ఇదేం ‘పరీక్ష’?

Different procedures for exams in CBSE 10th and 12th classes - Sakshi

సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల్లో పరీక్షలకు వేర్వేరు విధానాలు

టీచర్లు, విద్యార్థుల్లో గందరగోళం

వేర్వేరు విధానాలను ఎలా అనుసరించాలో అర్థం కాక అయోమయం

విద్యార్థులపై ఒత్తిడి పెరిగే ప్రమాదం

ఒకే తరహా పరీక్ష విధానం ఉండాలంటున్న టీచర్లు, పాఠశాలల యాజమాన్యాలు

సాక్షి, అమరావతి: సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌ (సీబీఎస్‌ఈ) విధానం అమలవుతున్న స్కూళ్లలో 10, 12 తరగతుల పరీక్షలకు ఒకే ఏడాది వేర్వేరు విధానాలను అనుసరిస్తుండడంపై విద్యార్థులు, టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకే ఏడాది వేర్వేరు రకాలుగా పరీక్షలు నిర్వహించడం వల్ల విద్యార్థులు సమస్యలు ఎదుర్కొంటారని, పాఠ్యబోధనలో తమకూ ఇబ్బందులు తప్పవని టీచర్లు చెబుతున్నారు. సీబీఎస్‌ఈ ఈ ఏడాది 10, 12 తరగతుల విద్యార్థులకు రెండు టర్మ్‌ల పరీక్షల విధానాన్ని అమల్లోకి తెచ్చింది.

ఇందులో భాగంగా ఒకే ఏడాదిలో ఫస్ట్‌ టర్మ్, సెకండ్‌ టర్మ్‌ పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి ఫస్ట్‌ టర్మ్‌ పరీక్షలు గతేడాది నవంబర్‌–డిసెంబర్‌ల్లో జరిగాయి. బహుళైచ్ఛిక సమాధాన ప్రశ్నలు, ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో ఈ పరీక్షలను నిర్వహించారు. రెండో టర్మ్‌ పరీక్షలను వచ్చే మార్చిలో నిర్వహించే అవకాశాలున్నాయి. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బోర్డు ఇంకా విడుదల చేయలేదు. రెండో టర్మ్‌ పరీక్షలను వ్యాసరూప (డిస్క్రిప్టివ్‌) ప్రశ్నల విధానంలో నిర్వహించాలని నిర్ణయించింది. ఇదే ప్రస్తుతం విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో గందరగోళానికి కారణమవుతోంది. 

ఒకే విధానంలో పరీక్షలు ఉండాలి..
సీబీఎస్‌ఈ 10, 12 తరగతి పరీక్షలు రెండింటికీ ఒకే విధానాన్ని కాకుండా వేర్వేరు విధానాలను అనుసరించడం సరికాదన్నది పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు, టీచర్ల అభిప్రాయం. ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నలతో విద్యార్థుల్లో సృజనాత్మకత, అవగాహన శక్తి, ఇతర నైపుణ్యాలను లోతుగా అంచనా వేసే అవకాశాలు తక్కువని చెబుతున్నారు. వ్యాసరూప ప్రశ్నలతో అయితే విద్యార్థి సమాధానాల తీరును పరిశీలించడం ద్వారా ఆ నైపుణ్యాలను తెలుసుకోగలుగుతామని కొందరు అంటున్నారు.

ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల ద్వారానే విద్యార్థిని లోతుగా, సంపూర్ణంగా అన్ని అంశాల్లో పరిశీలించవచ్చని మరికొందరు వాదిస్తున్నారు. పైగా వివిధ పోటీపరీక్షల్లో ఆబ్జెక్టివ్‌ ప్రశ్నలే ఉంటున్నాయని గుర్తు చేస్తున్నారు. అందువల్ల ఆబ్జెక్టివ్‌ ప్రశ్నల విధానంతో విద్యార్థులకు వాటిని ఎదుర్కొనేలా ముందుగానే తర్ఫీదునిచ్చే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. కాబట్టి ఒక ఏడాదిలో ఈ రెండింటిలో ఏదో ఒక విధానంలోనే పరీక్షలు నిర్వహించడం సరైనదని అంటున్నారు. ఒకే విద్యా సంవత్సరంలో సగం రోజులు ఒక తరహా పరీక్షలకు బోధించి, ఆ వెంటనే మరో తరహాలో బోధించడం కష్టమని వివరిస్తున్నారు. 

విద్యార్థుల విముఖత
విద్యార్థులు కూడా కొన్ని రోజులు ఆబ్జెక్టివ్‌కు అలవాటు పడి.. ఆ వెంటనే డిస్క్రిప్టివ్‌ విధానంలో పరీక్షలు రాయడం కష్టమేనని చెబుతున్నారు. దీనివల్ల వారిపై ఒత్తిడి పెరుగుతుందని అంటున్నారు. రెండు విధానాల్లో పరీక్షలపై విద్యార్థులు కూడా విముఖంగా ఉన్నారని పేర్కొంటున్నారు. ఇప్పటికిప్పుడు వ్యాసరూప ప్రశ్నలకు విద్యార్థులు సన్నద్ధం కావడం కష్టమని వివరిస్తున్నారు. ముఖ్యంగా ఆబ్జెక్టివ్‌ తరహా ప్రశ్నల ద్వారా గణితం, అర్థశాస్త్రం వంటి సబ్జెక్టులను నేర్చుకున్న విద్యార్థులు.. ఇప్పుడు వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడానికి చాలా కష్టపడాల్సి వస్తుంది. అందువల్ల ఒక ఏడాదికి ఒకే తరహా పరీక్షలు పెడితే ఇబ్బంది ఉండదని అంటున్నారు. ఇప్పటికే పలు పాఠశాలల విద్యార్థులు, తాము సీబీఎస్‌ఈకి ఈ విషయంలో విజ్ఞప్తి చేశామని టీచర్లు చెబుతున్నారు. 

Read latest Andhra Pradesh News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top