 
													ల్యాబ్ రికార్డు విషయంలో అధ్యాపకుల దురుసు ప్రవర్తన?
మనస్తాపంతో కళాశాల భవనంపై నుంచి దూకిన విద్యారి్థని
చిత్తూరు కలెక్టరేట్/కాణిపాకం: ల్యాబ్ రికార్డుల విషయంలో అధ్యాపకులు దురుసుగా వ్యవహరించడంతో మనస్తాపానికి గురైన ఓ ఇంజినీరింగ్ విద్యార్థి కళాశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. చిత్తూరు నగరానికి సమీపంలోని మురకంబట్టు వద్ద ఉన్న సీతమ్స్ ఇంజినీరింగ్ కాలేజీలో శుక్రవారం ఈ ఘటన జరిగింది. గంగాధర నెల్లూరు మండలం సనివిరెడ్డిపల్లికి చెందిన ఎన్.నందిని(19) సీతమ్స్ ఇంజినీరింగ్ కాలేజీలో బీ.టెక్ (సీఈసీ బ్రాంచ్) మూడో సంవత్సరం చదువుతోంది.
‘నందిని ల్యాబ్ రికార్డులను అధ్యాపకులు తీసుకోకుండా వ్యక్తిగతంగా దూషించి ల్యాబ్ రూమ్ బయట నిలబెట్టారు. అందువల్లే తీవ్ర మనస్తాపానికి గురైన నందిని కళాశాలలో తరగతులు జరుగుతుండగానే ఉదయం 11.20 గంటల సమయంలో అడ్మిని్రస్టేటివ్ బ్లాక్ మూడో అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది’ అని సహచర విద్యార్థులు చెబుతున్నారు. తీవ్రంగా గాయపడిన నందినిని వెంటనే అంబులెన్స్‌లో చిత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వైద్యులు పరిశీలించి మెరుగైన వైద్యం కోసం వెల్లూరులోని ఓ కార్పొరేట్ ఆస్పత్రికి పంపించారు. ఈ ఘటనపై సీతమ్స్ కళాశాల వైస్ ప్రిన్సిపాల్, డీన్ శరవణన్‌ను ‘సాక్షి’ సంప్రదించగా, ఒక్కొక్క విద్యార్థి ఒక్కో విధంగా చెబుతున్నారన్నారు. ఆత్మహత్య చేసుకుంటానని ముందుగానే నందిని తన సెల్‌ఫోన్ స్టేటస్‌లో పెట్టుకున్నట్లు కొందరు విద్యార్థులు చెప్పారని పోలీసులకు ఫిర్యాదు చేశామని, విచారణ చేస్తున్నారని వెల్లడించారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
