కరోనా పరీక్షలను పెంచాలి : సీఎం వైఎస్ ‌జగన్‌ | Number Of Corona Tests Should Be Increased: YS Jagan | Sakshi
Sakshi News home page

కరోనా పరీక్షలను పెంచాలి : సీఎం వైఎస్ ‌జగన్

Mar 17 2021 4:33 PM | Updated on Mar 17 2021 5:11 PM

Number Of Corona Tests Should Be Increased: YS Jagan - Sakshi

అమరావతి : కరోనాపై వివిధ రాష్ట్రాల గవర్నర్లు, లెఫ్టినెంట్‌ గవర్నర్లు, ముఖ్యమంత్రులతో ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమావేశం అనంతరం ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి  అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘వ్యాక్సినేషన్‌ ప్రక్రియకు ఎన్నికల ప్రక్రియ అడ్డుగా మారింది. అధికార యంత్రాంగం ఎన్నికల నిర్వహణలో మునిగిపోయింది. జడ్పీటీసీ, ఎంపీటీసీల ఎన్నికల ప్రక్రియలో ఇక ఆరు రోజులు మాత్రమే మిగిలి ఉంది. మున్సిపల్‌ ఎన్నికలు పూర్తయిన వెంటనే ఇవి కూడా జరిగిపోయి ఉంటే బాగుండేది. కానీ అలా జరగలేదు, జాప్యం జరుగుతూ వస్తోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా పెరుగుతున్న కేసులను, ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఎన్నికల ప్రక్రియను ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ముగించాల్సిన అవసరం ఉంది. 

ఈ ప్రక్రియ పూర్తైతే వ్యాక్సినేషన్‌ ప్రక్రియను ఉద్ధృతంగా ముందుకు తీసుకెళ్లవచ్చు. లేకపోతే వైరస్‌ వ్యాపిస్తున్న ప్రాంతాల్లో కంటైన్‌మెంట్‌ చేయడం, ఆయా ప్రాంతాల్లో పరీక్షలు నిర్వహించడం..ఇవన్నీకూడా కష్టం అవుతాయి. మిగిలిపోయిన ఎన్నికల ప్రక్రియను వీలైనంత త్వరగా పూర్తిచేయడానికి అధికారులు ప్రయత్నించాలి. ప్రభుత్వం తరఫున అధికారికంగా గవర్నర్‌కు, హైకోర్టుకు నివేదించాలి'’ అని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ.. వ్యాక్సినేషన్‌ ప్రక్రియపై దృృష్టి పెట్టాలని, 45 ఏళ్లకు పైబడి, దీర్ఘకాలిక వ్యాధితో బాధపడుతున్నవారికి వ్యాక్సిన్లు సత్వరమే అందించాలని సీఎం జగన్‌ అధికారులకు ఆదేశించారు. వైరస్‌ సోకినవారికి చికిత్స అందించడం కన్నా... ఆ వైరస్ ‌రాకుండా నివారణా పద్ధతులపై దృష్టిపెట్టాలని తెలిపారు. కరోనా పరీక్షల సంఖ్యను పెంచాలని, పూర్తిస్థాయిలో నూటికి నూరుశాతం ఆర్టీపీసీఆర్‌ పరీక్షలు జరిగేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం, వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ళ నాని, హోంమంత్రి మేకతోటి సుచరిత, డీజీపీ గౌతమ్‌ సవాంగ్, వైద్య, ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి అనిల్‌కుమార్‌ సింఘాల్ సహా పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

చదవండి :  (అవసరమైతే చంద్రబాబును అరెస్ట్‌ చేస్తారు)
(టీడీపీ మాజీ మంత్రి నారాయణకు నోటీసులు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement