breaking news
ration rice dealers
-
రేషన్‌కు కోత.. డీలర్ల దోపిడీ..
చినుకు..చినుకు కలిసి వరదైనట్టు.. గింజ..గింజ కలిసి వేలాది క్వింటాళ్లవుతున్నాయి. స్టాక్ పాయింట్లు, కొన్ని చౌకదుకాణాల ద్వారా యథేచ్ఛగా నల్లబజారుకు తరలిపోతున్నాయి. డీలర్లకు వచ్చేసరికి తూకంలో తేడాలొస్తున్నాయి. దీనిపై ప్రశ్నించిన వారినే లక్ష్యంగా చేసుకుని కొందరు అధికారులు వేధిస్తున్నట్టు తెలుస్తోంది. చేసేది లేక వచ్చిన బియ్యంలో లబ్ధిదారులకు కోత విధిస్తుండడం విమర్శలకు తావిస్తోంది. గుడిపాల: నిరుపేదలకు రేషన్ బియ్యం పంపిణీ పారదర్శకంగా ఉండాలని ప్రభుత్వం భావించింది. ఈ మేరకు ఈ పాస్ యంత్రాలను అందుబాటులోకి తెచ్చింది. రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యం తూకంలో తేడాలుంటున్నాయి. ఇదే సాకుతో రేషన్ డీలర్లు కార్డుదారులకు కోత విధిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 లక్షల 62 వేల 691 తెల్ల కార్డులున్నాయి. వీటికి 2,901 రేషన్ దుకాణాల ద్వారా బియ్యం, ఇతర సరుకులు పంపిణీ చేస్తున్నారు. ఈ దుకాణాలకు ఆగస్టులో 1,75,921 క్వింటాళ్ల బియ్యం సరఫరా చేశారు. రేషన్ దుకాణాలకు బియ్యం సరఫరా చేసేముందు ఎలాంటి షార్టేజ్ రాకుండా తూకం వేయించి పంపించాలి. సంబంధిత అధికారులు ఎంఎల్ఎస్ పాయింట్లలో బియ్యపు బస్తాలను తూకం వేయడం లేదు. సరాసరి బస్తా 50 కిలోల వంతున రేషన్ దుకాణాలకు పంపుతున్నట్లు డీలర్లు చెబుతున్నారు. ఈ విధానంతో తూకాల్లో తేడాలుంటున్నాయి. వీటిని ఈ–పాస్ మిషన్ల ద్వారా ఎలా సరఫరా చేయాలని డీలర్లు తలలు పట్టుకుంటున్నారు. రేషన్ దుకాణంలోని బస్తాలను తూకం వేస్తే ఏ ఒక్క బస్తా కూడా 50 కేజీలు ఉండడం లేదు. ఒక్కో సంచి సుమారు 600 గ్రాముల వరకు ఉంటుంది. ఆ మేరకు తూకానికి సంబంధించి కొరవడిన బియ్యాన్ని తాము ఎక్కడి నుంచి తెచ్చి కార్డుదారులకు ఇవ్వాలని రేషన్ డీలర్లు ప్రశ్నిస్తున్నారు. క్వింటాల్‌కు 3 కిలోల వరకు తరుగు రేషన్ దుకాణాలకు సరఫరా చేసే బియ్యపు బస్తాలో ఒక్కో దానికి కనీసం 1.5 కిలోల షార్టేజ్ వస్తోంది. ఇలాంటి సమయంలో వంద క్వింటాళ్లు ఇస్తున్న రేషన్ దుకాణంలో కనీసం 3 క్వింటాళ్ల వరకు తక్కువ వస్తున్నాయి. ఇంతమొత్తంలో బియ్యం తక్కువగా వస్తే తాము కార్డుదారులకు ఎలా సరఫరా చేయాలని డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డీలర్ల దోపిడీ రేషన్‌డీలర్లు బియ్యం ఇచ్చే సమయంలో ఒక్కో కార్డుదారునికి కనీసం అరకేజీ నుంచి కేజీ వరకు తగ్గిస్తూ ఇస్తున్నారు. దీనికి కొంతవరకు కార్డుదారులు కూడా అలవాటు పడగా ఎవరైనా ప్రశ్నిస్తే ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి తమకు తక్కువగా వస్తున్నాయని చెబుతున్నారు. కార్డుదారులకు నచ్చజెప్పి పంపడం పరిపాటుగా సాగుతోంది. సంచుల తూకాలు తగ్గించడం లేదు 50 కిలోల బియ్యంతో పాటు వస్తున్న సంచి తూకంలో 600 గ్రాముల తగ్గించాలి. ఒక రేషన్‌షాపునకు 100 బస్తాల బియ్యం వస్తే 60 కేజీలు సంచుల కోసం తగ్గించాలి. 