Bavajipalem: దేశసేవలో పునీతం | Ideally Guntur district Bavaji palem for soldiers | Sakshi
Sakshi News home page

Bavajipalem: దేశసేవలో పునీతం

May 4 2021 4:42 AM | Updated on May 4 2021 12:59 PM

Ideally Guntur district Bavaji palem for soldiers - Sakshi

బావాజీపాలెం గ్రామ సచివాలయం

ఆ గ్రామం తరతరాలుగా దేశసేవలో తరిస్తోంది. భారత సైన్యంలో సేవలందించని గడపలు ఆ ఊళ్లో లేవు.

సాక్షి, గుంటూరు: ఆ గ్రామం తరతరాలుగా దేశసేవలో తరిస్తోంది. భారత సైన్యంలో సేవలందించని గడపలు ఆ ఊళ్లో లేవు. ప్రతి ఇంటి నుంచి ఇద్దరు, ముగ్గురు, నలుగురు సైన్యంలో చేరి దేశానికి సేవచేసినవారు ఉంటారు. భారత సైనిక వ్యవస్థలో గుంటూరు జిల్లా నిజాంపట్నం మండలం బావాజీపాలెం గ్రామానికి ప్రత్యేక స్థానం ఉంది. బావాజీపాలెం గ్రామంలో 300 కుటుంబాలున్నాయి. గ్రామస్తులంతా ముస్లింలే. దేశ రక్షణకు ప్రాణాలు పణంగా పెట్టి సైన్యంలో చేరాలంటే చాలామంది యువకులు తటపటాయిస్తుంటారు. అయితే ఈ గ్రామంలోని తల్లిదండ్రులు మాత్రం బిడ్డలను సైన్యంలోకి పంపడాన్ని కర్తవ్యంగా భావిస్తారు.

యువకులు సైతం సైన్యంలో చేరేందుకు ఉత్సాహంగా అడుగులు వేస్తారు. గ్రామంలోని 98 శాతం ఇళ్లలో సైనికులు, మాజీ సైనికులు ఉన్నారు. దీంతో బావాజీపాలెం మిలటరీ గ్రామంగా ప్రసిద్ధి చెందింది. రెండో ప్రపంచ యుద్ధానికి ముందు గ్రామం నుంచి కొందరు యువకులు సైన్యంలో చేరారు. ఆ స్ఫూర్తితో తరువాతి తరాలు సైన్యంలో చేరడానికి ఆసక్తి చూపాయి. ఇప్పటివరకు ఈ గ్రామం నుంచి 500 మంది సైన్యంలో చేరి దేశానికి సేవలందించారు. ప్రస్తుతం గ్రామస్తులు 50 మందికి పైగా సైన్యంలో వివిధ విభాగాల్లో విధులు నిర్వర్తిస్తున్నారు. 

గ్రామాన్ని దత్తత తీసుకున్న ఆర్మీ
1965 చైనా యుద్ధం, 1971 పాకిస్తాన్‌ యుద్ధం, 1999 కార్గిల్‌ వార్‌ ఇలా సరిహద్దుల్లో భారత్‌ జరిపిన ప్రతి పోరాటంలో బావాజీపాలెం సైనికులు పాల్గొన్నారు. తరతరాలుగా దేశ రక్షణకు జవాన్లను అందిస్తున్న ఈ గ్రామాన్ని 1978లో భారత ఆర్మీ దత్తత తీసుకుంది. మద్రాస్‌ ఇంజనీరింగ్‌ గ్రూప్‌ సహకారంతో వాటర్‌ స్కీమ్‌ను చేపట్టి గ్రామంలో వాటర్‌ ట్యాంకు నిర్మించి తాగునీటి సమస్యను తీర్చింది. 

