ఉద్యోగాలకు గుడ్‌బై.. వ్యాపారాల్లో రాణిస్తున్న యువత

The Rise of Youth Entrepreneurship after COVID-19 - Sakshi

తక్కువ పెట్టుబడితో పది మందికి ఉపాధి 

స్వేచ్ఛకు ప్రాధాన్యత ఇస్తున్న వైనం  

కొత్త స్టార్టప్‌లతో సరికొత్త అడుగులు 

రుణాలు, సబ్సిడీలతో ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం 

ప్రపంచం కొత్త పుంతలు తొక్కుతోంది. ఎప్పటికప్పుడు ట్రెండ్‌ మారుతోంది. అందుకు తగ్గట్లే ఆలోచనా ధోరణి, జీవన విధానాల్లోనూ మార్పు చోటు చేసుకుంటోంది. ఈ క్రమంలో విద్యార్థులు, ఉద్యోగుల తమ ఆలోచనలకు పదును పెడుతున్నారు. గతంలో బాగా చదవాలి, మంచి ఉద్యోగం సాధించాలి, చదువు పూర్తయ్యేదాకా మరో ఆలోచన చేయొద్దు.. అనే ధోరణి ఉండేది. తల్లిదండ్రులు కూడా ఆ దిశగానే ప్రోత్సహించారు. ఉద్యోగం వస్తే జీవితంలో స్థిరపడ్డట్లే అనే భావన కనిపించేది. విద్యార్థులు, తల్లిదండ్రుల ఆలోచన కూడా పాఠశాల నుంచి కాలేజీ పూర్తయ్యే వరకు ఉద్యోగం సాధించాలనే ఏకైక లక్ష్యం మినహా మనసులో మరో ఆలోచన వచ్చేది కాదు. కానీ ఇప్పుడు స్వతంత్రంగా ఆలోచిస్తున్నారు. తల్లిదండ్రులు కూడా పిల్లల ఆలోచనలను గౌరవిస్తున్నారు. దీంతో ఉద్యోగంతో కాదు.. వ్యాపారంతో కూడా స్థిరపడొచ్చనే భావన పెరిగింది. 
– సాక్షి ప్రతినిధి కర్నూలు

కోవిడ్‌ నేర్పిన పాఠమే ‘వ్యాపారం’
కోవిడ్‌ నేపథ్యంలో సాఫ్ట్‌వేర్‌తో పాటు చాలా రంగాల్లో చాలామంది ఉద్యోగాలు కోల్పోయారు. కొన్ని కంపెనీల్లోని ఉద్యోగులకు ‘లాక్‌డౌన్‌’ రోజుల్లో 50శాతం వేతనాలు ఇస్తే, కొన్ని పూర్తిగా ఇవ్వలేదు. ఈ క్రమంలో కొందరి ఉద్యోగులు బాగా ఇబ్బంది పడ్డారు. కూరగాయలు విక్రయించి బతికిన వ్యక్తులు కూడా ఉన్నారు. దీంతో ఉద్యోగం కంటే వ్యాపారమే ఉత్తమమనే దారి ఎంచుకున్నారు. ఉద్యోగంలో ఎవరి అభివృద్ధి కోసమో శ్రమించాలి. వ్యాపారమైతే కష్టపడే ప్రతీక్షణం, వచ్చే ప్రతి రూపాయి తమదే అనే భావనలో ఉన్నారు. దీంతోనే బిజినెస్‌పై ఆసక్తి చూపుతున్నారు. 

