న్యాయమూర్తులు చట్టానికి అతీతులు కారు

Former Advocate General CV Mohan Reddy Interview With Sakshi

ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం తప్పు

ప్రభుత్వ చర్యలపై అభ్యంతరం ఉంటే తీర్పుల్లోనే రాయాలి

ప్రభుత్వంపై ప్రజల్లో దురభిప్రాయం కలిగించరాదు

న్యాయమూర్తులపై ఫిర్యాదు చేయడంలో తప్పులేదు

జస్టిస్‌ ఎన్‌వీ రమణపై సీఎం జగన్‌ ఫిర్యాదు తప్పు కానేకాదు

సీనియర్‌ న్యాయవాది, మాజీ ఏజీ సీవీ మోహన్‌రెడ్డి

సాక్షి, అమరావతి : రాష్ట్రపతి, ఉప రాష్ట్రపతి, ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులు, ఎవరైనా సరే చట్టానికి లోబడే పని చేయాల్సి ఉంటుందని, న్యాయమూర్తులు చట్టానికి అతీతులు కారని సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ చింతల విష్ణు మోహన్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిపై ఆరోపణలు వచ్చినప్పుడు వాటిపై ఫిర్యాదు చేయడంలో ఎంత మాత్రం తప్పులేదన్నారు. న్యాయమూర్తులు రాజ్యాంగానికి, చట్టాలకు అతీతులు కారని, వారిపై ఆరోపణలకు ఆధారాలు ఉన్నప్పుడు ఆ విషయాన్ని వారిపై చర్యలు తీసుకునే నిర్ణాయక స్థానాల్లో ఉన్న వారికి ఫిర్యాదు చేయడం ప్రజాస్వామ్యంలో భాగమేనన్నారు.

సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి జస్టిస్‌ నూతలపాటి వెంకటరమణపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఫిర్యాదు చేయడంలో ఏ మాత్రం తప్పులేదని ఆయన స్పష్టం చేశారు. ఇలా ఫిర్యాదు చేయడాన్ని తప్పుపడితే, అది పెద్ద తప్పు అవుతుందన్నారు. ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి అంతర్గత విచారణ తప్పక జరిపించాలన్నారు. సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయమూర్తి అని విచారణ చేయకుండా వదిలేస్తే, న్యాయవ్యవస్థ ప్రతిష్ట ఏం కావాలి? వ్యవస్థపై ప్రజలు పెట్టుకున్న నమ్మకం ఏం కావాలి? అని ఆయన ప్రశ్నించారు. జస్టిస్‌ రమణపై ముఖ్యమంత్రి జగన్‌ ఫిర్యాదు చేయడాన్ని న్యాయవ్యవస్థ-శాసనవ్యవస్థ మధ్య యుద్ధంగా ఎంత మాత్రం భావించరాదన్నారు. కొద్ది రోజులుగా న్యాయ వ్యవస్థలో జరుగుతున్న పరిణామాలపై ఆయన ‘సాక్షి’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే..

ఇదేమీ మొదటిసారి కాదు..
న్యాయమూర్తులపై ముఖ్యమంత్రి ఫిర్యాదు చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో దామోదరం సంజీవయ్య ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ చంద్రారెడ్డి, జస్టిస్‌ సత్యనారాయణరాజు తదితరులపై చాలా తీవ్రమైన ఆరోపణలతో ఫిర్యాదు చేశారు. కోర్టులో కులతత్వాన్ని పెంచి పోషిస్తున్నారని, ఆశ్రిత పక్షపాతం చూపుతున్నారని, వారికి కావాల్సిన న్యాయవాదులను ప్రోత్సహిస్తున్నారని.. ఇలా సంజీవయ్య పలు ఆరోపణలు చేశారు. ఈ ఫిర్యాదు మీద అప్పటి సుప్రీంకోర్టు పెద్దలు స్పందించారు. దీంతో జస్టిస్‌ చంద్రారెడ్డిని మద్రాసుకు బదిలీ చేశారు. వాస్తవానికి జస్టిస్‌ చంద్రారెడ్డి సుప్రీంకోర్టుకు పదోన్నతిపై వెళ్లాల్సి ఉండింది. ఈ ఫిర్యాదులతో ఆయన బదిలీ అయ్యారు. 

