నాలుగు తరాలు ఉపాధ్యాయ వృత్తిలోనే..  | Four generations in the teaching profession | Sakshi
Sakshi News home page

నాలుగు తరాలు ఉపాధ్యాయ వృత్తిలోనే.. 

Sep 5 2022 5:26 AM | Updated on Sep 5 2022 9:20 AM

Four generations in the teaching profession - Sakshi

ఉపాధ్యాయుడుగా తాను సాధించిన జ్ఞాపికలతో వెంకట బంగారేశ్వరశర్మ

తాళ్లరేవు: ‘ఇంజరం.. విద్వత్‌ కుంజరం..’ అన్నది అనాదిగా ఉన్న నానుడి. వేద పండితులు, విద్వాంసులు, సంగీత, సాహిత్య కళాకారులకు తూర్పు గోదావరి జిల్లా తాళ్లరేవు మండలంలోని ఇంజరం గ్రామం నెలవు. ఇదేకాదు.. ఈ గ్రామంలో ఓలేటి కుటుంబానికీ ఓ ప్రత్యేకత ఉంది. ఆ కుటుంబం నాలుగు తరాలుగా ఉపాధ్యాయ వృత్తిలోనే కొనసాగుతోంది. గ్రామానికి చెందిన ఓలేటి బంగారేశ్వరశర్మ పాఠశాల వ్యవస్థ లేని కాలంలోనే గురుకుల వ్యవస్థ పరంపరలో తన ఇంటి అరుగు మీదే విద్యార్థులకు సాహిత్యం, పాఠాలు బోధించేవారు.

ఆయన కుమారుడు ఓలేటి సూర్యనారాయణశాస్త్రి గ్రేడ్‌–1 ఉపాధ్యాయుడిగా పనిచేశారు. ఈయన కుమారుడు ఓలేటి శ్రీనివాసశర్మ కూడా ఉపాధ్యాయుడే. ఈయన తన ఏడుగురు కుమారులను ప్రభుత్వ ఉపాధ్యాయులుగా తీర్చిదిద్దారు. తన తాత, తండ్రి స్ఫూర్తితో విద్య ద్వారా మాత్రమే సమాజాన్ని మార్చగలమని విశ్వసించి తన పిల్లలను ఉపాధ్యాయులను చేశారు. ఆయన ఇద్దరు కోడళ్లు కూడా ప్రభుత్వ ఉపాధ్యాయులే కావడం విశేషం. 

ఏడుగురు కుమారులూ ఇలా.. 
ఇక శ్రీనివాసశర్మ పెద్ద కుమారుడు సూర్యనారాయణశాస్త్రి తెలుగు ఉపాధ్యాయుడిగా.. రెండో కుమారుడు వెంకటభాస్కరశర్మ సంస్కృత, సాహిత్య అధ్యాపకునిగా.. మూడో కుమారుడు వెంకట ఫణినాథశర్మ ఫిజికల్‌ సైన్స్‌ ఉపాధ్యాయుడిగా.. నాలుగో కుమారుడు వెంకట రమణశర్మ ఎస్‌జీటీగా పనిచేస్తున్నారు. అలాగే, ఐదో కుమారుడు సుబ్రహ్మణ్యేశ్వర శర్మ వ్యాకరణ అధ్యాపకుడిగా.. ఆరో కుమారుడు వెంకట బంగారేశ్వరశర్మ తెలుగు ఉపాధ్యాయుడిగా.. ఏడో కుమారుడు మృత్యుంజయశర్మ గణిత ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు.

మరోవైపు.. మూడో కుమారుడు వెంకటఫణినాథశర్మ భార్య రాజేశ్వరి, ఆరో కుమారుడు బంగారేశ్వరశర్మ భార్య వీరేశ్వరి కూడా టీచర్లే. ఇలా మొత్తం ఆ కుటుంబంలో తొమ్మిది మంది ఉపాధ్యాయులుగా సేవలందిస్తున్నారు. అలాగే, శ్రీనివాసశర్మ కుమార్తె సుబ్బలక్ష్మి కుమారుడు, అల్లుడు కూడా ఉపాధ్యాయులే. మొత్తం మీద ఓలేటి కుటుంబమంతా ఉపాధ్యాయులుగా పనిచేస్తూ నాలుగు తరాలుగా విద్యాభివృద్ధికి కృషిచేస్తోంది. తన కుమారులు ఏడుగురూ తండ్రి ప్రోత్సాహంతోనే ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారని శ్రీనివాసశర్మ సతీమణి ఓలేటి వెంకట సీతామహాలక్ష్మి ‘సాక్షి’కి తెలిపారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement