అదుపులోకి విద్యుత్‌ కొరత

Power shortage under control says Energy Secretary Sridhar - Sakshi

పరిశ్రమలకు పవర్‌ హాలిడేతో 10 మి.యూ. విద్యుత్‌ ఆదా

ఇదంతా గృహావసరాలకు కేటాయింపు.. ఈ నెలాఖరుకల్లా అంతా సర్దుకుంటుంది

బొగ్గు కొరతతో దేశవ్యాప్తంగా విద్యుత్‌ సమస్య

రూ.6 వేలు ఉండే టన్ను ధర రూ.40 వేల వరకూ వెళ్లింది

దక్షిణాదిలో కొరత ఎక్కువగా ఉంది

బొగ్గు సరఫరా గురించి సీఎం జగన్‌ ప్రధానితో మాట్లాడారు

రాష్ట్రానికి అవసరమైన బొగ్గు రోజూ వస్తోంది

ఇంధన శాఖ కార్యదర్శి శ్రీధర్‌ 

సాక్షి, అమరావతి: రాష్ట్రంలో విద్యుత్‌ కొరత క్రమంగా అదుపులోకి వస్తోందని, ఈ నెలాఖరుకల్లా అంతా సర్దుకుంటుందని ఇంధన శాఖ కార్యదర్శి బి. శ్రీధర్‌ అన్నారు. గృహావసరాలకు నిరంతరం విద్యుత్‌ సరఫరా చేయడం తమ ప్రాధాన్యత అని ఆయన స్పష్టంచేశారు. ఆస్పత్రులకు కరెంట్‌ కష్టాలు లేకుండా చూడాలని డిస్కమ్‌లకు ఆదేశాలిచ్చామని, పరిస్థితులను అర్ధంచేసుకుని వినియోగదారులు సహకరించాలని కోరారు. బొగ్గు కొరతతో దేశవ్యాప్తంగా విద్యుత్‌ సమస్య ఏర్పడిందని.. అలాగే, బొగ్గు ధర కూడా విపరీతంగా పెరిగిందన్నారు. ఇక ఈ నెలాఖరుకల్లా కరెంట్‌ కోతల నుంచి ఉపశమనం కలుగుతుందని శ్రీధర్‌ ఆశాభావం వ్యక్తంచేశారు. విజయవాడ ఆర్‌ అండ్‌ బీ భవనంలో శనివారం ఆయన మీడియాకు రాష్ట్రంలో విద్యుత్‌ పరిస్థితిని వివరించారు. ఆయన ఇంకా ఏమన్నారంటే..

విద్యుత్‌ కొరతకు ఇవే కారణాలు..
దేశవ్యాప్తంగా గతేడాది అక్టోబర్‌ నుంచి ఏర్పడ్డ బొగ్గు కొరత.. పోస్ట్‌ కోవిడ్‌ తర్వాత రాష్ట్రంలో భారీగా పెరిగిన విద్యుత్‌ వినియోగం.. దేశీయంగా బహిరంగ మార్కెట్‌లో విద్యుత్‌ కొనుగోళ్లకు పెరిగిన డిమాండ్‌ వంటి మూడు ప్రధాన కారణాలవల్ల విద్యుత్‌ కొరత ఏర్పడింది. దేశీయంగా ఉత్పత్తి అయ్యే బొగ్గు వినియోగం కూడా పెరిగి లభ్యత తగ్గింది. గతంలో రూ.6 వేలకు దొరికిన బొగ్గు ధర ఇప్పుడు రూ.17 వేల నుంచి రూ.40 వేల వరకూ వెళ్లింది. బొగ్గు సరఫరా గురించి సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రధానితో మాట్లాడటం, రైల్వే, కోల్, ఎనర్జీ మంత్రిత్వ శాఖలకు లేఖలు రాయడం, ఎంపీలు కూడా వారిని వెళ్లి కలవడంతో బొగ్గు నిల్వలు లేనప్పటికీ మన రాష్ట్రానికి రోజుకి కావాల్సినంత బొగ్గు వస్తోంది. 