100 బస్తాలు వచ్చే రేషన్షాపన#కు ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి 270 కేజీలు బియ్యం తక్కువగా వస్తున్నట్లు డీలర్లు చెబుతున్నారు. సక్రమంగా బియ్యం ఇస్తున్నాం ఎంఎల్ఎస్ పాయింట్ నుంచి డీలర్లకు బియ్యం సరిగ్గానే పంపుతున్నాం. ఒక బస్తాలో పొరబాటున బియ్యం తగ్గవచ్చు. మరో బస్తాలో ఎక్కువగా ఉండవచ్చు. పొరబాటు జరిగి బియ్యం తక్కువ వచ్చే అవకాశం లేదు. బియ్యం సరఫరా చేసే సమయంలో డీలర్లను ఎంఎల్ఎస్ పాయింట్లో దగ్గరుండి తూకం వేయించుకొని తీసుకుపొమ్మని చెబుతాం. – విజయకుమారి, ఎంఎల్‌ఎస్‌పాయింట్ డెప్యూటీ తహసీల్దార్, చిత్తూరు -
ఆగని బియ్యం దందా
పీడీఎస్ బియ్యం సేకరణపై అనుమానాలు నెలకోసారి పట్టివేత డీలర్లే ప్రధాన సూత్రధారులు హసన్‌పర్తి : పేదలకు చెందాల్సిన బియ్యం పక్కాదారి పడుతున్నాయి. అక్రమార్కులపై కేసులు నమోదు చేసినా బియ్యం దందా ఆగడం లేదు. నాలుగు నెలలుగా బియ్యం వ్యాపారులపై నాలుగు కేసులు నమోదైనా మళ్లీ అదే మార్గం పట్టారు. 40 రోజుల క్రితం ఇదే ముఠా హుస్నాబాద్‌లో లారీలతో పట్టుబడిన విషయం తెలిసిందే. ఆ తర్వాత 15 రోజుల్లో మళ్లీ వారు సుమారు 80 క్వింటాళ్ల బియ్యం సేకరించి అధికారులకు చిక్కారు. ఆ తర్వాత నెల తిరగకముందే శనివారం మళ్లీ 80 క్వింటాళ్ల బియ్యాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. బియ్యాన్ని స్వయంగా లబ్ధిదారుల నుంచే కొనుగోలు చేసి.. రెండుమూడు రూపాయలకు ఎక్కువగా అమ్ముకుంటున్నామని నిందితులు చెబుతున్న మాటల్లో స్పష్టత లేదు. బియ్యం సేకరణపై అనుమానాలు.. రేషన్ బియ్యం దందా చేసే వారు పేర్కొంటున్న విధంగా బియ్యం సేకరణపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా కూలీలకు వెళ్లేవారు. ఈ బియ్యాన్ని వినియోగించుకుంటున్నారు. అయితే కార్డులు కలిగిన మధ్యతరగతి వర్గాలు మాత్రం రేషన్‌షాపుల నుంచి తీసుకొచ్చిన బియ్యాన్ని రూ.8 నుంచి రూ.10 వరకు విక్రయిస్తున్నారు. కొందరైతే నెలవారీగా బియ్యం తీసుకెళ్లడం లేదు. ఈ బియ్యాన్ని సదరు డీలర్లు బ్లాక్‌లో విక్రయిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. రేషన్‌షాపుకు వచ్చే క్రమంలోనే లారీని మధ్యలోనే నిలిపివేసి.. బియ్యాన్ని కొంతమంది డీలర్లు అమ్ముతున్నారని స్థానికంగా ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా నిందితుల మాత్రం అధికారులకు మరోలా వాంగ్మూలం ఇస్తున్నారు. ఇంటింటికీ తిరుగుతూ ఉల్లిగడ్డలు విక్రయించి.. అందుకు బదులుగా బియ్యం తీసుకుంటున్నట్లు పేర్కొంటున్నారు. హసన్‌పర్తిలో మరో రెండు ప్రాంతాల్లో పెద్దమొత్తంలో రేషన్ బియ్యం దందా నడుస్తున్నా అధికారులు ఎందుకు దాడులు చేయడం లేదని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
రెండు మండలాలు..రాసిచ్చేస్తా...
-అడ్డువచ్చిన వారి తోక కత్తిరిస్తా... -ఈ డీల్ కుదిర్చినందుకు నాకు ఎంత ఇస్తావ్... -నీవు కాదంటే చెప్పు వేరేవారికిచ్చేస్తా -పౌర సరఫరాల సరుకు పక్కదారిపై మంతనాలు -అధికార పార్టీ యువనేతే వ్యూహకర్త -‘సాక్షి’ చేతికి చిక్కిన ఆడియో సంభాషణ 'రెండు మండలాలు నీకు అప్పగిస్తాను. ఎవరైనా తోక జాడిస్తే నాతో చెప్పు అడ్డంగా తోక కత్తిరించేస్తా... నీ దోపిడీకి రహదారి వేసినందుకు నాకెంత ఇస్తావు... ముందుగా అది తేల్చు ... నాపై బాగా ఒత్తిళ్లున్నాయి. నువ్వు ఏ విషయం తేల్చకపోతే నేను నా వాళ్లకు అప్పగించేస్తాను...ఇదీ ప్రకాశం జిల్లా ఎస్.ఎన్.పాడు మండలంలో బియ్యం అక్రమ రవాణా చేస్తున్న వ్యక్తితో యువనేత బేరసారాలు. దీనికి ఒక రేషన్ డీలర్ల అసోసియేషన్ నేత మధ్యవర్తిగా వ్యవహరించి కథ నడిపించాడు. ఆ సంభాషణ ఏ రీతిలో సాగిందంటే...' సాక్షి, టాస్క్‌ఫోర్స్: పౌర సరఫరాల వ్యవస్థను గాడిలో పెట్టడానికి పెద్ద ప్రభుత్వ యంత్రాంగమే ఉంది. అయినా బొక్కసానికి బొరియలు పడుతూనే ఉన్నారు. ఈ బొరియలు కప్పడానికి ప్రభుత్వం పాలకవర్గాన్ని ఏర్పాటు చేసి కొంతమందికి కిరీటం పెట్టింది. సరిదిద్దాల్సింది పోయి బేరసారాలకు దిగుతున్నారు ... అరికట్టాల్సింది పోయి అడ్డంగా దోచుకునే మార్గాలను అన్వేషిస్తున్నారు ... అధికారం మాదే అడ్డొచ్చినవాడెవడంటూ భుజం తట్టి ప్రోత్సహిస్తున్నారు ... పేదలకు, మధ్య తరగతికి అందాల్సిన బియ్యాన్ని బొక్కేస్తున్నారు ... బొక్కసానికి కన్నం వేస్తున్నారు. పంచాయితీ పెట్టి మరీ పంచుకుంటున్నారు. అదెలా అంటే... అక్రమ రవాణాదారుడు: ఈపాస్ వచ్చిన తర్వాత ఆదాయం తగ్గింది. అంత రావడం లేదు. యువనేత: ఈ పాస్ వల్ల డీలర్లకు ఆదాయం కొంచెం తగ్గిన మాట నిజమే. గతంలో ఒక షాపులో ఆరు వందలు కార్డులుంటే మూడు వందల కార్డులు అమ్ముకున్నారు. ఇప్పుడు రెండు వందల నుంచి 250 వరకూ అమ్ముతున్నారు. టెన్ పర్సెంట్ మాత్రమే తగ్గింది. చీమకుర్తిలో 900 టన్నులు బియ్యం రవాణా జరుగుతుంటే గతంలో 300 వందల టన్నులు అమ్ముకునేవారు. ఇప్పుడు 200 నుంచి 250 టన్నులు పక్కదారి పడుతోంది. ట్రాన్స్‌పోర్టు మొత్తం ఇవ్వు. కిలోకి రూపాయి ఇస్తావా? ఎక్కడ బియ్యం ఎంత వస్తుందో నాకు తెలుసు. ఇవన్నీ కాదు నువ్వు ఎంత ఇస్తావో చెప్పు? (మాటల్లో కొంత అసహనం)... ఈ వ్యాపారంలో ఎన్ని ఇబ్బందులున్నాయి? ఎక్కడైనా లారీ పట్టుబడితే బయటపడడానికి ఎన్ని చిక్కులు...ఆ చిక్కు ముడులు విప్పాలంటే ఏమి చేయూలో సుదీర్ఘంగా ముగ్గురి మధ్య చర్చ జరిగింది. యువనేత: నాపై చాలా ప్రెజర్ వస్తోంది...అడగడానికి భయపడాల్సిన వారు కూడా నా వద్దకు వచ్చి నాకు నాలుగు షాపులు ఇప్పించమని అడుగుతున్నారు. బంధుత్వాలు, పార్టీని అడ్డం పెట్టుకుని ఒత్తిడి చేస్తున్నారు. ఇంతకు ముందే చీమకుర్తికి చెందిన వ్యక్తి ట్రాన్స్‌పోర్టు కావాలని అడిగి వెళ్లాడు. ట్రాన్స్‌పోర్టు వర్క్ అవుట్ కాదని చెప్పాను. ట్రాన్స్‌పోర్టు ఉంటే డీలర్లతో సంబంధాలు ఉంటాయని చెబుతున్నాడు. మధ్యవర్తి: పెద్ద మనసు చేసుకో? పార్టీ మనిషిగా ఇతనికే ఇప్పించు. మొదటి నుంచీ పార్టీకి నమ్ముకున్నోడు. ఈ రోజు పార్టీ అధికారంలోకి వచ్చిందని పార్టీలోకి వచ్చినవారు కాదు. అలా అని నీ సొంత మండలంలోకి వచ్చి దర్పం ప్రదర్శించేవాడు కాదు. వయా మీడియాగా అతనికి వచ్చేలా చూడు. ఏం చేయాలో నువ్వే చెప్పు యువనేత: ప్రతి నెలా 15 లారీలు వచ్చాయ్...20 వచ్చాయ్... ఈ పంచాయితీలు నాకనవసరం. సింగిల్ టెండర్ వేయిస్తాను. రెండు మండలాల్లో కొనుక్కొని, టెండర్ చేజిక్కించుకోమను. నెలకు ఎంత ఇస్తావు స్ట్రయిట్‌గా చెప్పు అని అడిగాను. ట్రాన్స్‌పోర్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్ తోలుతాను. కిలోకు రూపాయి చొప్పున మీ కుర్రోళ్లకు ఇస్తానని ఒకతను నా దగ్గరకు వచ్చాడు. ఇప్పుడున్న వారి సంగతి తేల్చకుండా ఇవ్వడం కరెక్టు కాదని పెండింగ్ పెట్టా. ట్రాన్స్‌పోర్టు టెండర్ లేకుండా చేయిస్తా. నువ్వు ఎంతకైనా కొనుక్కో. రూ.12, రూ.13, రూ.15... ఎంతైనా. వంద టన్నులు కొనుక్కో.. లేకపోతే రెండు వందల టన్నులు కొనుక్కో. నీ ఇష్టం అది నాకు సంబంధం లేదు అని చెప్పాను. మధ్యవర్తి: ఇది మంచి ప్రతిపాదనే కదా... అక్రమ రవాణాదారుడు : మా వాళ్లను కనుక్కుని చెబుతానని చెప్పా. మా వారితో మాట్లాడితే అంత ఆదాయం రావడం లేదన్నారు. తెల్లగుడిపాడు వారు వేరే వారికి తోలుతున్నారని చెప్పారు. ఎన్ని వస్తున్నాయో చెప్పమని అడిగాను. ట్రాన్స్‌పోర్టు మొత్తం వారిని తీసుకోవాలని చెప్పు.. లేదంటే బియ్యం రెండు మూడు బళ్లు ఆయన చెప్పిన వారికి పంపిస్తానని మావాడు చెప్పాడు. మధ్యవర్తి: ఇదంతా అనవసరం. ట్రాన్స్‌పోర్టు ఎంత వస్తుంది. అక్రమ రవాణాదారుడు: 50 నుంచి 55 వేలు వస్తుంది. మధ్యవర్తి: ట్రాన్స్‌పోర్టు ఇతనే చేస్తాడు. బిల్లు నువ్వు తీసుకో. నెలకి ఇంతని చెప్పి సెటిల్ చేసుకో... యువనేత: త్వరలోనే సంతనూతల పాడు, చీమకుర్తి డీలర్ల సమావేశం పెట్టి వారికి కూడా చెబుతాను. మధ్యవర్తి: మిల్లర్లతో కూడా ఇబ్బందులుంటాయి. కొంతమంది పక్క మండలాల్లో కూడా వేలు పెడుతున్నారు. వారికి నువ్వు గట్టిగా చెప్పాలి. యువనేత: ట్రాన్స్‌పోర్టు నీకు ఇప్పిస్తాం. డీటీకి చెప్పేస్తాను. ట్రాన్స్‌పోర్టు డబ్బులు మా కుర్రాళ్లకు ఇచ్చేయి. ఇంకా నెలకు ఎంత ఇస్తావో తేల్చి చెప్పు.... యువనేత, మధ్యవర్తి, అక్రమ రవాణాదారుడి మధ్య చర్చల అనంతరం...ట్రాన్స్‌పోర్టు బిల్లు కాకుండా మరికొంత మొత్తం నెలనెలా ఇచ్చేందుకు ఒప్పందం కుదిరింది. ఒక మండలంలో బయటపడిన తంతు మాత్రమే ఇది. మిగిలిన మండలాల్లో ఇదే తరహా అక్రమాలకు తెరదీస్తున్నారు... అధికార దాహంతో జిల్లాను దోచేస్తున్నారు. యువనేత: ఏడేళ్ల నుంచి టీడీపీ బాధ్యతలు నేనే మోస్తున్నాను. ఈ రోజు డిపార్టుమెంట్లో ఉండి నా మనుషులకు, నాకు న్యాయం చేసుకోలేకపోతే ఎలా? నా పొజిషన్లో నువ్వుంటే ఏం చేస్తావు? ఇతనికి నాలుగు రోజుల కిందట మూడు ఆప్షన్స్ ఇచ్చాను. నువ్వే డిసైడ్ చేసుకోవాలని చెప్పాను. ఇంకో సెంటర్ వెతుక్కో. సంతనూతలపాడు.. చీమకుర్తి వదిలేసెయ్... ఇది ఫస్ట్ ఆప్షన్... అలా కాదంటే తోలడం మావాళ్లే చేస్తారు. అన్ని షాపుల నుంచి కలెక్షన్ ఎలా చేయాలో వారే చేస్తారు. వారే అమ్ముకుంటారు. నీకు ఏ సంబంధం లేదు. ట్రాన్స్‌పోర్టు నువ్వే ... తోలేదీ నువ్వే ... ఎంత కొనుక్కుంటావో కొనుక్కో. వంద కొనుక్కుంటావో, నూటయాభై కొనుక్కుంటావో నీ ఇష్టం. నా సంగతి ఏం చేస్తావ్. ఆప్షన్ నీదే...