‘చౌక’దగా!

Irregularities In Ration Rice Distribution In Chittoor District - Sakshi

క్వింటాల్‌కు మూడు కిలోల తరుగు

స్టాక్‌ పాయింట్లలో తగ్గిపోతున్న వైనం

లబోదిబోమంటున్న డీలర్లు 

నష్టపోతున్న కార్డుదారులు 

చినుకు..చినుకు కలిసి వరదైనట్టు.. గింజ..గింజ కలిసి వేలాది క్వింటాళ్లవుతున్నాయి. స్టాక్‌ పాయింట్లు, కొన్ని చౌకదుకాణాల ద్వారా యథేచ్ఛగా నల్లబజారుకు తరలిపోతున్నాయి. డీలర్లకు వచ్చేసరికి తూకంలో తేడాలొస్తున్నాయి. దీనిపై ప్రశ్నించిన వారినే లక్ష్యంగా చేసుకుని కొందరు అధికారులు వేధిస్తున్నట్టు తెలుస్తోంది. చేసేది లేక వచ్చిన బియ్యంలో లబ్ధిదారులకు కోత విధిస్తుండడం విమర్శలకు తావిస్తోంది.  

గుడిపాల: నిరుపేదలకు రేషన్‌ బియ్యం పంపిణీ పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఈ పాస్‌ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. రేషన్‌ దుకాణాలకు సరఫరా చేసే బియ్యం తూకంలో తేడాలుంటున్నాయి. ఇదే సాకుతో రేషన్‌ డీలర్లు కార్డుదారులకు కోత విధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 లక్షల 62 వేల 691 తెల్ల కార్డులున్నాయి. వీటికి 2,901 రేషన్‌ దుకాణాల ద్వారా బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ దుకాణాలకు ఆగస్టులో 1,75,921 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారు. రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా చేసేముందు ఎలాంటి షార్టేజ్‌ రాకుండా తూకం వేయించి పంపించాలి. సంబంధిత అధికారులు ఎంఎల్‌ఎస్‌ పాయింట్లలో బియ్యపు బస్తాలను తూకం వేయడం లేదు. సరాసరి బస్తా 50 కిలోల వంతున రేషన్‌ దుకాణాలకు పంపుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఈ విధానంతో తూకాల్లో తేడాలుంటున్నాయి. వీటిని ఈ–పాస్‌ మిషన్ల ద్వారా ఎలా సరఫరా చేయాలని డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. రేషన్‌ దుకాణంలోని బస్తాలను తూకం వేస్తే ఏ ఒక్క బస్తా కూడా 50 కేజీలు ఉండడం లేదు. ఒక్కో సంచి సుమారు 600 గ్రాముల వరకు ఉంటుంది. ఆ మేరకు తూకానికి సంబంధించి కొరవడిన బియ్యాన్ని తాము ఎక్కడి నుంచి తెచ్చి కార్డుదారులకు ఇవ్వాలని రేషన్‌ డీలర్లు ప్రశ్నిస్తున్నారు.  

క్వింటాల్‌కు 3 కిలోల వరకు తరుగు 
రేషన్‌ దుకాణాలకు సరఫరా చేసే బియ్యపు బస్తాలో ఒక్కో దానికి కనీసం 1.5 కిలోల షార్టేజ్‌ వస్తోంది. ఇలాంటి సమయంలో వంద క్వింటాళ్లు ఇస్తున్న రేషన్‌ దుకాణంలో కనీసం 3 క్వింటాళ్ల వరకు తక్కువ వస్తున్నాయి. ఇంతమొత్తంలో బియ్యం తక్కువగా వస్తే తాము కార్డుదారులకు ఎలా సరఫరా చేయాలని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  

డీలర్ల దోపిడీ 
రేషన్‌డీలర్లు బియ్యం ఇచ్చే సమయంలో ఒక్కో కార్డుదారునికి కనీసం అరకేజీ నుంచి కేజీ వరకు తగ్గిస్తూ ఇస్తున్నారు. దీనికి కొంతవరకు కార్డుదారులు కూడా అలవాటు పడగా ఎవరైనా ప్రశ్నిస్తే ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి తమకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. కార్డుదారులకు నచ్చజెప్పి పంపడం పరిపాటుగా సాగుతోంది. 

సంచుల తూకాలు తగ్గించడం లేదు 
50 కిలోల బియ్యంతో పాటు వస్తున్న సంచి తూకంలో 600 గ్రాముల తగ్గించాలి. ఒక రేషన్‌షాపునకు 100 బస్తాల బియ్యం వస్తే 60 కేజీలు సంచుల కోసం తగ్గించాలి. 100 బస్తాలు వచ్చే రేషన్‌షాపన#కు ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి 270 కేజీలు బియ్యం తక్కువగా వస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. 

సక్రమంగా బియ్యం ఇస్తున్నాం 
ఎంఎల్‌ఎస్‌ పాయింట్‌ నుంచి డీలర్లకు బియ్యం సరిగ్గానే పంపుతున్నాం. ఒక బస్తాలో పొరబాటున బియ్యం తగ్గవచ్చు. మరో బస్తాలో ఎక్కువగా ఉండవచ్చు. పొరబాటు జరిగి బియ్యం తక్కువ వచ్చే అవకాశం లేదు. బియ్యం సరఫరా చేసే సమయంలో డీలర్లను ఎంఎల్‌ఎస్‌ పాయింట్లో దగ్గరుండి తూకం వేయించుకొని తీసుకుపొమ్మని చెబుతాం. 
– విజయకుమారి, ఎంఎల్‌ఎస్‌పాయింట్‌ డెప్యూటీ తహసీల్దార్, చిత్తూరు  

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top