అన్ని రంగాల్లో పెరిగిన వినియోగం
2020 మార్చి–ఏప్రిల్‌లో కోవిడ్‌ లాక్‌డౌన్‌ కారణంగా కేవలం 160 మిలియన్‌ యూనిట్ల గృహ వినియోగం మాత్రమే ఉండేది. 2021 మార్చి–ఏప్రిల్‌లో 200 నుంచి 210 మిలియన్‌ యూనిట్లుగా నమోదైంది. 2022 మార్చి–ఏప్రిల్‌లో కోవిడ్‌ పరిస్థితి నుంచి బయటపడటం.. అన్ని రంగాల్లోనూ కార్యకలాపాలు పెరగడం.. ఈ ఏడాది మార్చి నుంచే మొదలైన ఎండలవల్ల గృహావసరాల వినియోగం కూడా ఎక్కువగా ఉండడంతో రోజుకి సగటున 235 మిలియన్‌ యూనిట్ల విద్యుత్‌ అవసరం అవుతోంది. 

20–25 ఎంయూల విద్యుత్‌ లోటు
గతంలో ఉమ్మడి రాష్ట్రంలో జరిగినంత వినియోగం ఇప్పుడు ఒక్క మన రాష్ట్రంలో జరుగుతోంది. 2014–15లో రాష్ట్రంలో సగటు విద్యుత్‌ వినియోగం 130 మిలియన్‌ యూనిట్లు ఉండేది. ఇప్పుడది 190 మిలియన్‌ యూనిట్లకు చేరింది. ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌కు కలిపి మొత్తం 500 మిలియన్‌ యూనిట్లు అవసరం. అలాగే, రాష్ట్రంలో సగటున రోజుకి 235 మిలియన్‌ యూనిట్ల అవసరం ఉండగా,  పూర్తి సామర్థ్యంతో పనిచేస్తున్న ఏపీ జెన్‌కో ద్వారా 80 నుంచి 85 ఎంయూ, ఎన్టీపీసీ ద్వారా 45 ఎంయూ, ఐపీపీఎస్‌ 10 ఎంయూ, సోలార్‌ 25 ఎంయూ, విండ్‌ 10 ఎంయూ, ద్వారా అన్నీ కలిపి మొత్తం 175 ఎంయూ వరకూ విద్యుత్‌ అందుబాటులో ఉంటోంది. ఇంకా 55 మిలియన్‌ యూనిట్లు లోటు ఉంటోంది. 30 మిలియన్‌ యూనిట్ల వరకు కొనుగోలు చేస్తున్నాం. మార్చిలో 1,551 మిలియన్‌ యూనిట్లను యూనిట్‌కి రూ.8.11 చొప్పున రూ.1,058 కోట్లతో విద్యుత్‌ కొనుగోలు చేశాం. ఇంకా 20–25 ఎంయూ వరకూ లోటు ఉంది. 

దక్షిణాదిలో కొరత ఎక్కువ
పవర్‌ ఎక్సే్ఛంజ్‌లో విద్యుత్‌ దొరకని కారణంగా ఇటీవల వ్యవసాయానికి, గృహాలకు కోత విధించాల్సి వచ్చింది. వ్యవసాయానికి పగటిపూట ఏడు గంటల నిరంతర విద్యుత్‌ ఇవ్వాలని ఆదేశాలిచ్చాం. గృహ వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నందున పరిశ్రమలకు లోడ్‌ రిలీఫ్‌ ఇవ్వాలని నిర్ణయించాం. లేదంటే గ్రిడ్‌కు ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంది. విద్యుత్‌ కొరత తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, గుజరాత్‌ వంటి రాష్ట్రాల్లోనూ ఉంది. దక్షిణాది రాష్ట్రాలకు ఇంకా ఎక్కువగా ఉంది. గుజరాత్‌లో  పవర్‌ హాలిడే ఇచ్చారు. ఇక నిరంతరం నడిచే పరిశ్రమలు 50 శాతం మాత్రమే విద్యుత్‌ వాడాలనే నిబంధనతోపాటు పరిశ్రమలకు పవర్‌ హాలిడే వల్ల 10 మిలియన్‌ యూనిట్ల వరకూ ఆదా అవుతోంది. ఈ మొత్తాన్ని గృహావసరాలకే కేటాయిస్తున్నాం. దీంతో శనివారం కేవలం 4 మిలియన్‌ యూనిట్లే కోరత ఏర్పడింది. సాగుకు వాడే విద్యుత్‌ వినియోగం ఈనెల 15 తరువాత తగ్గే అవకాశం ఉంది. అది వస్తే పరిశ్రమలకు యథావిథిగా విద్యుత్‌ సరఫరా ఉంటుంది.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top