ఆలోచనా దృక్పథంలో మార్పులు
గతంలో విద్యార్థి దశలో పెద్దగా ఆలోచనలు ఉండేవి కావు. బయటి ప్రపంచంతో సంబంధాలు ఉండేవి కావు. ఇప్పుడు చదువులో కూడా మార్పులు వచ్చాయి. సీఏ, ఎంబీఏ లాంటి చదువులతో పాటు డిగ్రీ విద్యార్థులకు కూడా ‘స్కిల్‌ డెవలప్‌మెంట్‌’పై శిక్షణ ఇస్తున్నారు. ఫైనల్‌ ఇయర్‌లో ప్రాజెక్ట్‌ వర్క్‌ చేయాలి. ‘ఎంటర్‌ఫైనర్‌ డెవలప్‌మెంట్‌’ ప్రోగ్రాం ఏర్పాటు చేసి ఫీల్డ్‌విజిట్‌. ఇంటర్న్‌షిప్‌ పేరుతో పరిశ్రమలకు తీసుకెళ్తున్నారు. అక్కడ శిక్షణ ఇస్తున్నారు. దీంతో పెట్టుబడి, సబ్సిడీ, ఆదాయం తదితర అంశాలపై విద్యార్థులకు అవగాహన వస్తోంది. ఉద్యోగం కంటే వ్యాపారమే బాగుందనే ధోరణికి వస్తున్నారు. పైగా జీవితంలో తక్కువ సమయం ఉంది, దీన్ని వృథా చేయొద్దు. ఏదోఒకటి సాధించాలి, అందరితో పోలిస్తే ప్రత్యేకంగా ఉండాలి అనే ఆలోచన చేస్తున్నారు. ఉద్యోగం చేస్తే ఒకరి కింద పనిచేయాలి, వ్యాపారం చేస్తే కనీసం 5–9మందికి ఉద్యోగాలు కల్పించొచ్చు అనే ధోరణికి వచ్చారు. 

ఇతని పేరు డాక్టర్‌ యాసీర్‌ హుస్సేన్‌. రాయచూర్‌లో ఫార్మా–డీ డాక్టరేట్‌ పొందారు. వ్యాపారంపై ఆసక్తితో ప్రకాశ్‌నగర్‌లో రూ.5లక్షలతో నన్నారి తయారీ ప్లాంటు ఏర్పాటు చేశారు. ఏడాదిన్నర కిందట లక్ష్మీపురంలో ‘ఉస్తాద్‌’ జీరా జ్యూస్‌ ప్లాంట్‌ స్థాపించారు. ‘హంగర్‌బక్స్‌’ అనే ఐటీ కంపెనీతో కలిసి తేనె తయారీ ప్రారంభించారు. ఆపై ‘కూల్‌ మ్యాజిక్‌’ బ్రాండ్‌తో నన్నారి, ‘అనంత సుగం«దీ’ పేరుతో రెడీ టూ డ్రింక్‌ నన్నారిసోడా, జాయ్‌ సోడా తయారు చేస్తున్నారు. మరో వారంలో ‘కూల్‌మ్యాజిక్‌’ పేరుతో గోలీసోడాను కూడా మార్కెట్‌లోకి విడుదల చేస్తున్నారు. ఇతని వయస్సు 32 ఏళ్లు. పీఎంజీవై కింద రుణాలు తీసుకుని సబ్సిడీ పొందారు. ఏడాదిన్నరలోనే రెండు రాష్ట్రాలలో విక్రయాలు సాగిస్తున్నారు. 

ఇతని పేరు శేఖర్‌బాబు. ఎలక్ట్రికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేసి ఖతర్‌లో ఎలక్ట్రిక్‌ డిజైన్‌ ఇంజనీర్‌గా పనిచేశారు. సొంతూరును వదిలి దూరంగా ఉద్యోగం చేయడం నచ్చలేదు. స్వదేశానికి తిరిగొచ్చి వ్యర్థాలను తిరిగి వినియోగంలోకి తీసుకురావాలనే ఆలోచనకు వచ్చాడు. కల్లూరు ఎస్టేట్‌లో జీఎస్‌ ప్లాస్టిక్‌ రీసైక్లింగ్‌ యూనిట్‌ను స్థాపించారు. ప్లాస్టిక్‌ కాలుష్యాన్ని నివారించే దిశగా వృథా ప్లాస్టిక్‌ను రీసైక్లింగ్‌ చేశాడు. పలురకాలు ప్లాస్టిక్‌ వస్తువులు తయారు చేసి మార్కెటింగ్‌ చేశారు. ఆ తర్వాత హోటల్‌ బిజినెస్‌లోకి రావాలనే ఆశతో ఓ పాత బస్సును రూ.3లక్షలకు కొనుగోలు చేశాడు. లోపల ఇంటీరియర్‌ను మార్చేసి ‘డైన్‌ ఆన్‌ బస్‌’గా తీర్చిదిద్దాడు. వెంకటరమణ కాలనీలో దీనికి మంచి పేరుంది. ఇలా ఇతను 25మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. 

ఇతని పేరు ఉపేంద్రం కృష్ణంరాజు. ఎంబీఏ పూర్తి చేసి బ్యాంక్‌ ఆఫ్‌ బరోడాలో బ్రాంచ్‌ మేనేజర్‌గా పనిచేశారు. ఉద్యోగం సంతృప్తి ఇవ్వకపోవడంతో బిజినెస్‌ చేయాలనే ఆలోచనకు వచ్చాడు. భవిష్యత్‌లో హోం థియేటర్లకు డిమాండ్‌ ఉంటుందని గ్రహించి 2018లో తన ఆలోచనకు పదును పెట్టారు. ‘శ్రీదత్త హోమ్‌ థియేటర్‌’ పేరుతో బిజినెస్‌ ప్రారంభించినా మొదట్లో పెద్దగా లాభం లేకపోయింది. లాక్‌డౌన్‌లో ఓటీటీలు రావడం, ఇంట్లోనే సినిమాలు చూసే అలవాటు పెరగడం, కొత్తగా ఇళ్లు నిర్మించుకునే వారు దాదాపు ‘హోం థియేటర్‌’పై ఆసక్తి చూపడటంతో బిజినెస్‌ ఊపందుకుంది. రూ.7లక్షల నుంచి రూ.35లక్షల వరకూ హోం థియేటర్‌కు ఖర్చు అవుతుంది. ఇలా తను ఎంచుకున్న లక్ష్యానికి చేరుకోవడంతో సంతోషంగా జీవిస్తున్నారు.

గ్లోబల్‌ మార్కెట్‌తో అవకాశాలు మెండు
మార్కెట్‌ పరిధి కూడా విస్త్తరించింది. గతంలో బాంబే, చెన్నై, కోల్‌కతాకు మాత్రమే ఎగుమతులు ఉండేవి. ఎక్స్‌పోర్టుపై అవగాహన ఉండేవి కాదు. ఇప్పుడు రాష్ట్రంలోనే ఎగుమతి అవకాశాలను పెంచారు. పరిశ్రమలశాఖ జనరల్‌ మేనేజర్‌ ఆధ్వర్యంలో ఎగుమతులు చేస్తున్నారు. ఉదాహరణకు మన జిల్లాలో తడకనపల్లి పాలకోవ ఉంది. దీని క్వాలిటీ బాగుంటుంది. అయితే కర్నూలుకే పరిమితమైంది. దీనిపై గ్రామస్తులకు అవగాహన కలి్పంచి ఇతర జిల్లాలు, రాష్ట్రాలకు ఎగమతి చేస్తున్నారు. గతంలో వ్యాపారులు మనవద్దకు వచ్చి కొనుగోలు చేసేవారు. ఇప్పుడు ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ పెరగడంతో ఇంట్లో నుంచి ఏ ప్రాంతానికైనా ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నారు. దీంతో వ్యాపారం చేస్తే మార్కెటింగ్‌కు ఎలాంటి ఇబ్బంది లేదు. 

ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం 
యువత ఆలోచనా ధోరణి మారడం శుభ పరిణామం. ఉద్యోగం కోసం వెతకడం కంటే పది మందికి ఉపాధి కలి్పంచే స్థాయికి చేరుకోవాలనుకుంటున్నారు. తల్లిదండ్రులు కూడా ఆ దిశగానే పిల్లలను ప్రోత్సహిస్తున్నారు. ప్రభుత్వం కూడా ప్రోత్సహిస్తోంది. సబ్సిడీలు అందిస్తోంది. మార్కెటింగ్‌ కూడా సులభతరమైంది. వ్యాపార రంగంలో విజయాలు అధికంగానే ఉంటున్నాయి. ఎంఎస్‌ఎంఈలకు దరఖాస్తు చేసుకుంటే ఏపీఐఐసీ ద్వారా భూములు ఇస్తాం. పరిశ్రమలశాఖ కూడా సబ్సిడీలు ఇస్తోంది. – విశ్వేశ్వరరావు, జెడ్‌ఎం, ఏపీఐఐసీ 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top