ముఖ్యమంత్రి కూడా భయపడాలా?
వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నేను అడ్వొకేట్‌ జనరల్‌గా ఉన్నాను. అప్పుడు జస్టిస్‌ ఎ.గోపాల్‌రెడ్డి మీద ఫిర్యాదులు చేశాం. ఆయనపై సుప్రీంకోర్టు చర్యలు తీసుకోలేదు. ఫలానా జడ్జీలు చేస్తున్నది తప్పు అనిపించినప్పుడు, ఆ తప్పులకు ఆధారాలున్నప్పుడు ఫిర్యాదు చేయడం ఎలా తప్పు అవుతుంది? ఫిర్యాదు చేయడం తప్పని అంటే, ఎంత పెద్ద హోదాలో ఉంటే అంత పెద్ద తప్పు చేయవచ్చునని, అలాంటి వ్యక్తుల తప్పులను ప్రశ్నించవద్దని చెప్పినట్లే అవుతుంది. ఇదేం న్యాయం? ఇదెక్కడి న్యాయం? ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి రాజ్యాంగ పదవిలో ఉన్న వ్యక్తి. అలాంటి వ్యక్తి కూడా ఫిర్యాదు చేయకుండా భయపడితే ఇక వ్యవస్థలు ఎలా బాగుపడతాయి? ఫిర్యాదు చేసినంత మాత్రాన, వ్యవస్థను నాశనం చేసినట్లా? ఫిర్యాదు చేయడం వల్ల కాదు.. తప్పు జరుగుతున్నా చూస్తూ మౌనంగా ఉండటం వల్ల వ్యవస్థలు నాశనం అవుతాయి. ముఖ్యమంత్రి ఫిర్యాదు మీద నానా యాగీ చేస్తున్న వారు ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకోవాలి. పది మంది కలిసి ఓ ఒప్పును తప్పంటే అది ఎప్పటికీ తప్పైపోదు.

పక్కన పడేస్తారని నేను అనుకోవడం లేదు
ఇలాంటి ఫిర్యాదులు సుప్రీంకోర్టుకు కొత్త కాదు. ఇలాంటి ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిపై విచారణ జరిపేందుకు అంతర్గత విచారణ ప్రక్రియ ఉంది. ఈ విషయంలో కొన్ని సంవత్సరాల క్రితమే సుప్రీంకోర్టు నిర్ధిష్టమైన విధానాన్ని రూపొందించుకుంది. దీని ప్రకారం ముఖ్యమంత్రి జగన్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా విచారణ జరపాల్సి ఉంటుంది. విచారణ జరపాలా? వద్దా? అన్నది పూర్తిగా ప్రధాన న్యాయమూర్తి నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. విచారణ జరపాలని అనుకుంటే ఓ కమిటీని ఏర్పాటు చేస్తారు. ఫిర్యాదుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయా లేవా అన్న విషయాన్ని కమిటీ తేలుస్తుంది. ఉన్నాయనుకుంటే తదనుగుణంగా ముందుకు వెళుతుంది.

ఆధారాలు లేవనుకుంటే అప్పుడు సీఎంపై చర్యలు ప్రారంభించవచ్చు. కాని తీవ్రమైన ఆరోపణలున్న ఫిర్యాదులను ప్రధాన న్యాయమూర్తి పక్కన పడేస్తారని నేను అనుకోవడం లేదు. ఇంతటి తీవ్రమైన ఆరోపణలపై కూడా విచారణ చేయకుంటే, ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపినట్లవుతుంది. ఆధారాలు సమర్పించినప్పుడు కూడా విచారణ ఎందుకు చేయడం లేదన్న సందేహాలు ప్రజల్లో వస్తాయి. ఈ సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత వ్యవస్థ పెద్దలపై ఉంది. లేకపోతే వ్యవస్థపై నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది. ప్రస్తుత ఫిర్యాదు విషయంలో ప్రజల విశ్వాసాన్ని సుప్రీంకోర్టు వమ్ముకానివ్వదనే భావిస్తున్నా.

న్యాయమూర్తి కూడా పబ్లిక్‌ సర్వెంటే
న్యాయమూర్తి కూడా పబ్లిక్‌ సర్వెంటేనని సుప్రీంకోర్టే గతంలో తీర్పునిచ్చింది. అయితే న్యాయమూర్తికి రాజ్యాంగ పరమైన రక్షణలు ఉన్న మాట వాస్తవమే. దాని అర్థం న్యాయమూర్తి తప్పు చేసినా, అవినీతికి పాల్పడినా చూస్తూ ఉండాలని, వారిపై ఎలాంటి ఫిర్యాదులు చేయడానికి వీల్లేదని కాదు. న్యాయమూర్తులకున్న రక్షణలకు వారిపై తగిన ఆధారాలతో ఫిర్యాదులు చేయడానికి ఎలాంటి సంబంధం లేదు. తమిళనాడు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ వీరాస్వామి కేసే అందుకు ప్రత్యక్ష ఉదాహరణ. జస్టిస్‌ వీరాస్వామి ఇంటిపై సీబీఐ దాడి చేసి పెద్ద మొత్తంలో డబ్బు స్వాధీనం చేసుకుంది. ఈ డబ్బంతా కూడా ఆదాయానికి మించి ఆస్తులగానే పరిగణిస్తూ ఆయనపై కేసు పెట్టింది. ఆయన దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు మొదట్లో స్టే ఇచ్చింది. ఆయన పదవీ విరమణ చెందిన తర్వాత తీర్పునిస్తూ, జడ్జి కూడా పబ్లిక్‌ సర్వెంటేనని చెప్పింది. కేసు నమోదు చేయడాన్ని తప్పు పట్టలేదు. న్యాయమూర్తులేమీ చట్టానికి అతీతులు కాదు. రాష్ట్రపతి మొదలు ఎవరైనా కూడా చట్టానికి లోబడే పని చేయాల్సి ఉంటుంది.

జడ్జీలు అలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం చాలా తప్పు..
న్యాయమూర్తులు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలు చేయడానికి వీల్లేదు. రాజకీయ నాయకత్వం ప్రతి ఐదేళ్లకొకసారి ప్రజల వద్దకు వెళ్లి వారి తీర్పును కోరుతుంది. ప్రజల తీర్పు మేరకు ప్రభుత్వం ఏర్పడుతుంది. ప్రభుత్వ తీరుపై, చర్యలపై అభ్యంతరం ఉంటే, అందుకు సంబంధించిన కారణాలను న్యాయమూర్తులు తమ ఉత్తర్వుల్లో రాయాలి. అంతే కాని ఇష్టమొచ్చినట్లు మాట్లాడటానికి వీల్లేదు. ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడిన మాటలకు రాజకీయ కరపత్రాలుగా పనిచేసే కొన్ని పత్రికలు మరికొన్ని పదాలను జత చేసి కథనాలు రాస్తాయి. ఇవన్నీ చూస్తే పత్రికల కోసం ఇలా ఇష్టమొచ్చినట్లు మాట్లాడినట్లు అనిపిస్తుంది. ఇలా కోర్టులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడటం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఓ దురభిప్రాయం ఏర్పరచినట్లవుతుంది.

రాష్ట్రంలో రాజ్యాంగం అమలులో వైఫల్యం ఉందని న్యాయమూర్తులకు అనిపిస్తే, దాని గురించి వ్యాఖ్యలు చేయడం ఎందుకు? మీ తీర్పుల్లో రాయండి. రాజ్యాంగం వైఫల్యం జరిగిందనే దానిని మీరు ఎలా సమర్థిస్తారో చెబుతూ తీర్పుల్లో ప్రస్తావించండి. అలాంటి అభిప్రాయానికి రావడానికి దారితీసిన పరిస్థితులు ఏంటో రాయండి. ఆ తీర్పుపై అభ్యంతరం ఉంటే ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళుతుంది. అంతిమంగా సుప్రీంకోర్టు తేలుస్తుంది. అంతేకాక రాజకీయ నాయకత్వంపై ప్రజల్లో దురాభిప్రాయం కలిగించేలా వ్యాఖ్యలు చేయడం చాలా తప్పు. ఒక వ్యవస్థ మీద మరో వ్యవస్థ ఇలా దురాభిప్రాయం కలిగించేలా వ్యవహరించరాదు. ఏ వ్యవస్థ ఎక్కువ కాదు.. ఏ వ్యవస్థ తక్కువ కాదు. అలా వ్యాఖ్యలు చేశారనే మేం 2008లో జస్టిస్‌ గోపాల్‌రెడ్డిపై ఫిర్యాదు చేశాం. జస్టిస్‌ నజ్కీ మీద సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్‌పీ కూడా వేశాం.

వారి మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చేశారు 
దర్యాప్తులను ఆపేయడం కూడా తప్పే. దర్యాప్తులను ఆపడానికి వీల్లేదని సుప్రీంకోర్టు ఎన్నోసార్లు ఎన్నో తీర్పుల్లో చాలా స్పష్టంగా చెప్పింది. అమరావతి భూ కుంభకోణం కేసులో నేను ఏసీబీ తరఫున హాజరయ్యాను. ఆ పిటిషన్‌లో పిటిషనర్‌ దమ్మాలపాటి శ్రీనివాస్‌ ఒక్కరే. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కుటుంబ సభ్యులెవ్వరూ పిటిషన్‌ దాఖలు చేయలేదు. దమ్మాలపాటి తన పిటిషన్‌లో హైకోర్టు పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని అడిగారు. ఆయన చేసిన అభ్యర్థనలకూ, న్యాయమూర్తి ఇచ్చిన ఉత్తర్వులకు ఏ మాత్రం పొంతన లేదు. అడగనవి కూడా ఇచ్చేశారు. గ్యాగ్‌ ఆర్డర్‌ ఇచ్చారు. వారి మనసులో ఉన్న కోరికలన్నీ తీర్చేశారు.

వ్యవస్థల మధ్య యుద్ధం కాదు 
శాసన-న్యాయ వ్యవస్థల మధ్య చిన్నపాటి ఘర్షణ ఎప్పుడూ ఉంటుంది. దానిని యుద్ధంగా ఎలా భావిస్తాం. తప్పులు చేస్తున్న జడ్జీల మీద ఫిర్యాదు చేయకుంటే, రాజకీయ నాయకత్వానికి ఉన్న ప్రత్యామ్నాయం ఏంటి? వాళ్లు ఇష్టమొచ్చినట్లు చేస్తుంటే ఎన్నిరోజులు పడాలి? ఫిర్యాదు చేయడానికి ఓ వేదిక ఉండాలి కదా.. న్యాయమూర్తులపై ఫిర్యాదు చేసేందుకు ఉన్న వేదిక సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తే. ఇక్కడ జగన్‌మోహన్‌రెడ్డి చేసింది అదే.

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top