యువతకు ఆదర్శం
చెడు సహవాసాలతో దురలవాట్లకు బానిసలుగా మారి, డబ్బు కోసం నేరాలకు పాల్పడి భవిష్యత్‌ నాశనం చేసుకుంటున్న ఎందరో యువకులకు బావాజీపాలెం యువత ఆదర్శంగా నిలుస్తోంది. గ్రామంలో ఇంటర్మీడియట్, డిగ్రీ చదివిన ప్రతి యువకుడూ సైన్యంలో చేరడానికి ప్రయత్నిస్తాడు. మాజీ సైనికుల అనుభవాలే తమకు పాఠాలని, సైన్యంలో చేరేందుకు ప్రేరణలని గ్రామ యువకులు చెబుతారు. గ్రామానికి చెందిన మాజీ, ప్రస్తుత సైనికులు సైన్యంలోకి వెళ్లడానికి ఇష్టం ఉన్న యువతకు ఎలా సన్నద్ధం అవ్వాలనే విషయమై సలహాలు, సూచనలు ఇస్తుంటారు. 

కర్తవ్యంగా భావిస్తాం
నేను 1988 నుంచి 2005 వరకు భారత ఆర్మీలో సేవలందించాను. మా తాత, తండ్రి, సోదరుడు కూడా సైన్యంలో పనిచేశారు. భారత సైన్యంలో సేవలందించడం కర్తవ్యంగా మా గ్రామంలోని ప్రతి ఒక్కరూ భావిస్తారు. గ్రామంలో పుట్టిన అమ్మాయిలు సైనికులను పెళ్లాడటానికి ఇష్టపడతారు. జమ్మూకశ్మీర్, త్రిపుర, అస్సాం సహా వివిధ రాష్ట్రాల్లోని దేశ సరిహద్దుల్లో విధులు నిర్వర్తిస్తున్న ప్రతి యూనిట్‌లో బావాజీపాలెం సైనికులు ఉంటారు. 1994లో మా గ్రామంలో ప్రత్యేకంగా బ్యాంక్‌ ఏర్పాటు చేశారు. ఆ బ్యాంక్‌ను ప్రస్తుతం మూసివేశారు. దీంతో మాజీ సైనికులు, ప్రస్తుతం సేవలందిస్తున్న సైనికుల కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి. వినియోగదారుల సర్వీస్‌ సెంటర్‌ను బ్యాంక్‌ ఏర్పాటు చేసినప్పటికీ అందులో పూర్తిస్థాయిలో బ్యాంక్‌ సేవలు లభించడం లేదు. తిరిగి బ్యాంక్‌ను గ్రామంలో ఏర్పాటు చేసి సమస్య తీర్చాలి. 
– నజీర్‌ అహ్మద్, మాజీ సైనికుడు, బావాజీపాలెం గ్రామ సర్పంచ్‌

మా కుటుంబం అంతా సైనికులమే
మేం ఐదుగురు సోదరులం. అందరం భారత సైన్యంలో చేరి సేవలంధించాం. సైన్యంలో చేరి దేశానికి సేవలందించడం గొప్ప వరం. ఆ వరం మా కుటుంబంలో అందరికీ లభించడం అదృష్టంగా భావిస్తాం. మా గ్రామం సహా నిజాంపట్నం మండలం, చుట్టుపక్కల గ్రామాల్లో వందలమంది మాజీ, ప్రస్తుతం సేవలందిస్తున్న సైనికులు ఉన్నారు. వీరి సౌకర్యార్థం క్యాంటీన్‌ను ఏర్పాటు చేయాలని గతంలో చాలాసార్లు ఉన్నతాధికారులకు వినతిపత్రాలు అందజేశాం. మా ప్రాంతంలో ఆర్మీ యూనిట్‌ లేకపోవడం వల్ల క్యాంటీన్‌ ఏర్పాటు చేయడం సాధ్యం కాదని చెప్పారు. మొబైల్‌ క్యాంటీన్‌ను ఏర్పాటు చేసినా మాకు ఎంతో ఉపయోగపడుతుంది. 
– ఎండీ అయూబ్, మాజీ సైనికుడు, బావాజీపాలెం 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement