
కోస్తాలో వచ్చే రెండు రోజులు వర్షాలు
సాక్షి, అమరావతి: ఉపరితల ఆవర్తనం ప్రభావంతో బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ శాఖ తెలిపింది. తొలుత బుధవారమే ఏర్పడినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించగా, తాజా బులెటిన్‌లో గురువారం ఏర్పడినట్లు తెలిపింది. ఇది పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర తీరాలను ఆనుకుని శుక్రవారానికి బంగాళాఖాతంలో వాయుగుండంగా బలపడుతుందని తెలిపింది.
శనివారం దక్షిణ ఒడిశా–ఉత్తరాంధ్ర మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. దీని ప్రభావంతో శుక్రవారం రాష్ట్రంలో కొన్నిచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయంది. శనివారం ఉత్తరాంధ్ర, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు జిల్లాల్లో అక్కడక్కడా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందని తెలిపింది. తీరం వెంబడి గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని వెల్లడించింది.