బతుకు నిత్య నృత్యం 

Kalika Devi Tradition Festival In Srikakulam District - Sakshi

విభిన్న సంప్రదాయానికి ప్రతీక కాళికా దేవి నృత్యాలు

ఉద్దానం పల్లెల్లో విశిష్ట సంస్కృతి  

ఆ చీకటి లాంటి రూపం.. నీ దేహంపై మోహం వద్దని చెబుతుంది. చేతిలోని కరవాలం.. నీ దుర్గుణాలను తెగనరుకు అంటూ సూచిస్తుంది. మెడలోని పుర్రెల మాల.. ఎన్ని అవాంతరాలు దాటితే బతుకు అంత బాగుంటుందని వివరిస్తుంది. బయటకు వచ్చిన రక్తపు నాలిక.. నీ విజయాలు ప్రపంచానికి చూపడానికి భయపడవద్దని చెబుతుంది.

ఆ భయంకరమైన ఆహార్యం.. మనిషంటే మంచి చెడుల కలబోతని వివరిస్తుంది. కానీ వివరాలన్నీ పల్లెపల్లెకూ వెళ్లేదెలా..? సంస్కృత శ్లోకాలు వినిపించని చోట, సాంస్కృతిక నృత్యాలు జరగని చోట ఈ రహస్యాలు ఆ ప్రాంతానికి చెప్పేదెలా..? దానికి సమాధానమే ఈ నాట్యకారులు. కాళికా మాత వేషధారణలో కనిపించే నాట్యకారులు నిజానికి దైవ రహస్యాలు వివరించే దూతలు. ఇంకాస్త లోపలకు వెళితే..
– ఇచ్ఛాపురం రూరల్‌  

చైత్రం నుంచి జ్యేష్ట మాసం వరకు ఉద్దానం పల్లెలు చూసి తీరాల్సిందే. చిరు జల్లులు చిలకరించడానికి మేఘాలు మూటాముల్లె సర్దుకుని ఆకా శయానం చేసే రోజుల్లో ఉద్దానంలో చల్లదనం సంబరాలు జరుగుతాయి. ఆ తర్వాత గ్రామ దేవతల సంబరాలు కొనసాగుతాయి. ఆది, మంగళవారాల్లో ఊ రూరూ మార్మోగిపోతుంది. కానీ అందరి కళ్లు ఒక్కరి మీదే ఉంటాయి. వారే కాళికా వేషధారులు. అమ్మోరు రూపాలుగా పిలిచే కాళీమాత, రాజమ్మ, సంతోషి మాత, భద్రకాళీ, దానప్ప, గురప్ప, మంకినమ్మ అ మ్మవార్ల వేషధారణలో కళాకారులు ఊరూరా నాట్యాలు చేస్తూ కనిపిస్తారు.

శ్రమ, అంకితభావం 
కాళికా దేవి నాట్యమంటే ఆషామాషీ కాదు. తరాలు మారిన కొద్దీ ఆ వేషధారణలోని రహస్యాన్ని విడమరిచి చెప్పే వారు కనుమరుగైపోతున్నారు. కానీ కాలం మళ్లీ మారుతోంది. ఈ నాట్యాలకు పునరుజ్జీవం వస్తోంది. ఎంతో శ్రమ, అంకిత భావం ఉంటే తప్ప ఈ నాట్యం కుదరదు. నిష్టతో, మాంసాహారం తీసుకోకుండా వస్త్రాలంకరణ చేయాలి. కాలికి గజ్జెలు, చేతికి గాజులు, ఒళ్లంతా పసుపు పూసుకొని తలపై కిరీటం ధరించి, నెమలి పింఛాలను ధరించి, రెండు చేతుల్లో పొడవైన కత్తులను చాకచక్యంగా తిప్పుతూ సన్నాయి మేళానికి అనువుగా పాదం కదపాలి. ఒక్కో సమయంలో పూన కం వచ్చి వేష«ధారణలో కళాకారుడు స్పృహ కో ల్పోయిన సందర్భాలు కోకోల్లాలు. 

దరువుకు అనువుగా.. 
సాధారణంగా అమ్మవార్ల నృత్యాని కి పద్నాలుగు దరువులుగా డప్పు వాయిస్తారు. ఈ దరువులకు వేషధారణల్లో కళాకారులు వివిధ భంగిమల్లో తాండవం చేస్తూ ప్రేక్షకులను అలరిస్తుంటారు. రెండు కత్తులతో గరిడీ దరువు, జులవా దరువు, వసంతమ్మోరు దరువు, భద్రకాళీ దరువు, జాలారీ దరువు, రాజమ్మ దరువు, మంకినమ్మ దరువు, దానప్ప దరువు, మూడు వరసల సవర దరువులతో పాటు మరికొన్ని సన్నాయి మేళం ద్వారా దరువులు వాయిస్తుంటారు. ఈ దరువులకు తగ్గట్టుగా కళాకారుడు ఉగ్ర రూపంలో నృత్యం చేస్తుంటాడు. 

నిష్టతో వేషధారణ 
ఆహార నియమాలు పాటి స్తూ నిష్టతో అమ్మవారి వేషధారణ చేస్తుంటాం. కేవలం చిన్న రంధ్రం నుంచే చుట్టూ చూస్తుంటాం. చుట్టూ వందలాది మంది ఉంటూ మమ్మల్ని ఉత్సాహపరుస్తుంటారు. ఆ సమయంలో మాలో పూర్తిగా ఆధ్యా త్మికత్వం నిండిపోతుంది.  
– కె.కోటేశ్వరరావు, నృత్య కళాకారుడు

ఇదే ఉపాధి 
అమ్మవారి మేళం అంటే నాకు ఎంతో ఇష్టం. సరదా గా నేర్చుకున్న ఈ నృత్యం ఇప్పుడు నాకు ఉపాధి మార్గంగా మారింది. యువకుల్లో ఈ నాట్యంపై ఉన్న అపోహలు కూడా ఇప్పుడు పోయా యి. చాలా మంది నేర్చుకుంటున్నారు.
– సురేష్‌ పండిట్, కాళీమాత నృత్య కళాకారుడు

తరతరాలుగా..
మాది ఈదుపురం గ్రామం మా పూర్వీకుల నుంచి తరతరాలుగా ఈ ఆట కడుతున్నాం. ఉద్దానం ప్రాంతంలో చాలా మంది యువకులు ఇప్పుడు మంచి ఆటను ప్రదర్శిస్తున్నారు.
– నారాయణ సాహూ, కాళికా ఉపాసకుడు, నృత్య కళాకారుడు

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top