
రాజమహేంద్రవరం సిటీ: మహిళలు, విద్యార్థినుల సమస్యలపై విద్యాసంస్థలు, కార్యాలయాల్లో అంతర్గత ఫిర్యాదుల కమిటీలను వేయనున్నట్లు ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ వాసిరెడ్డి పద్మ పేర్కొన్నారు. రాజమహేంద్రవరంలో శనివారం ఆమె విలేకరులతో మాట్లాడారు. మహిళలు ఆర్థికంగా ఎదిగేందుకు, అధికారం పొందేందుకు, మహిళా రక్షణకు కమిషన్ కృత నిశ్చయంతో పనిచేస్తోందన్నారు. మహిళలకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమాన్ని చూడలేని టీడీపీ దాడికి దిగుతోందన్నారు.
మహిళలను ఓటు బ్యాంకుగా చూడకుండా వారి అభ్యున్నతికి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. రెండున్నరేళ్లలో తమ కాళ్లమీద తాము నిలబడతున్నామనే ధీమా మహిళల్లో ఏర్పడిందన్నారు. ఆసరా, అమ్మఒడి, చేయూత వంటి పథకాలు మహిళల సంక్షేమానికి దోహదపడుతున్నాయన్నారు. స్పందనలో వస్తున్న మహిళల ఫిర్యాదులను ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నామన్నారు. మహిళా హోంమంత్రిని విమర్శించడం టీడీపీ నాయకులకు తగదన్నారు. కమిషన్ సభ్యురాలు సయుజ, రుడా చైర్ పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, మార్తి లక్ష్మి, డాక్టర్ అనపూరి పద్మలత పాల్గొన్నారు.