నువ్వు నా దగ్గరకు రా... నేను చూసుకుంటాను.. | Nizampatnam ZPTC Member Narra Venkata Subbaiah Harassment On Outsourced Employee | Sakshi
Sakshi News home page

నువ్వు నా దగ్గరకు రా... నేను చూసుకుంటాను..

May 9 2026 6:19 AM | Updated on May 9 2026 6:19 AM

Nizampatnam ZPTC Member Narra Venkata Subbaiah Harassment On Outsourced Employee

అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని వేధిస్తున్న నిజాంపట్నం జెడ్పీటీసీ నర్రా వెంకటసుబ్బయ్య 

సాక్షి ప్రతినిధి, గుంటూరు: ‘‘నిజాంపట్నం టీడీపీ జెడ్పీటీసీ నర్రా వెంకటసుబ్బయ్య తరచూ ఫోన్లు చేసి నా దగ్గరకు రా.. నేను ఉన్నాను.. చూసుకుంటాను.. అసలు నువ్వు నా మాట ఏదీ వినడం లేదు ఎందుకు? నీ కళ్లకు నేను కనపడడం లేదా? నువ్వు వస్తావా రావా ? అంటూ వేధిస్తున్నాడు. అతని ఫోన్‌ తీయడం లేదని వేరే వాళ్ల ఫోన్లతో కాల్స్‌ చేస్తున్నాడు. అతని వద్ద ఉండే గంగరాజు ఫోను నుంచి చేస్తున్నాడు. లేకపోతే గంగరాజుతో ఫోన్‌ చేయించి అమ్మాయి వస్తుందో లేదో కనుక్కో? అమ్మాయికి ఎంతకావాలో నా దగ్గరకు రావాలంటే అంటూ మాట్లాడుతున్నాడు.. ఈ వేధింపులు తట్టుకోలేకే పురుగుమందు తాగాను’’ అంటూ నిజాంపట్నంకు చెందిన ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగిని మీడియా ముందు కన్నీటి పర్యంతమైంది. 

నిజాంపట్నంలోని ఓ మండల అధికారి కారణంగా తన భర్త దూరమయ్యాడని, ఆ అధికారి తనను నమ్మించి చర్చిలో పెళ్లి చేసుకుని.. ఇప్పుడు జెడ్పీటీసీ నర్రా వెంకటసుబ్బయ్యతో కలిసి తనను వదిలించుకునే ప్రయత్నం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో గురువారం అర్ధరాత్రి పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.

చెరుకుపల్లి ప్రైవేటు వైద్యశాలలో వైద్యం చేసి అనంతరం మెరుగైన చికిత్స కోసం తెనాలి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ సొంత నియోజకవర్గంలో  ఆయన అనుచరులే వేధింపులకు పాల్పడడాన్ని బాధితురాలి బంధువులు తప్పు పడుతున్నారు. నర్రా వెంకటసుబ్బయ్యపై క్రిమినల్‌ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.  
 

Advertisement
 
Advertisement
Advertisement