ఏపీకి అలర్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షం | Heavy Rain Alert For Many Districts In AP | Sakshi
Sakshi News home page

ఏపీకి అలర్ట్‌.. ఈ జిల్లాల్లో భారీ వర్షం

Apr 6 2026 12:00 PM | Updated on Apr 6 2026 1:40 PM

Heavy Rain Alert For Many Districts In AP

సాక్షి, విజయవాడ: ఏపీలో భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం అన్నట్టుగా వాతావరణం మారిపోయింది. దక్షిణ కోస్తాంధ్ర-పశ్చిమ మధ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతుండగా.. రాయలసీమ పరిసర ప్రాంతాలపై మరో ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉంది. వీటి ప్రభావంతో రానున్న రెండు రోజుల పాటు మేఘావృతమైన వాతావరణంతో పిడుగులతో కూడిన వర్షాలు పడొచ్చని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటనలో తెలిపింది.

ఈ క్రమంలో ఏలూరు జిల్లాకు రెడ్ అలర్ట్ విధించింది. రాగల మూడు గంటల్లో పిడుగులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే, 50-60 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ఏపీ విపత్తుల శాఖ హెచ్చరికలు జారీ చేసింది. అలాగే, శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో పిడుగులతో కూడిన ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం, ప్రకాశం, నెల్లూరు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

మరోవైపు.. సోమవారం పోలవరం జిల్లా చింతూరు, ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు, ఇబ్రహీంపట్నం మండలాల్లో వడగాలుల ప్రభావం ఉండనుంది. ఆదివారం పార్వతీపురం మన్యం జిల్లా వీరఘట్టం, నెల్లూరు జిల్లా నెల్లూరుపాలెంలో అత్యధికంగా 42.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పలుచోట్ల 41 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదు అయినట్టు అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement