేరకు తప్పనిసరిగా తగిన పరీక్షలు చేయించుకోవాలి. ముఖ్యంగా బోన్‌ మినరల్‌ డెన్సిటీ (బీఎండీ), ఎముకల క్షీణతను గుర్తించే ఎక్స్‌రే, ఎంఆర్‌ఐ స్కాన్, కాల్షియం, విటమిన్‌–డి స్థాయి అంచనా వేసేందుకు రక్త, మూత్ర పరీక్షల వంటివి తప్పనిసరి అని వైద్యులు చెబుతున్నారు.

50 ఏళ్ల వయస్సు దాటిన మహిళలు, 65 ఏళ్లు పైబడిన పురుషులు ఆరు నెలలకోసారి వై­ద్యులను సంప్రదించి, ఈ పరీక్షలు చేయించుకోవాలి. కుటుంబంలో ఎవరికైనా ఆస్టియోపొరాసిస్‌ ఉన్నా, నీడ పట్టున, ఏసీలలో ఎక్కువ సమయం గడిపే ఉద్యోగులు, ఇతర వర్గాలు, ధూమపానం, మద్యపానం అలవాటు ఉన్న వారు, హార్మోన్ల అసమతుల్యత, పోషకాహార లోపంతో వివిధ అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్న వారు కచ్చితంగా తగిన పరీక్షలు చేయించుకుకోవాలి.

నిర్లక్ష్యం చేయకండి 
ఎముకల బలహీనత ఉందనే అనుమానం ఎవ­రికైనా ఉంటే తక్ష­ణం కాకినాడ జీజీ­హెచ్‌కు రావాలి. బీఎండీ పరీక్షలు జీజీహెచ్‌లో ఉచితంగా చేస్తున్నాం. మందులు ఉచితంగా అందిస్తున్నాం. బీఎండీ పరీక్షల కోసం ప్రత్యేక క్యాంపులు కూడా నిర్వహిస్తున్నాం. ఆస్టియోపొరాసిస్‌ చిన్న సమస్య అని నిర్లక్ష్యం చేయకండి. దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తుల జీవిత కాలాన్ని కూడా ఇది ప్రభావితం చేస్తుంది. కాల్షియం, విటమిన్‌–డి ఉన్న పోషకాహారం తీసుకోవాలి. అధిక ప్రొటీన్‌ ఉండే ఆహారంతో పాటు సూర్యరశ్మిలో గడపడం, తగినంత నిద్ర మేలు చేస్తాయి. వయస్సును బట్టి కనీసం ఏడు గంటల నిద్ర ఉండాలి. వయస్సుతో సంబంధం లేకుండా వ్యాయామాలు కచ్చితంగా చేయాలి. 
– డాక్టర్‌ ఎం,పాండురంగ విఠల్, ఆర్థోపెడిక్‌ విభాగాధిపతి, జీజీహెచ్, కాకినాడ

ప్రతి నెలా 3 వేల మంది పైనే.. 
ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో కాకినాడ ప్రభుత్వ సామాన్య ఆస్పత్రి (జీజీహెచ్‌) ఎంతో ప్రధానమైనది. ఇక్కడకు కోనసీమ, రాజమహేంద్రవరం ప్రాంతాల నుంచే కాకుండా పొరుగున ఉన్న ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి సైతం అనేక మంది చికిత్స కోసం వçస్తుంటారు. కేవలం ఈ ఒక్క ఆసుపత్రికే ప్రతి నెలా 3 వేల మందికి పైగానే రోగులు ఎముకల సంబంధిత సమస్యలతో వస్తున్నారు. ఇతర ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కూడా కలిపితే ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. దీనినిబట్టి సమస్య ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement