మేల్కొని.. కలగంటున్న రామోజీ

Eenadu Media Yellow Media Andhra Pradesh Government - Sakshi

శ్రీలంకలా రాష్ట్రం తయారవ్వాలనే దురాశతో ప్రతిరోజూ పచ్చి అబద్ధాలు

ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధిపై నిజాలకు పాతరేసి భయపెట్టేలా కథనాలు

నిపుణులంటూ కొందరితో వ్యాసాలు.. తరువాత అవే ప్రత్యేక కథనాలు

అర్జెంటుగా వైఎస్‌ జగన్‌కు జనాన్ని దూరం చేసేయాలనే కుతంత్రం

అపసవ్య విదేశాంగ విధానాలు; భారీ రుణాలు; క్షీణించిన విదేశీ కరెన్సీ 

ఫలితంగా విదేశీ కరెన్సీ లేక రుణాలు చెల్లించని స్థితిలో శ్రీలంక 

కేంద్రం పరిమితులకు లోబడి అప్పు చేస్తున్న రాష్ట్రంతో దానికి పోలికేంటి?

సంక్షేమ పథకాలను తక్షణం నిలిపేయాలంటూ బోడి సూచనలెందుకు?

మార్చి నాటికి ఉన్న రూ.3,90,670 కోట్ల రుణాన్ని 4,13,000 కోట్లుగా చెప్పడమేంటి?

రూ.1,50,000 కోట్లు బిల్లులు పెండింగ్‌లో ఉన్నట్టు రామోజీకి  చంద్రబాబు చెప్పారా?

జీఎస్‌డీపీలో అప్పుల శాతం 35.53 నుంచి 32.51 శాతానికి తగ్గటం కనిపించలేదా?

చంద్రబాబు హయాంలో పెరిగిన అప్పులను ఏ ఒక్కనాడూ ప్రస్తావించలేదేం?

సాక్షి అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం శ్రీలంకలా తయారవుతోందని కొద్దిరోజులుగా ‘ఈనాడు’ రకరకాల కథనాలు వండి వారుస్తూనే ఉంది. తనకు మద్దతు పలికేవారు... తెలుగుదేశం సానుభూతి పరులు... వై.ఎస్‌.జగన్‌మోహన్‌ రెడ్డి వ్యతిరేకుల చేత వ్యాసాలు రాయిస్తోంది. అలాంటివారు ఎక్కడ మాట్లాడినా అత్యంత ప్రాధాన్యాంశంగా ప్రచురిస్తోంది. ఇదంతా చూస్తే అర్థమయ్యేదొక్కటే. రామోజీరావుది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ఆందోళన కాదు!...

రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుని దివాలా తీయాలన్న బలమైన కోరిక. తక్షణం శ్రీలంకలా మారిపోవాలన్న దౌర్భాగ్యపు ఆశ. ఇప్పటికిప్పుడు దివాలా తీసేయాలన్న దుర్మార్గపు ఆకాంక్ష. అలా జరిగితే వైఎస్‌ జగన్‌పై ప్రజల్లో వ్యతిరేకత వస్తుందని... రాష్ట్రం సర్వనాశనమైపోయినా సరే తన చంద్రబాబుకు మళ్లీ జవసత్వాలు వస్తాయనేది ఆ పత్రికాధిపతి దింపుడు కల్లం ఆశ. మరీ ఇంత దిగజారుడా..? తన సయామీ కవలలాంటి బాబుకు జనం దూరమయ్యారని తెలిసి... ఆ జనం నాశనమైపోవాలని కోరుకోవటమా? అసలిలాంటి రాతల్ని పాత్రికేయమంటారా? ‘ఈనాడు’ పనిగట్టుకుని వేస్తున్న లెక్కల్లో నిజమెంత? రాతల్లో ఏది సంబంధించి ఏది నిజం? ఒక్కసారి చూద్దాం.

