కర్నూలు(హాస్పిటల్): వ్యాపారంలో వచ్చిన విభేదాల కారణంగా ప్రత్యర్థులు అతని గొంతులో కత్తి(సర్జికల్ బ్లేడ్)తో బలంగా పొడిచారు. పెనుగులాటలో సర్జికల్ బ్లేడ్ కాస్తా విరిగి అతని గొంతులో సగం ఇరుక్కుపోయింది. రక్తం కారుతున్న అతన్ని కుటుంబసభ్యులు మోసుకుని పెద్దాసుపత్రికి వెళితే వైద్యులు నిర్లక్ష్యంగా సమాధానం చెప్పారు. బ్లేడ్ తీసేందుకు మూడు రోజులు పడుతుందన్నారు. ప్రాణభీతితో అతన్ని కుటుంబసభ్యులు డబ్బులు ఖర్చు చేసి ప్రైవేటు ఆసుపత్రిలో వైద్యం చేయించి బతికించుకున్నారు. ఈ విషాద ఘటన మూడు రోజుల క్రితం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చోటుచేసుకుంది. కర్నూలు జిల్లా కోడుమూరు మండలం పులకుర్తి గ్రామానికి చెందిన ఉప్పరి అశోక్(29) వ్యాపారం రీత్యా కర్నూలు నగరంలో నివాసం ఉంటున్నాడు.
అతను వివాహ వేడుకలకు ఉపయోగించే రథాలను తయారు చేస్తూ కుటుంబాన్ని నెట్టుకొస్తున్నాడు. ఈ వ్యాపారంలో ప్రత్యర్థులతో అతనికి విభేదాలు రావడంతో ఈ నెల 5న మధ్యాహ్నం 3.30 గంటల సమయంలో ముగ్గురు వ్యక్తులు ఇంటి వద్ద అతనిపై దాడి చేశారు. వెంట తెచ్చుకున్న సర్జికల్ బ్లేడ్‌తో గొంతు కోసే ప్రయత్నం చేశారు. ఈ ప్రయత్నంలో అతని గొంతులోకి సర్జికల్ బ్లేడ్ దిగబడింది. పెనుగులాటలో ఆ బ్లేడ్ సగం విరిగిపోయి గొంతులోనే ఇరుక్కుపోయింది. వెంటనే కుటుంబసభ్యులు చికిత్స నిమిత్తం కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలకు తరలించారు. రాత్రి పది గంటలైనా సరైన వైద్యం అందించకపోగా ఆపరేషన్ చేయడానికి, ఇరుక్కుపోయిన బ్లేడ్ తీయడానికి మూడు రోజుల సమయం పడుతుందని కుటుంబ సభ్యులకు క్యాజువాలిటీలోని వైద్యులు తెలిపారు.
దీంతో ఎలాగైనా అశోక్ ప్రాణాలు దక్కించుకోవాలన్న ఉద్దేశంతో అదే రోజు రాత్రి 10 గంటలకు నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి వెంటనే ఆపరేషన్ చేసి బ్లేడ్ తీయడమే కాకుండా దెబ్బతిన్న శరీర భాగాలను సరిచేయడంతో అతని ప్రాణాలు దక్కాయి. ప్రాణాలు పోస్తారని పెద్దాసుపత్రికి వెళితే కనీసం పట్టించుకోలేదని, ప్రాణం పోయే పరిస్థితి ఉన్నా ఆపరేషన్ చేయడానికి మూడు రోజులు పడుతుందని చెప్పడం పట్ల కుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు.