2021– 22 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి... అంటే గతనెల 31నాటికి రాష్ట్ర ప్రభుత్వ రుణం రూ.3,90,670 కోట్లు. దీన్ని ఇటీవలి బడ్జెట్లో అధికారికంగా ప్రభుత్వమే పేర్కొంది. కానీ రామోజీరావుకు ఇదేమీ కనిపించటం లేదు. రాష్ట్ర ప్రభుత్వ రుణమంటూ... తను కలలో చూసిన రూ.4,13,000 కోట్లనే పేర్కొంటున్నారు. ఏకంగా 23వేల కోట్లను పెంచి... విషం చిమ్మటాన్ని ఏమనుకోవాలి? 

ఇదేకాదు... రాష్ట్ర ప్రభుత్వ గ్యారెంటీలపైనా తప్పుడు రాతలే. వివిధ ప్రభుత్వ రంగ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనల మేరకు రూ 1,17,503 కోట్ల రుణాలకు గ్యారెంటీ ఇచ్చింది. ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది కూడా. కానీ ‘ఈనాడు’ మాత్రం 1,38,603 కోట్లుగా తప్పుడు గణాంకాలను అచ్చేసేసింది. ప్రభుత్వం ఏ గ్యారెంటీ ఇవ్వని సంస్థల అప్పులు రూ.75,223 కోట్లన్నట్టు రాసేసింది. దీనికితోడు రూ.1,50,000 కోట్ల బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయనేది మరో అబద్ధం. ఇవన్నీ రామోజీరావు ఊహలే తప్ప... పెండింగ్‌ బిల్లుల గురించి రాష్ట్ర ప్రభుత్వాలు గానీ, కేంద్ర ప్రభుత్వం గానీ ఎన్నడూ అధికారికంగా ప్రకటించింది లేదు. గ్యారంటీ ఇవ్వని అప్పులంటూ ఏ సమాచారమూ లేదు. అయినా సరే... కేంద్రం వద్ద ఈ గణాంకాలున్నాయని వేరే పత్రికేదో రాసిందంటూ... ‘ఈనాడు’ పతాక శీర్షికల్లో అచ్చేసి పారేసింది. 

నిపుణులంటే ఎవరు రామోజీ?
‘ఈనాడు’ రాతల్లో ఎంతటి రోత ఉందో చెప్పటానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. అప్పులు ఎక్కువగా ఉన్న టాప్‌–5 రాష్ట్రాల్లో ఏపీది 4వ స్థానమన్నది ‘ఈనాడు’ కథనం ఎత్తుగడ. ఈ మేరకు వేరేదో ఆన్‌లైన్‌ సైట్లో వార్త వస్తే... తమకు కావలసినట్లుగా ఉంది కనక ఎత్తి పారేశామన్నది ‘ఈనాడు’ భాష్యం. మరి అలా ఎత్తి పోసుకున్నపుడు అందులో ఉన్నది ఉన్నట్టు రాయాలి కదా? ఏపీది నాలుగో స్థానమే కానీ... నిపుణులు చెబుతున్న లెక్కలను బట్టి చూస్తే అప్పుల్లో మొదటి స్థానం వస్తుందనేది రామోజీరావు సొంత భాష్యం. ఎవరా నిపుణులు రామోజీ? నీ సహచరుడు చంద్రబాబేగా? బాబు బయట ఏం చెబితే దానికి ‘ఈనాడు’లో సొంత కథనాలు రాయటం మీకు వైస్రాయ్‌తో పెట్టిన విద్య కాదా? ఇంకా ఎన్నాళ్లిలా?

వాస్తవాలెందుకు పట్టించుకోరు?
చంద్రబాబు ఐదేళ్ల పాలనలో అప్పులు, గ్యారెంటీలు భారీగా పెరిగినా రామోజీ దృష్టిలో అది రామరాజ్యమే. ఇప్పుడు కోవిడ్‌తో రెండేళ్లగా ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ బలహీనపడినా... ఏపీ మాత్రం అత్యంత బలంగా ఉండి తీరాలన్నది ఆయన ఉద్దేశం. బాబు హయాంలో అప్పులు 20.39 శాతం పెరిగితే... ఇంతటి విపత్కర పరిస్థితుల్లో కూడా ప్రస్తుత ప్రభుత్వ హయాంలో పెరిగింది 15.46 శాతమే. ఈ వాస్తవాలన్నిటికీ ముసుగేసి ‘ఈనాడు’ ఆందోళన వ్యక్తంచేయటం కుట్ర తప్ప మరొకటి కాదనే చెప్పాలి. 

అప్పుల తగ్గుదల కనిపించడం లేదా?
నిజానికి రామోజీ రాసినట్లు రాష్ట్రానికి సంబంధించిన అప్పులు, గ్యారెంటీలు ఏవీ ఆందోళనకరంగా లేవు. అప్పులు నిబంధనలకు లోబడే ఉన్నాయి. తాజాగా చూస్తే... రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో (జీఎస్‌డీపీ) అప్పుల శాతం 2020–21లో 35.53 శాతం ఉండగా.. అది 2021–2022 నాటికి 32.51 శాతానికి తగ్గింది. ‘ఈనాడు’ మాత్రం దీన్ని రాస్తే ఒట్టు!!. అయినా శ్రీలంక అనేది ఒక సార్వభౌమ దేశం. పొరుగుదేశాల విషయంలో అది పాటించిన వి«ధానాలతో పాటు... పన్నులు, వడ్డీ రేట్లు పెంచకుండా బయటి రుణాలు తేవటం విదేశీ నిల్వలు తరిగిపోవటానికి కారణమయింది. దీంతో విదేశీ రుణాలు చెల్లించలేక డిఫాల్టవుతోంది. అసలు భారతదేశంలో రాష్ట్రంగా ఉన్న ఏపీతో దానికి పోలికేంటి? వడ్డీ రేట్లపైన, బొగ్గు ధరలపైన రాష్ట్రానికి ఏం  నియంత్రణ ఉంటుంది? మరి ఈ రెండిటినీ పోల్చటమేంటి? ఒకవేళ ఏదైనా రాష్ట్రంలో పరిస్థితి అదుపుతప్పే అవకాశముందని భావిస్తే కేంద్రం హెచ్చరిస్తుందిగా? అవేమీ లేకున్నా రామోజీకి అంత ఆందోళనెందుకు? ఇదంతా పథకం ప్రకారం బాబు గీసిన స్కెచ్‌ ప్రకారం జరుగుతున్న కుట్ర కాదా?

ఈనాడు చెప్పని నిజాలివీ...
2021– 22లో రాష్ట్ర ఆదాయ వసూళ్లు రూ.1,54,272.70 కోట్లు... నికర అప్పులు రూ.41,164 కోట్లు. ఈ అప్పు ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే ఉంది. మొత్తం రూ.1,95,437 కోట్లు. దీన్లో ఉద్యోగుల జీతాలు, ఉద్యోగుల పెన్షన్లు, అప్పుల బాధ్యత, సాధారణ పరిపాలన ఖర్చులు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు రాష్ట్ర వాటా వంటి చట్టపరమైన బాధ్యతలకు చేస్తున్న వ్యయం రూ.1,20,000 కోట్లు. అంటే రాష్ట్ర ఆదాయంలో ఇది 60 శాతం. మిగతా వ్యయం ఉచిత వ్యవసాయ విద్యుత్‌కు రాయితీ, పౌరసరఫరాల సబ్సిడీ, వృద్దాప్య పింఛన్లు, ప్రభుత్వ ఇతర సంక్షేమ కార్యక్రమాలు, నీటి పారుదల, ఇతర ప్రాజెక్టుల నిర్వహణపై చేస్తున్నారు. మరి చట్టపరమైన బాధ్యతలకోసం వెచ్చించాల్సిన మొత్తం రాబడిలో 60 శాతం మాత్రమే ఉన్నపుడు... చట్ట పరమైన బాధ్యతలేవీ తీర్చలేని స్థితిలో ఉన్న శ్రీలంకతో పోల్చటమేంటి? కొంచెం కూడా ఇంగితం లేదనుకోవాలా? 2021–22 ద్రవ్య లోటు రూ.38,224 కోట్లే... ఇది కేంద్రం ఆమోదించిన ఎఫ్‌ఆర్‌బీఎం నిబంధనలకు లోబడే ఉంది. మరి ‘ఈనాడు’కు, దాని నిపుణులకు ఆందోళన ఎందుకు? సంక్షేమ పథకాల్లో కోత పెట్టాలనే అడ్డగోలు సూచనలెందుకు? 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top